HCU Students: కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత! చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం
Telangana: తెలంగాణ ప్రభుత్వాన్ని షేక్ చేసిన 400 భూవివాదంపై హెచ్‌సీయూ విద్యార్థులకే కీ రోల్. ఇందులో పలువురిపై కేసులు కూడా బుక్ అయ్యాయి. వాటిని ఉపసంహరించుకునే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

HCU students: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో హెచ్సీయూ విద్యార్థలకు ప్రభుత్వం ఊరట ఇచ్చింది. ఆందోళనలో భాగంగా వారిపై పెట్టిన కేసులు ఉపసంహరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాల భూములను ప్రభుత్వం లాక్కొని ప్రైవేటు కంపెనీలకు దారాదత్తం చేస్తుందని విద్యార్థులు ఉద్యమించారు. కోర్టులు జోక్యం చేసుకునే వరకు హెచ్సీయూ రోడ్లపైనే బైఠాయించి ధర్నాలు చేశారు. ప్రభుత్వ దిష్టబొమ్మలు తగలబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
విద్యార్థుల ఆందోళనలు అడ్డుకున్న పోలీసులు వారిపై కేసులు పెట్టారు. కొందర్ని అరెస్టు కూడా చేశారు. వారిలో ఇద్దర్ని జుడీషియల్ రిమాండ్‌కు పంపించారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉన్నందున వారి కేసులు తొలగించాలని హెచ్‌సీయూ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. హెచ్‌సీయూ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కేసులపై పునరాలోచన చేయాలని అభ్యర్థించారు.
As part of the Committee of Ministers on the Kancha Gachibowli issue, along with Revenue Minister Shri @mpponguleti Garu & IT & Industries Minister Shri @OffDSB Garu, we met UoH Teachers Association & civil society representatives at the Secretariat today.
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) April 7, 2025
We assured them that… pic.twitter.com/y5bgdVR8fm
400 ఎకరాల భూ వివాదంపై వేసిన మంత్రివర్గ సబ్‌కమిటీ సభ్యులైన శ్రీధర్‌బాబు, పొంగులేటే శ్రీనివాస్ రెడ్డితో భట్టి చర్చించారు. అనంతరం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేసుల ఉపసంహరణకు సంబంధించిన ప్రక్రియ చేపట్టాలని సూచించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా ఏం చేయాలో ఆలోచించాలని ఆదేశించారు.
ఈ చర్చల సందర్భంగా ఇరు వర్గాల మధ్య కీలక అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కులు, విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కమిటీ చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పాటిస్తుందని హామీ ఇచ్చారు.
ఇచ్చిన కీలక హామీలు:
1. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులను కేవలం 400 ఎకరాలకే పరిమితం చేస్తాం. విశ్వవిద్యాలయ వర్గాల విజ్ఞప్తి మేరకు క్యాంపస్ నుంచి బలగాలను ఉపసంహరించుకుంటాం. దీని కోసం UoHకి లేఖ రాస్తాం.
2. విద్యార్థులపై ఉన్న కేసులపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. సానుభూతితో వ్యవహరించి ఉపశమనం కోసం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
3. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అధ్యాపకులు/విద్యార్థుల ద్వారా ఎలాంటి సర్వేకు అనుమతి లేదు.
4. క్యాంపస్‌ను కమిటీ సందర్శించడానికి సిద్ధంగా ఉంది, అయితే సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా వెళ్లే పరిస్థితి లేదు. అందుకే విద్యార్థుల బృందాలే వచ్చి తమ అభిప్రాయలు చెప్పవచ్చు.
ఈ వివాదంలో శాంతియుతమైన, న్యాయమైన పరిష్కారాన్ని కనుగొనడానికి అందరితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రుల కమిటీ ప్రకటించింది.
ఈ వివాదంలో ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టు జోక్యం చేసుకొని అక్కడ ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించింది. దీంతో ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగి ఉంది.





















