Selfie Video Viral: మా శవాలే సీఎంకు కానుక... సెల్ఫీ వీడియోలో బాధితుడు
కడప జిల్లా మైదుకూరు రూరల్ సీఐ, డీసీసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ ల నుండి ప్రాణహాని ఉందని అక్బర్ బాషా అనే వ్యక్తి తీసుకున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని ఆయన సెల్ఫీ వీడియోలో తెలిపారు. దువ్వూరు మండలానికి చెందిన ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డితో జరుగుతున్న భూవివాదంలో మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అక్బర్ బాషా ఆరోపించారు. తనకు న్యాయం చేయక పోగా స్టేషన్ లోనే ఎన్ కౌంటర్ చేస్తానని సీఐ కొండారెడ్డి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామానికి చెందిన మిద్దె అక్బర్ బాషకు దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామంలో దాన విక్రయం కిందట ఎకరం పొలం రిజిస్టర్ చేయించుకున్నాడు. కానీ రెండు సంవత్సరాల క్రితం జోన్నవరం రామలక్ష్మి రెడ్డి అనే వ్యక్తికి అదే పొలాన్ని అక్బర్ అత్త అమ్మడంతో వ్యవహారం కోర్టుకెక్కింది. ఈ కేసు విత్ డ్రా చేసుకోమని సీఐ కొండారెడ్డి, ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి తమను బెదిరిస్తున్నారని అక్బర్ ఆరోపిస్తున్నారు. కేసు వెనక్కి తీసుకోకపోతే తన కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కలగజేసుకుని 48 గంటల్లో తమకు న్యాయం చేయకుంటే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని అక్బర్ భాష ఇంటర్ నెట్ లో సెల్ఫీ వీడియో పెట్టారు.