Jaggareddy: సినిమాల్లోకి మాస్ లీడర్ 'జగ్గారెడ్డి' - స్టోరీగా ఆయన పొలిటికల్ జర్నీ, గ్లింప్స్ రిలీజ్!
Jaggareddy Movie: తెలంగాణ మాస్ లీడర్ జగ్గారెడ్డి జీవిత కథ ఆధారంగా 'జగ్గారెడ్డి - ఏ వార్ ఆఫ్ లవ్' మూవీ తెరకెక్కబోతోంది. దీనికి సంబంధించి టీజర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.

Jaggareddy Movie Teaser Released: మాస్ లీడర్, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయన టైటిల్ రోల్‌లో 'జగ్గారెడ్డి - ఏ వార్ ఆఫ్ లవ్' సినిమా తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో ఆయన పొలిటికల్ జర్నీతో పాటు విద్యార్థి నాయకుడి నుంచి లీడర్‌గా ఎదిగిన తీరును చూపించబోతున్నారు.
టీజర్ గ్లింప్స్ రిలీజ్
'జగ్గారెడ్డి' మూవీని పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తుండగా.. ఇటీవల రిలీజైన ఫస్ట్ పోస్టర్ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా.. మూవీ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీం. ఇందులో మోస్ట్ పవర్ ప్యాకెడ్ మాస్ లీడర్‌గా జగ్గారెడ్డి కనిపించారు. 50 సెకన్ల పాటు ఉన్న టీజర్‌లో.. 'దెబ్బలు పడే కొద్దీ శిల్పంలా మారడానికి రాయి కాదు. తగిలే ప్రతి దెబ్బను ఆయుధంగా మార్చుకునే జగ్గారెడ్డి. సంగారెడ్డి జగ్గారెడ్డి' అంటూ సాగే డైలాగ్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు రామానుజం.. డైరెక్టర్, రైటర్ కాగా జయలక్ష్మీ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
సినిమా ఆఫీస్ ప్రారంభం
ఈ సినిమా ఆఫీస్‌ను ఉగాది పండుగ సందర్భంగా నందినగర్‌లో జగ్గారెడ్డి అండ్ టీం ప్రారంభించారు. జగ్గారెడ్డి కుమార్తె జయలక్ష్మీ రెడ్డి, భరత్ సాయిరెడ్డి పూజలో పాల్గొన్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలోనే సినిమా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
Also Read: మూడు రోజుల్లోనే 'మ్యాడ్ స్క్వేర్' రికార్డు కలెక్షన్లు - థియేటర్లలో నవ్వుల వసూళ్లు ఎంతో తెలుసా?
'నా ప్రయాణమే ఈ సినిమా'
'జయలక్ష్మీ సినిమాస్' పేరుతో ఆఫీస్ ప్రారంభించామని.. తన ప్రయాణమే ఈ సినిమా అని జగ్గారెడ్డి అన్నారు. 'దర్శకుడు రామానుజం చూపించిన జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ పోస్టర్‌కి మొదట ఆకర్షితుడునయ్యాను. ఆ తర్వాత ఆయన చెప్పిన కథ నాకు నచ్చింది. అందులో నా పాత్ర నాదే. ఎవరో రాసిన మాటలు పాత్రలుగా నేను ఉండను.
అంతా ఒరిజినల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెరమీద చూస్తారు. విద్యార్థి నాయకుడిగా మొదలైన నా ప్రయాణం రాష్ట్ర నాయకుడి వరకూ వచ్చిందంటే అందులో చాలా మలుపులున్నాయి. కుట్రలు, కుతంత్రాలు, హత్యా ప్రయత్నాలు దాటుకొని ఇంతవరకూ చేరిన నా జర్నీ ఈ స్టోరీలో కనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీ లో కూడా నాప్రయాణం మొదలైంది. దీనికి అడ్డా గా ఈ ఆఫీస్ ఉంటుంది. ఇది జగ్గారెడ్డి అడ్డా అనుకోండి.' అని అన్నారు.
'ఆయన రుణం తీర్చుకుంటా'
తనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన జగ్గారెడ్డికి మంచి సినిమా ఇచ్చి రుణం తీర్చుకుంటానని రామానుజం తెలిపారు. 'సంగారెడ్డికి వెళ్లి జగ్గారెడ్డి గారి గురించి తెలుసుకున్నాను. ఇందులో ఆయన పాత్రతో పాటు మంచి ప్రేమకథ కూడా ఉంటుంది. జగ్గారెడ్డి పాత్ర అద్దంలా ఉంటుంది. కానీ దాన్ని పగులకొడితే ఓ ఆయుధం అవుతుంది. అదే ఆయన పాత్ర. జగ్గారెడ్డి ఎంత మాస్ లీడరో అందరికీ తెలుసు. ఆయన జీవితంలోని ముఖ్య సంఘటనలు ఈ సినిమాలో కనిపిస్తాయి.' అని పేర్కొన్నారు.
తన తండ్రి జగ్గారెడ్డి జీవితంలో కొన్ని సంఘటనలు విన్నానని.. వాటిని తెర మీద చూడబోతున్నామనే ఆలోచనే తనను ఎగ్జైట్‌కు గురి చేస్తుందని నిర్మాత జయలక్ష్మీ రెడ్డి అన్నారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని చెప్పారు. త్వరలోనే టెక్నీషిషన్స్, మిగతా నటీనటుల వివరాలు ప్రకటిస్తామన్నారు.






















