Actor Sreenivasan Death: మాలీవుడ్‌లో విషాదం... సీనియర్ నటుడు శ్రీనివాసన్ మృతి - బ్లాక్‌బస్టర్స్ తీసిన కుమారుడు
Sreenivasan Death News - Mollywood: మలయాళ నటుడు శ్రీనివాసన్ మృతి చెందారు. ఆయన 200కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ప్రముఖ మలయాళ నటుడు, చిత్ర నిర్మాత & రచయిత శ్రీనివాసన్ (Actor Sreenivasan) కన్ను మూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. శనివారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని త్రిప్పుణిత్తుర తాలూకా ఆసుపత్రిలో ఆయన మృతి చెందారు.
శ్రీనివాసన్ స్వస్థలం కన్నూర్. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో ఒకరు తెలుగు ప్రేక్షకులలో కొందరికి తెలుసు. ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా, కల్యాణీ ప్రియదర్శన్, దర్శనా రాజేంద్రన్ హీరోయిన్లుగా నటించిన 'హృదయం' సినిమా దర్శకుడు వినీత్ శ్రీనివాసన్ ఎవరో కాదు... నటుడు - నిర్మాత శ్రీనివాసన్ కుమారుడు. హీరోగానూ, నటుడిగానూ వినీత్ విజయాలు అందుకున్నారు. శ్రీనివాసన్ మరొక తనయుడు ధ్యాన్ శ్రీనివాసన్. ఆయన భార్య పేరు విమల. శ్రీనివాసన్ మరణ వార్త తెలియగా... అభిమానులు, పరిశ్రమలోని వారందరూ సంతాపం తెలియజేస్తున్నారు. 90వ దశకంలో గొప్ప నటులు, రచయితలలో ఒకరిగా ఆయనను పరిగణిస్తారు. ఆయన అద్భుతమైన కథా రచన, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు శ్రీనివాసన్.
200కు పైగా చిత్రాలలో నటించారు
సుమారు 48 సంవత్సరాల సుదీర్ఘ, అద్భుతమైన సినీ జీవితంలో శ్రీనివాసన్ పలు పాత్రలు పోషించారు. పలు సినిమాలకు రచయితగా పని చేశారు. సమాజం స్థితిని తెలిపే చిత్రాలను కూడా తెరకెక్కించారు. ఆయన 200కు పైగా చిత్రాలలో నటించారు. అనేక చిత్రాలకు స్క్రిప్ట్‌లు కూడా రాశారు. మలయాళ చిత్రం 'చింతవిష్టయాయ శ్యామల', 1989లో వచ్చిన బ్లాక్ కామెడీ చిత్రం 'వడక్కు నోక్కియంత్రం'లకు శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. ఆ రెండూ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. చివరిసారిగా జూన్ 15, 2025న విడుదలైన మలయాళ కామెడీ డ్రామా 'నన్సీ రాణి' చిత్రంలో శ్రీనివాసన్ కనిపించారు. అందులో అహానా కృష్ణ, అజు వర్గీస్, అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రలు పోషించారు. అంతకు ముందు 2023లో వచ్చిన మలయాళ క్రైమ్ కామెడీ చిత్రం 'కురుక్కన్'లో తన కుమారుడితో కలిసి ఆయన కనిపించారు.
శ్రీనివాసన్ 1977లో వచ్చిన మలయాళ సినిమా 'మణిముజక్కం'తో నటుడిగా శ్రీనివాసన్ తన కెరీర్ ప్రారంభించారు. అందులో హ్యారీ అనే యువకుడి పాత్రలో ఆయన కనిపించారు. ఆ తర్వాత 1980వ దశకం వరకు అనేక అద్భుతమైన చిత్రాలలో నటించి మలయాళ పరిశ్రమలో పేరు సంపాదించారు. నటుడిగా మాత్రమే కాకుండా... రచనలో కూడా తన ప్రతిభను చూపించారు. 1984లో వచ్చిన 'ఓడారుథమ్వా అలరియం' చిత్రానికి స్క్రిప్ట్ రాశారు. మార్చి 2022లో కార్డియాక్ స్ట్రోక్ బారిన పడ్డారు శ్రీనివాసన్. ఆ తర్వాత ఆయనకు శస్త్రచికిత్స కూడా జరిగింది. అయినప్పటికీ సినిమాలకు ఆయన విరామం ఇవ్వలేదు. ఈ ఏడాది సైతం తెరపై నటుడిగా కనిపించారు.
Also Read: Year Ender 2025: ఖాన్‌లు, కపూర్‌లు కాదు... బాలీవుడ్‌లో ఈ ఏడాది అదరగొట్టిన హీరోలు వీళ్ళే





















