Pirated Content Consumption: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?
Piracy In India: భారతదేశంలో పైరసీ భూతం ఎంతగా వేళ్లూనుకుపోయిందో ఈవై, ఐఏఎంఏఐ కలిసి రూపొందించిన ‘ది రాబ్ రిపోర్టు’ వెల్లడింది. పైరసీ ఆదాయం సంవత్సరానికి రూ.22,400 కోట్ల వరకు ఉందని పేర్కొంది.
Piracy Statistics India: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌లో 50 శాతాన్ని ఆదార్ పూనావాలాకు చెందిన సెరీన్ ప్రొడక్షన్స్‌కు రూ.1,000 కోట్లకు విక్రయించిన వార్తలు ఇండస్ట్రీని కుదిపేశాయి. ఈ మధ్యకాలంలో ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. దీంతోపాటు సినిమాల నిర్మాణ వ్యయం కూడా ఎక్కువ అయిపోయింది. రికవరీ కష్టం అయింది. అయితే వీటన్నిటి కంటే ఇండస్ట్రీ ఎక్కువగా కుదిపేస్తున్న విషయం మరొకటి ఉంది. అదే పైరసీ.
ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ భూతం డిజిటల్ ప్లాట్‌ఫాంలను కూడా వదలట్లేదు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫాంల్లో ఉండే కంటెంట్ అంతా పైరసీలో కూడా అందుబాటులో ఉంది. దీని కారణంగా మంచి కంటెంట్‌కు కూడా డబ్బులు రావడం లేదు. భారత పైరసీ ఎకానమీ విలువ 2.7 బిలియన్ డాలర్ల (మనదేశ కరెన్సీలో రూ.22,400 కోట్లు) వరకు ఉంటుందని ఎర్న్‌స్ట్ అండ్ యంగ్ (ఈవై), ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) కలిసి విడుదల చేసిన ‘ది రాబ్ రిపోర్ట్’లో పేర్కొన్నారు.
చాలా భారీగా పైరసీ ఎకానమీ
భారతదేశంలో మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో పైరసీ ఏ స్థానంలో ఉందో తెలుసా? 2023లో టెలివిజన్ రంగం రూ.69,600 కోట్లతో మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో ప్రథమ స్థానంలో ఉంది. రూ.65,400 కోట్లతో డిజిటల్ మీడియా రెండో స్థానంలో ఉంది. రూ.26,600 కోట్లతో ప్రింట్ మీడియా మూడో స్థానంలో ఉంది. ఈ మూడు రంగాల తర్వాత రూ.22,400 కోట్లతో పైరసీ నాలుగో విభాగంలో ఉంది. గేమింగ్ రంగం రూ.22,000 కోట్లతో ఐదో స్థానంలో ఉంది.
ఆశ్చర్యకరంగా ఫిల్మ్‌డ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి బాలీవుడ్, ఇతర ప్రాంతీయ భాషా చిత్రాల నుంచి రూ.19,700 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే ఇది పైరసీ కంటే తక్కువ అన్నమాట. ఒకవేళ పైరసీ భూతం అనేది లేకపోతే ఓటీటీ, ఫిల్మ్‌డ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు ఎంత ఆదాయం పెరిగేదో మీరో ఒక్కసారి ఊహించుకోండి. నిజానికి ఈ రంగాలకు రావాల్సిన ఆదాయమే పైరసీకి వెళ్లింది. దీంతో ఇది ఇండస్ట్రీకి బాగా ఛాలెంజ్‌గా మారింది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
వినియోగదారులు పైరసీ ఎందుకు చూస్తున్నారు?
అసలు వినియోగదారులు ఒరిజినల్‌ని కాకుండా పైరసీని ఎందుకు చూస్తున్నారో తెలుసుకోవడానికి ‘ది రాబ్ రిపోర్టు’ను రూపొందించే క్రమంలో ప్రయత్నించారు. దీనికి వారికి ప్రధానంగా మూడు కారణాలు దొరికాయి.
1. ఎక్కువ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవాల్సి రావడం: వేర్వేరు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంల్లో కంటెంట్ కోసం మల్టీపుల్ సబ్‌స్క్రిప్షన్ మెయింటెయిన్ చేయడం కష్టమని వినియోగదారులు భావించడం.
2. కావాల్సిన కంటెంట్ దొరక్కపోవడం: అందుబాటులో ఉన్న స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంల్లో తమకు కావాల్సిన కంటెంట్ దొరక్కపోవడం.
3. ఎక్కువ అవుతున్న సబ్‌స్క్రిప్షన్ ధరలు: ఓటీటీ ప్లాట్‌ఫాం సబ్‌స్క్రిప్షన్ ధరలు ఎక్కువ అని వినియోగదారులు అవ్వడం.
వినియోగదారుడు తాము చూసే కంటెంట్‌కు పే చేయకూడదని అనుకోవడం వల్లే ఎంటర్‌టైన్‌మెంట్ రంగం రెవిన్యూ కోసం వేర్వేరు సోర్సులపై ఆధారపడేలా చేస్తుందని ‘ది రాబ్ రిపోర్టు’ తేల్చింది.
ఈవై-ఐఏఎంఏఐ సర్వే ప్రకారం పైరసీ కంటెంట్ చూసే వారిలో 84 శాతం మంది సినిమా టికెట్లకు డబ్బులు పెట్టాలని అనుకోవడం లేదు. 70 శాతం మంది ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లకు డబ్బులు పెట్టాలని అనుకోవడం లేదు. 64 శాతం మంది అధికారిక ప్లాట్‌ఫాంల్లో చూడటానికి సిద్ధంగా ఉన్నారు. యాడ్స్ వేసినా సరే... కేవలం ఉచితంగా అయితేనే చూస్తామని, డబ్బులు మాత్రం పెట్టడానికి సిద్ధంగా లేమని అంటున్నారు.
అసలు పైరేటెడ్ కంటెంట్ కస్టమర్లు ఎవరు?
అసలు పైరసీని ఎక్కువగా ఎవరు చూస్తున్నారో కూడా ‘ది రాబ్ రిపోర్టు’ తెలిపింది. పైరసీ కంటెంట్ చూసేవారిలో ఎక్కువ మంది 19 నుంచి 34 సంవత్సరాల మధ్య వారు ఉన్నారు. 45 సంవత్సరాలకు పైబడిన వారు ఇటువంటి కంటెంట్‌ను ఎక్కువ సేపు చూస్తున్నారు. వీరి ఫోకస్ ముఖ్యంగా టీవీ షోలు, జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌పై ఉంటుంది.
మగవారు ఎక్కువగా పాత సినిమాలను, ఓటీటీల్లో అందుబాటులో లేని సినిమాలను డౌన్‌లోడ్ చేస్తున్నారని ఈ నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో మహిళలు మాత్రం ఎక్స్‌క్లూజివ్ ఓటీటీ సిరీస్‌లను పైరసీలో చూడటానికి ఇష్టపడుతున్నారు.
నిజానికి పైరసీ అనేది మెట్రోపాలిటన్, కాస్మోపాలిటన్ నగరాల్లో కంటే టైర్ 2 సిటీల్లోనే ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ నివసించే వారికి అధికారికంగా లభించే కంటెంట్ యాక్సెస్ చాలా లిమిటెడ్‌గా ఉంటుంది. పైరసీ ద్వారా కంటెంట్ చూడటం వల్ల కలిగే న్యాయపరమైన చిక్కుల గురించి వారికి తెలియకపోవడం కూడా ఒక కారణం. దీంతోపాటు ఆదాయం తక్కువగా ఉండటం, వారు ఉండే ప్రదేశంలో సినిమా థియేటర్లు తక్కువగా ఉండటం కారణంగా కూడా పైరసీకి ఒక కారణం. పెద్ద నగరాల్లో ఉండేవారు పాత సినిమాలు, స్ట్రీమింగ్‌లో లేని సినిమాలు పైరసీ చేస్తున్నారు.
భారతదేశంలో పైరసీ అయ్యే కంటెంట్‌లో హిందీ భాషకి సంబంధించిన కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లిష్ కంటెంట్‌కు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇంగ్లిష్ కంటెంట్‌కు యాక్సెస్ తక్కువగా ఉండటం కూడా పైరసీకి ఒక కారణం కావచ్చు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?