NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
NEET UG: నీట్ యూజీ పరీక్షను రద్దు చేయవద్దంటూ నీట్ ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కేంద్రాన్ని, ఎన్టీఏను ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరాయి.
![NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే? Over 50 successful NEET UG candidates move Supreme Court for direction against any bid to cancel exam NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/60e78d21524e12c7d336572b083126a01720100501639522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
NEET UG Rankers Petition in Supreme Court: దేశవ్యాప్తంగా నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు పరీక్షను రద్దుచేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. అయితే నీట్-యూజీ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దాఖలైన 26 పిటిషన్లపై సుప్రీం కోర్టు జులై 8న విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా 56 మంది నీట్ ర్యాంకర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నీట్ యూజీ పరీక్షను రద్దు చేయకుండా కేంద్రంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)ని ఆదేశించాలని కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.
పరీక్ష రద్దు అనేది నిజాయతీగా, కష్టపడి చదివే విద్యార్థులకు ఎంతో నష్టమని, అది విద్యాహక్కు ఉల్లంఘనకూ దారితీస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి నీట్ యూజీ పరీక్షను రద్దు చేయకుండా కేంద్రంతోపాటు ఎన్‌టీఏకు ఆదేశాలివ్వాలు జారీచేయాలని గుజరాత్‌కు చెందిన సిద్ధార్థ్ కోమల్ సింగ్లాతోపాటు మరో 55 మంది విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మే 5న నిర్వహించిన నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షలో లీకేజీకి కారకులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖను ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
నీట్ యూజీ పరీక్ష సమయంలో కోల్పోయిన సమయానికి పరిహారంగా 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో గ్రేస్ మార్కులు పొందిన ఆ 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను కేంద్రం రద్దు చేసింది. ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించింది. ఈమేరకు జూన్ 23న పరీక్ష నిర్వహించింది. జూన్ 30న ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్టీఏ, జులై 1న ఫలితాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1563 అభ్యర్థులకు నీట్ యూజీ రీఎగ్జామ్ నిర్వహించగా కేవలం 813 మంది (52 శాతం) మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. మిగిలిన 48 శాతం మంది అభ్యర్థులు గ్రేస్ మార్కులు మినహాయించి ఒరిజినల్ స్కోర్లను ఎంచుకున్నారు. అయితే ఈ సారి పరీక్షరాసిన 813 మందిలో ఒక్కరికి కూడా 720/720 మార్కులు సాధించలేకపోయారు. దీంతో నీట్ టాపర్ల సంఖ్య 67 నుంచి 61కి పడిపోయింది.
దేశంలో వరుస పేపర్ లీకుల నేపథ్యంలో అందుకు కారణమయ్యే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకుగాను యుద్ధప్రాతిపదికన 'ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్(Public Examinations (Prevention of Unfair Means) Act, 2024)యాక్ట్ - 2024ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశపరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. పేపరు లీక్ చేసేవాళ్లకు 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలుశిక్షతోపాటు రూ.కోటి వరకు జరిమానా విధించే వెసుబాటు ఉంది. ఇందులో భాగస్వాములు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే.. వారి ఆస్తులనూ జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునూ వారినుంచే వసూలు చేస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)