Chhaava Telugu Release: తెలుగులో విడుదలకు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఛావా' రెడీ... ఎన్టీఆర్ డబ్బింగ్‌లో నిజమెంత?
Chhaava Telugu Release Date: ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఛావా' సినిమా తెలుగు ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీ అయింది. తెలుగు డబ్బింగ్ ఎప్పుడు రిలీజ్ కానుందంటే?

ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు... మొఘల్ మహారాజ్ ఔరంగజేబు ఎన్ని చిత్రహింసలు పెట్టినా సరే ధైర్యంగా నిలబడి భారతీయ స్వరాజ్య కాంక్షను చాటిన ధీరుడు, ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన హిందీ సినిమా 'ఛావా'. హిందీలో ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు. 'ఛావా' తెలుగు డబ్బింగ్ ఎప్పుడు రిలీజ్ కానుందో తెలుసా?
మార్చి 7న తెలుగులో 'ఛావా' విడుదల
హిందీలో విడుదల అయిన మూడు వారాలకు 'ఛావా' సినిమాలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను మార్చి 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని అధికారికంగా వెల్లడించనున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగులో ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుకు వచ్చింది.
హీరో పాత్రకు ఎన్టీఆర్ డబ్బింగ్ చెబుతున్నారా?
'ఛావా' తెలుగు విడుదల మీద రకరకాల ప్రచారం జరుగుతోంది. ఆ వార్తల్లో ఒకటి... 'హీరో పాత్రకు మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పనున్నారు' అని. అందులో ఎంత మాత్రం నిజం లేదని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు తెలిపారు. 'దేవర' జపాన్ రిలీజ్ ప్రచార కార్యక్రమాలలో ఆయన బిజీగా ఉన్నారు.
#ChaavaTheMovie
— Rajesh Manne (@rajeshmanne1) February 26, 2025
తెలుగు డబ్బింగ్ రాబోతుంది... @GeethaArts తెలుగు వర్షన్ రిలీజ్ చేయబోతున్నారు.
మార్చ్ 7 నుండి తెలుగులో...pic.twitter.com/n68fFM1GvL
హిందీలో 'పుష్ప 2' రికార్డులకు బీటలు... బద్దలు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన 'పుష్ప 2 ది రూల్' బాలీవుడ్ బాక్సాఫీస్ బరిలోనూ బోలెడు రికార్డులు క్రియేట్ చేసింది. హిందీ లాంగ్వేజ్ వసూళ్ల విషయానికి వస్తే... హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. తక్కువ సమయంలో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన రికార్డు కూడా అల్లు అర్జున్ సినిమా పేరిట ఉంది. అది 'ఛావా' విడుదల ముందు వరకు. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల నుంచి వినబడుతున్న సమాచారం ప్రకారం... ఆల్రెడీ ఆ రికార్డులకు బీటలు మొదలు అయ్యాయి. మరికొన్ని రోజుల్లో 'పుష్ప 2' హిందీ రికార్డులు అన్నిటినీ 'ఛావా' బ్రేక్ చేయడం కన్ఫర్మ్. వరల్డ్ వైడ్ రికార్డ్స్, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రికార్డులను 'ఛావా' బ్రేక్ చేయడం అసాధ్యం అని చెప్పాలి.
'ఛావా' సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో యంగ్ హీరో విక్కీ కౌశల్ నటించారు. ఆయన సరసన శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించారు. వాళ్ళిద్దరిని నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు, నేపథ్య సంగీతం సైతం ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకున్నాయి. మరి తెలుగులో ఈ సినిమాకు ఎటువంటి స్పందన లభిస్తుందో చూడాలి.
Also Read: 'లైలా'ను థియేటర్లలో మిస్ అయ్యారా... డోంట్ వర్రీ, మార్చిలోనే ఓటీటీ రిలీజ్... ఎప్పుడో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

