Coffee for Fatty Liver: కప్పు కాఫీతో కాలేయ సమస్యకు గుడ్‌బై చెప్పొచ్చట!
కాఫీ ఆరోగ్యానికి మంచిదనే విషయం మరోసారి రుజువైంది. కాఫీ తాగడం వల్ల మధుమేహం, ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడొచ్చని కొత్త అధ్యయనం వెల్లడించింది.
అధిక బరువు, మధుమేహం, ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే మీకు ఒకే ఒక చక్కటి పరిష్కారం చూపిస్తుంది కొత్త అధ్యయనం. అదే రోజుకు ఒక కప్పు కాఫీ తాగడం. రోజూ కొద్దిగా కాఫీ తాగడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(NAFLD) తీవ్రతను తగ్గించగలదని యూనివర్సిటీ ఆఫ్ కోయింబ్రాకి చెందిన కొత్త అధ్యయనం వెల్లడించింది. కాఫీలో ఉన్న కెఫీన్, పాలీఫెనయల్స్ ఇతర సహజ సమ్మేళనాలు ఈ సమస్య నుంచి బయట పడేయగలవని కనుగొన్నారు. అయితే కాఫీ మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అసలు ఏంటి ఈ నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్?
నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే మద్యం తీసుకున్నా తీసుకోకపోయినా ఫ్యాటీ లివర్ బారిన పడతారు. ఫ్యాటీ లివర్ సమస్య తీవ్రరూపం దాల్చి హెపటైటిస్, లివర్ సిర్రోసిస్‌కు దారి తీస్తుంది. ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు మధుమేహం, హైపర్ టెన్షన్, అధిక బరువు, స్థూలకాయం, అధిక కొలెస్ట్రాల్, హైపోథైరాయిడిజం.
మధుమేహ రోగులు ఫ్యాటీ లివర్ బారిన ఎందుకు పడతారు?
టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగుల్లో ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది. దాని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి ఇతర జీవనశైలి వల్ల కూడా మధుమేహం అదుపులో ఉండదు. ఈ వ్యాధులన్నీ కాలేయంలో కొవ్వు నిల్వలకు దారితీస్తాయి. దీని వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది. ఇది కాలేయం వాపుకి కారణం అవుతుంది. దీన్నే హెపటైటిస్ అని అంటారు. వ్యాధి ముదిరి కాలేయం దెబ్బతిని లివర్ సిర్రోసిస్ కు దారితీస్తుంది.
కాఫీ ఎలా ఉపయోగపడుతుంది?
ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించడంలో కాఫీ కీలక పాత్ర పోషిస్తుంది. కాఫీలోని పాలీఫెనాల్స్ కాలేయంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫైబ్రోసిస్ ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు గ్లూకోజ్ హోమియోస్టాసిస్ ను మెరుగుపరుస్తుందని ఈ అధ్యయనం సూచిస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఆక్సీకరణ నష్టం జరుగుతుంది. అందుకే ఆక్సీకరణ ఒత్తిడి వల్ల మధుమేహం ఉన్న రోగుల్లో కాలేయం దెబ్బతింటుంది. దాని నుంచి బయట పడాలంటే తాజా పండ్లు, ఆకుకూరలు, మల్టీ విటమిన్ల సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది. ఇవి అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించి కాలేయాన్ని కాపాడతాయి. అయితే ఒకసారి సిర్రోసిస్ బారిన పడితే మాత్రం కాలేయాన్ని కాపాడుకోవడం కొంచెం కష్టమే.
ఫ్యాటీ లివర్ నుంచి బయట పడాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. సీజనల్ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, కాఫీ, పాలు తీసుకోవాలి. వాటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ముఖ్యమే. దీని వల్ల షుగర్ లేవల్స్ అదుపులో ఉండటమే కాదు కొలెస్ట్రాల్ స్థాయిలని నియంత్రించి, రక్తపోటుని అదుపులో ఉంచుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.