IPL 2025 Biased Commentators: సీఎస్కేకు మద్ధతుగా కామెంటేటర్లు.. ఆ ముగ్గురే అలా చేస్తున్నారు... ఆరోపించిన విండీస్ దిగ్గజ క్రికెటర్..
చెన్నైకి దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సీజన్ లో అంతగా రాణించనప్పటికీ, ఆ జట్టు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా కొంతమంది కామెంటేటర్లుగా ఆ జట్టుకు ఫ్యాన్స్ గా ఉన్నారని తెలుస్తోంది.

IPL 2025 PRO CSK Commentators: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. టోర్నీలో అత్యంత స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో ముందువరుసలో ఉంటుంది. ఐదుసార్లు చాంపియన్ గా నిలిచి, టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్ సరసన నిలిచింది. భారత్ కు మూడు ఐసీసీ టోర్నీలు అందించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆ జట్టు తరపున ఆడుతుండటమే దీనికి కారణం. ఇక ఐపీఎల్ మ్యాచ్ లు జరిగేటప్పుడు, కామెంటేటర్లు కూడా చెన్నై తరపున మద్ధతుగా మాట్లాడుతుండటంపై సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చ జరుగుతోంది. కొంతమంది ఆటగాళ్లు అనవసరంగా ధోనీకి, సీఎస్కే కు క్రెడిట్ ఇస్తూ బైయాస్డ్ గా కామేంటరీ చెబుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై వెస్టిండీస్ మాజీ, దిగ్గజ కామెంటేటర్ ఇయాన్ బిషప్ స్పందించాడు. సీఎస్కేకు మద్ధతుగా కొంతమంది సహచరులు కామెంటరీ చెబుతున్నట్లుగా తాజాగా సరదాగా ఆరోపించాడు.
ఆ ముగ్గురు..
ఇక చెన్నైకి వకాలతు పుచ్చుకుని మాట్లాడే ప్లేయర్లను బిషప్ తాజాగా ఉదహరించాడు. తెలుగు మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్లు మథ్యూ హేడెన్, షేన్ వాట్సన్ లను ఇలా ప్రవర్తిస్తారని పేర్కొన్నాడు. నిజానికి కామెంటరీలో భాగంగా రాయుడు పక్కనే ఉన్నప్పుడు, బిషప్ ఇలా మాట్లాడగా, దాన్ని రాయుడు అంగీకరించాడు. సీఎస్కే అంటే తమకెంతో ఇష్టమని, కొంచెం ఎక్కువ మ్ధతుగా మాట్లాడుతుంటామని వ్యాఖ్యానించాడు. గతంలో ఈ ముగ్గురు ప్లేయర్లు సీఎస్కే తరపున ఆడిన విషయం తెలిసిందే.
కష్టాల్లో చెన్నై..
ఈ సీజన్లో చెన్నై అంచనాలకు అనుగుణంగా రాణించడం లేదు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన చెన్నై.. ఒక మ్యాచ్ లో గెలిచి, మూడింటిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై గెలిచిన తర్వాత వరుసగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయి, హ్యాట్రిక్ పరాజయాలను నమోదు చేసింది. మరోవైపు తాజా ఓటములపై చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తాజాగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలింగ్ లో పవర్ ప్లే, స్లాగ్ ఓవర్లలో అనుకున్నదాని కంటే ఎక్కువ పరుగులు ఇవ్వడంతోపాటు, బ్యాటింగ్ లో త్వరగా వికెట్లు కోల్పోవడం కొంపముంచుతోందని పేర్కొన్నాడు. ఇక బ్యాటింగ్ లైనప్ లో రచిన్ రవీంద్ర, రుతురాజ్ మినహా మిగతా వారెవరు రాణించడం లేదు. అలాగే జట్టు కూర్పు విషయంలో గందరగోళం నెలకొంది. నాలుగు మ్యాచ్ ల్లోనే 17 మంది ఆటగాళ్లను సీఎస్కే పరీక్షించడం గమనార్హం.




















