Viral News: దేవుడిలా వచ్చి సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్స్
Blue Colts Police saves a woman life by doing CPR | వరంగల్: క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలకు కొన్నిసార్లు ప్రాణాలు పోతాయి. మరికొన్ని సందర్భాలలో అదృష్టవశాత్తూ ఏదో ఒక రూపంలో ప్రాణాలు నిలుస్తాయి. ఓ మహిళ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆమె ప్రాణాల మీదకు తీసుకురాగా, పోలీస్ కానిస్టేబుల్స్ సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడారు.
మహబూబాబాద్ కు చెందిన తల్లాడ స్పందన కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. సమాచారం అందుకున్న వెంటనే మహబూబాబాద్ టౌన్ బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్స్ రాంబాబు, రవి అక్కడికి చేరుకున్నారు. ఆమె పల్స్ ఆగింది, గుండె కొట్టుకోవడం లేదని గుర్తించారు. అసలే అది గోల్డెన్ అవర్ కావడంతో వెంటనే ఆమెకు సీపీఆర్ చేశారు. కొన్ని నిమిషాల పాటు సీపీఆర్ చేయగా మహిళ గుండె తిరిగి కొట్టుకోవడం మొదలైంది. అనంతరం తల్లాడ స్పందనను వెంటనే మహబూబాబాద్ కేంద్రంలోని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. అయితే ఇంకా షాక్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. సకాలంలో అక్కడికి చేరుకుని సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన ఇద్దరు కానిస్టేబుల్స్ ను స్థానికులు అభినందించారు.
బ్లూ కోల్ట్స్ అంటే ఏమిటి
బ్లూ కోల్ట్స్ అనేది ఒక ప్రత్యేకమైన మొబైల్ క్విక్ రియాక్షన్ టీమ్‌గా చెప్పవచ్చు. ఈ విభాగంలో సేవలు అందించే కానిస్టేబుల్స్ అత్యవసర పరిస్థితులు, బాధాకరమైన, ఇబ్బంది ఉన్న సందర్భాలలో వీరు అక్కడికి చేరుకుని బాధితులకు తగిన సాయం చేయనున్నారు. డయల్ 100 ద్వారా వచ్చే డిస్ట్రెస్ కాల్స్‌కు సత్వరమే స్పందిస్తూ బైక్‌లపై వెళ్లే ఎమర్జెన్సీ మొబైల్ బృందంగా కానిస్టేబుల్స్ సేవలు అందిస్తారు. ఈవ్ టీజింగ్, మహిళలపై హింస, చైన్ స్నాచింగ్‌లు, రోడ్డు ప్రమాదాలు, చోరీ మొదలైన సందర్బాలలో బాధితులను రక్షించేందుకు వీరు తక్కువ సమయంలోనే అక్కడికి చేరుకుంటారు. ప్రతి బ్లూ కోల్ట్ బైక్‌లో జీపీఎస్ ట్రాకింగ్ యూనిట్, కమ్యూనికేషన్ సెట్‌లు ఉంటాయని తెలిసిందే.