Rashmika Mandanna: 'స్టోరీనే ఫైనల్.. కథ బాగుంటే బామ్మ రోల్ అయినా ఓకే' - నేషనల్ క్రష్ రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rashmika: తన పాత్రలకు సంబంధించి నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కథకే ప్రాధాన్యమిస్తానని.. కథ బాగుంటే బామ్మ పాత్రలు సైతం చేయడానికి వెనుకాడనని చెప్పారు.

Rashmika Mandanna Interesting Comments On Grand Mother Role: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. ఇటీవల విడుదలైన 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించగా.. తాజాగా విడుదలైన 'ఛావా' (Chhava) సైతం మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఎవరైనా తనను సినిమా కోసం సంప్రదించినప్పుడు కథకు అధిక ప్రాధాన్యమిస్తానని.. కథ బాగుంటే నలుగురు పిల్లల తల్లిగానైనా నటిస్తానని అన్నారు. బామ్మ పాత్ర చేయడానికైనా వెనుకాడనని స్పష్టం చేశారు. 'నేను జీవితాన్ని సీరియస్‌గా తీసుకోను. ఏదో శక్తి నన్ను నడిపిస్తుందని నమ్ముతాను. ప్రతీ దాని గురించి ఆలోచిస్తే లైఫ్ చాలా కష్టతరం అవుతుంది. అందుకే దేన్నీ కూడా సీరియస్‌గా తీసుకోకుండా కాలంతో పాటు ముందుకు సాగుతాను.
నిజాయితీగా నా పని నేను చేసుకుంటూ పోతాను. కథ నచ్చి అందులో భాగం కావాలనుకుంటే ఎలాంటి పాత్రకైనా ఓకే చెప్తాను. నా సినిమాల విజయం వెనుక ఎలాంటి ప్రణాళికలు లేవు. అలాంటి గొప్ప కథల్లో భాగం కావడం నా అదృష్టం. సినిమాల విజయం మన చేతుల్లో ఉండదు. ఆడియన్స్ ఆ పాత్రల్లో నన్ను ఇష్టపడుతున్నందుకు ఆనందంగా ఉంది.' అని రష్మిక పేర్కొన్నారు.
'ఆ పాత్రకు నిజంగా గర్వపడతున్నా'
అటు, తన తాజా చిత్రం 'ఛావా' గురించి కూడా రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో యేసుబాయిగా నటించే అవకాశం వచ్చినందుకు నిజంగా గర్వపడతున్నట్లు చెప్పారు. 'సాధారణంగా హీరోలందరూ ఇలాంటి కథలో భాగం కావాలని కోరుకుంటారు. ఛత్రపతి శివాజీ మహరాజ్, ఆయన కుమారుడు శంభాజీ మహరాజ్ గురించి మనం పుస్తకాల్లో చదివినప్పుడు ఎమోషన్స్ తెలియవు. వారి జీవితాలను తెరపై చూస్తున్నప్పుడు మాత్రం కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. అలాంటి గొప్ప వ్యక్తుల వల్లే మనం ఈ రోజు దేశంలో ఉండగలుగుతున్నాం. 'ఛావా'లో మహారాణి పాత్రలో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది.' అని రష్మిక తెలిపారు. కాగా, ప్రస్తుతం రష్మిక రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'ది గర్ల్‌ఫ్రెండ్', సల్మాన్ ఖాన్ - మురుగదాస్ కాంబోలో రూపొందుతోన్న 'సికిందర్', అలాగే ధనుష్-శేఖర్ కమ్ముల 'కుబేర' చిత్రాల్లో నటిస్తున్నారు.
'ఛావా' అరుదైన రికార్డు
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన 'ఛావా' సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంబాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. శంభాజీ మహరాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయిగా రష్మిక ఆ పాత్రలకు జీవం పోశారని నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మూవీ ప్రీ సేల్ బుకింగ్స్‌లో ఏకంగా 5 లక్షల టికెట్స్ అమ్ముడైనట్లు మూవీ టీం పేర్కొంది. ఓ పీరియాడికల్ సినిమాకు ఈ రేంజ్‌లో ఓపెనింగ్స్ రావడం ఇదే తొలిసారని నిర్మాతలు పేర్కొన్నారు. వీకెండ్ దృష్ట్యా స్క్రీన్ల సంఖ్యను పెంచుతున్నట్లు చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

