RBI MPC: రెపో రేట్ పెంపును ఎందుకు ఆపలేదు, గవర్నర్ భయాలేంటి, ఎంపీసీ మీటింగ్‌లో ఏం జరిగింది?
ప్రపంచ ఆర్థిక మార్కెట్ అస్థిరతలను దృష్టిలో ఉంచుకుని, వడ్డీ రేట్ల పెంపును తాత్కాలికంగా నిలిపివేయడం సరికాదు అని దాస్ అన్నారు.
RBI MPC Minutes: 2023 ఫిబ్రవరి 6-8 తేదీల్లో జరిగిన రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన సమావేశం (Monetary Policy Committee Meeting) వివరాలు (Minutes) విడుదలయ్యాయి. బుధవారం విడుదల చేసిన MPC మినిట్స్ ప్రకారం... అధిక ద్రవ్యోల్బణంపై RBI గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, వడ్డీ రేట్ల పెంపులో వేగాన్ని తగ్గించడానికి మొగ్గు చూపారు.
అయితే, ద్రవ్యోల్బణం పరిస్థితి, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక మార్కెట్ అస్థిరతలను దృష్టిలో ఉంచుకుని, వడ్డీ రేట్ల పెంపును తాత్కాలికంగా నిలిపివేయడం సరికాదు అని దాస్ అన్నారు.
ఆర్‌బీఐ గవర్నర్ ఇంకా ఏం మాట్లాడారు?
"రెండు అంశాల దృష్ట్యా రేట్ల పెంపు వేగాన్ని మనం తగ్గించాలి: (i) గత పాలసీ నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో అమలై, ఫలితాలు అందించేందుకు తగిన సమయం ఇవ్వాలి; (ii) వడ్డీ రేట్లను ఇప్పుడు తాత్కాలికంగా నిలిపేయడం అకాల నిర్ణయం అవుతుంది. కాబట్టి, పాలసీ రెపో రేటులో 25 బేసిస్ పాయింట్ల పెంచి 6.50 శాతానికి చేర్చే ప్రతిపాదనకు అనుకూలంగా నేను ఓటు వేస్తున్నాను. అభివృద్ధి చెందుతున్న స్థూల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా భవిష్యత్ ద్రవ్య విధాన నిర్ణయాలు తీసుకోవడానికి తగిన వేదికను ప్రస్తుత రేటు పెంపుదల చక్రం అందిస్తుంది” అని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు.
మొత్తంగా చూస్తే, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక మార్కెట్ అస్థిరత, పెరుగుతున్న చమురుయేతర కమొడిటీల ధరలు, అస్థిరంగా ఉన్న ముడి చమురు ధరలు, పర్యావరణానికి సంబంధిత సంఘటనలను దృశష్టిలో ఉంచుకుని చూస్తే, పెరుగుతున్న ద్రవ్యోల్బణం విషయంలో ప్రస్తుత పరిస్థితుల్లో అనిశ్చితి కొనసాగుతోంది.
"ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తగ్గించే లక్ష్యం కోసం మనం స్థిరంగా ఉండాలి. ద్రవ్యోల్బణం అంచనాలు పెరగకుండా చూడడానికి, ప్రధాన ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రస్తుత MPC సమావేశంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం" అని ద్రవ్య విధాన సమావేశంలో దాస్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన అనిశ్చితులు కొనసాగుతున్నా.. భారతదేశంలో స్థూల ఆర్థిక స్థిరత్వ అనుకూల వాతావరణం ఉంది; ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకంగా ఉంది; ద్రవ్యోల్బణం గత రెండు నెలల్లో 6 శాతం కంటే తక్కువగా ఉంది; ఆర్థిక ఏకీకరణకు పట్టు దొరికింది; కరెంట్ ఖాతా లోటు నియంత్రణ సంకేతాలు అందుతున్నాయి; విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు మెరుగుపడ్డాయి; బ్యాంకింగ్ రంగం ఆరోగ్యంగా ఉంది అని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు.
4-2 ఓట్ల తేడాతో రెపో రేటు పెంపు
అయితే, ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యుడు జయంత్ వర్మ, రెపో రేటు పెంపును వ్యతిరేకిస్తూ ఆ సమావేశంలో ఓటు వేశారు. ఇకపై రెపో రేటును పెంచాల్సిన లేదని వాదించారు.
ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు రెపో రేటు పెంపునకు అనుకూలంగా ఓటు వేశారు. లక్ష్యిత స్థాయి కంటే ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా ఉందని వారు అభిప్రాయపడ్డారు. రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచేందుకు అంగీకారం తెలిపారు.
ఫిబ్రవరి 8న, MPC సమావేశం తర్వాత, RBI రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. 9 నెలల్లో ఇది ఆరో దఫా పెంపు.
రెపో రేటును పెంచుతూ RBI ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత, జనవరి నెలలో, రిటైల్ ద్రవ్యోల్బణం RBI 6 శాతం టాలరెన్స్ బ్యాండ్‌ను దాటింది, 6.52 శాతానికి చేరుకుంది.