CM Effigy Burnt: ఆ వ్యాఖ్యలు చేసిన రోజాపై చర్యలెందుకు లేవు?: TNSF, సీఎం దిష్ఠిబొమ్మ దగ్ధం
ఏపీ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దగ్ధం విశాఖపట్నంలో జరిగింది. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా? అంటూ వారు ప్రశ్నించారు
బీసీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ ఏపీ టీఎన్ఎస్ఎఫ్ (Telugu Nadu Students Federation) ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా? అంటూ వారు ప్రశ్నించారు. ఈ మేరకు ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దగ్ధం జరిగింది.
‘‘బీసీ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు సిగ్గుచేటు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై సంస్థాగత నేరాలను పోలీసులతో ప్రభుత్వమే చేయిస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. 70 సంవత్సరాల వయసున్న పెద్దాయనపై నిర్భయ కేసు పెట్టడం సిగ్గుమాలిన చర్య. మూడు సంవత్సరాల కాలంలో అయ్యన్నపాత్రుడుని జగన్ రెడ్డి అనేక విధాలుగా వేధింపులకు గురి చేశారు. జగన్ రెడ్డి పాలనలో శని, ఆది వారాలు విధ్వంస దినాలుగా మారిపోయాయి.’’
‘‘జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్య వ్యవస్థలను విధ్వంసం చేశారు. ఒకే సంఘటనపై, ఒకే వ్యక్తిపై 12 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం కాదా? మగవాళ్ళను మీరు మగాళ్ళు కాదు అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి బూతులు తిట్టే మంత్రి రోజాపై కేసులు మాత్రం లేవు. మగాళ్ళో కాదో టెస్ట్ చేయమన్నందుకు అయ్యన్నపాత్రుడు గారిపై కేసులు పెడతారా? ఉత్తరాంద్రకు పట్టిన శని విజయసాయిరెడ్డి. బీసీలను ఎస్సీలు ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయిస్తున్నారు.’’
‘‘వైసీపీ పెద్దలు చెప్పిందల్లా చేసి అధికారులు లబ్ధి పొందాలనుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అయ్యన్నపాత్రుడుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి పోలీసుల వేధింపులు ఆపకుంటే ఛలో అనకాపల్లి కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను వేధించే చర్యలు మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.’’ అని టీఎన్ఎస్ఎఫ్ నేతలు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్, విశాఖ పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఎస్ రతన్ కాంత్, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు డెక్క ఈశ్వరరావు, బోండా రవికుమార్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మహమ్మద్ అస్సలామ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.