Preeti Reddy : తెలంగాణలో కాంగ్రెస్‌ను దేవుడు కూడా కాపాడలేడు; రేవంత్ ప్రభుత్వంపై మల్లారెడ్డి కోడలు ఆసక్తికర వ్యాఖ్యలు
Preeti Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అదృష్టం కలిసొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ప్రజలకు మంచి చేయాలని సూచించారు.

Preeti Reddy : రాజకీయ విమర్శలకు దూరంగా ఉండే మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి రేవంత్ సర్కార్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విమాన ప్రయాణంలో ఉండగా వెనుకసీట్లో ఉన్న వ్యక్తికి గుండెపోటు రావడంతో వేగంగా స్పందించి, విమానంలోనే సిపీఆర్ చేశారు. 74 వృద్ధుడి ప్రాణాలు కాపాడిన మల్లారెడ్డి విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ ప్రతీరెడ్డిని పలుకరించింది ఏబిపి దేశం. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వంపై ప్రీతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
ఏబీపీ దేశం: విమాన ప్రయాణంలో ఏం జరిగింది. గుండెపోటుకు గురైన వృద్ధుడిని ఎలా కాపాడారు?
డాక్టర్ ప్రీతిరెడ్డి: నేను విమానప్రయాణంలో ఉండగా, నా వెనుక సీటులో ఉన్న 74ఏళ్ల వృద్దుడు ఒక్కసారిగా స్పృహ కోల్పాయారు. నోటి వెంట నురగ వచ్చింది. చెమటలు పట్టింది. మూత్ర విసర్జన జరిగింది. ప్రాణాపాయస్థితిలో ఉన్నట్టు గమనించాను. బిపి చెక్ చేస్తే ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఏ మాత్రం స్పందన లేదు. గుండెపోటు లక్షణాలు కనిపిండంతో వెంటనే ఐదునిమిషాలు సీపీఆర్ చేశాను. కొద్దిసేపటికే స్ప్రహలోకి రావడంతో ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నాను. విమానంలోని మెడికల్ కిట్‌లో ఉన్న మందులు ఇచ్చాను. దీంతో కొంత ఉపశమనం కలిగింది. ఎయిర్ పోర్టకు చేరిన వెంటనే అక్కడ సిబ్బంది సహాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించాం. వెనుక సీట్లో ప్రయాణిస్తున్న వృద్దుడి ప్రాణాలు భగవంతుడి ఆశీస్సులతో రక్షించగలిగాం.
ప్రయాణంలో అకస్మాత్తుగా గుండెజబ్బు వచ్చినప్పుడు ఎస్పెరన్ ట్యాబ్లెట్ ఇస్తే ఫలితం ఉంటుంది. డబ్భై ఏళ్లు దాటిన వారైతే రక్తం గడ్డే సమస్య ఎక్కువగా ఉంటుంది. రోగి పక్కనే కూర్చుని ఫ్లైట్ దిగేవరకూ అలర్ట్‌గా ఉన్నాం. ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే వీల్‌చైర్, అంబులెన్స్, వైద్య సిబ్బంది సిద్ధం చేసేలా అప్రమత్తం చేసాం. అలా విమానం దిగిన వెంటనే జీఎంఆర్ అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించాం.
ఏబిపి దేశం: విమానప్రయాణంలో గుండెపోటు వచ్చినప్పుడు తోటి ప్రయాణికులు ఎలా స్పందిచాలి?ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?
డాక్టర్ ప్రీతి రెడ్డి: గుండెపోటు వంటి ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు ముందు ధైర్యంగా ఉండాలి. మీరు డాక్టర్ కాకపోయినా పర్లేదు. కనీసం ఇలాంటి సమయంలో ఏ మందులు వాడాలనే కనీసం అవగాహన ఉండాలి. ఏదైనా ఎప్పుడైనా, ఎవరికైనా ఇలా జరగొచ్చు. ఒకవేళ ముందుగా ఇలా అనారోగ్య సమస్యలు ఉంటే సాధ్యమైనంత వరకూ ఒంటరిగా ప్రయాణం చేయొద్దు. గుండెపోటు అని గుర్తిస్తే వెంటనే సిపీఆర్ చేయాలి. మెడికల్ సీపీఆర్ విమాన ప్రయాణంలో చేయడం సాధ్యం కాదు. కాబట్టి, రెండు చేతులతో సిపీఆర్ చేయాలి. రెండు చేతులను గుండెపై ఒత్తుతూ సిపీఆర్ చేయడం ద్వారా గుండె కదలికలు సాధారణ స్థితికి తీసుకురావచ్చొ.
ఏబిపి దేశం: మీ ఫ్యామీలీ మొత్తం రాజకీయాల్లో ఉంది ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది. మీ అభిప్రాయం ఏంటి?
డాక్టర్ ప్రీతి రెడ్డి: దాదాపు చాలా రోజుల పోరాట తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. మళ్లీ వాళ్లు తిరిగి అధికారంలోకి వస్తారో రారో తెలియదు. నాకైతే రాదనే అనిపిస్తోంది. ఎందుకంటే.. విధ్వంసంతో ఏదీ సాధ్యం కాదు. అభివృద్దిపైనే దృష్టిపెట్టాలి. కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాలను సైతం పట్టించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. దేవుడు కాంగ్రెస్‌కు మంచి అవకాశం ఇచ్చాడు. వాళ్లు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలా నిరూపించుకోకపోతే తిరిగి కాంగ్రెస్‌ను దేవుడు కూడా కాపాడలేడు.





















