Andhra Health: టెన్షన్ ఆడవారికి - షుగర్ మగవాళ్లకి - ఏపీలో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సంచలన రిపోర్టు
Sugar: ఏపీ ప్రజలకు ఎక్కువగా వస్తున్న ఆరోగ్య సమస్యలపై నివేదిక వెలుగులోకి వచ్చింది. ఆడవారికి టెన్షన్, మగవారికి షుగర్ సమస్యలు ప్రధానంగా ఉన్నట్లుగా గుర్తించారు.

Health Andhra: ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ సాధనలో మరొక అడుగు ముందుకుపడింది. రాష్ట్రంలో ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న వ్యాధులకు మూలాలు... వాటి వెనుక ఉన్న కారణాలు కనుక్కునే ప్రయత్నం ప్రభుత్వం చేసిది. గుండె, కిడ్నీ, శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి డయాబెటిస్, క్యాన్సర్ వంటి రోగాల వరకు... ఏ ప్రాంతంలో ఎందుకు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయనే దానిపై పరిశోధన చేయగా... సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా జిల్లా ప్రజల ఆహారపు అలవాట్లు-జీవన విధానం వ్యాధులపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది.రాష్ట్రంలో ప్రజలు అనారోగ్యం బారిన పడ్డ తర్వాత వారికి చికిత్స అందించడం కన్నా... కొన్ని రకాల వ్యాధులు సంక్రమించకుండా... ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని చాలావరకు నియంత్రించవచ్చని గుర్తించారు. ఈ ఆలోచన నుంచే సమగ్ర పరిశోధన తలపెట్టడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని పరిశోధన. 10 రకాల వరకు వ్యాధుల గురించి అధ్యయనం చేశారు.
హైపర్ టెన్షన్
రాష్ట్రంలోని 18 ఏళ్ల వయసు కన్నా ఎక్కువ ఉన్న 2.15 కోట్లు మొత్తం జనాభాలో 52.43 శాతం మందికి స్ర్కీనింగ్ చేస్తే అందులో 19.78 లక్షల మందికి హైపర్ టెన్షన్ నిర్ధారణ అయ్యింది. వీరిలో మగవారి కన్నా మహిళలే ఎక్కువుగా హైపర్ టెన్షన్ ఎదుర్కొంటున్నారు. 11,40,772 మంది మహిళలకు హైపర్ టెన్షన్ ఉంది. 8,37,927 మంది మగవాళ్లకు హైపర్ టెన్షన్ ఉంది. మరో 14.29 లక్షల మంది (71.92%) అండర్ ఫాలో అప్ కేటగిరీలో ఉన్నారు. జిల్లాల వారీగా చూస్తే... కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల ప్రజలకు హైపర్ టెన్షన్ ఎక్కువుగా ఉంది. * శ్రీ సత్యసాయి, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి.
డయాబెటిస్
రాష్ట్రంలోని 18 ఏళ్ల వయసు కన్నా ఎక్కువ ఉన్న 2.15 కోట్ల మందిని పరీక్షించగా వారిలో 11.13 లక్షల మందికి అంటే జనాభాలో 5.1 శాతం మందికి డయాబెటిస్ ఉన్నట్టు తేలింది. డయాబెటిస్ మాత్రం మహిళలు కన్నా, మగవాళ్లకే ఎక్కువ. 5,61,196 మంది మగవాళ్లకు డయాబెటిస్ ఉంది. 5,52,767 మంది మహిళలకు డయాబెటిస్ ఉంది. మరో 8.76 లక్షల మంది (78.73%) అండర్ ఫాలో అప్ కేటగిరీలో ఉన్నారు. అంటే వీరంతా డయాబెటిస్ రిస్క్‌లో ఉన్నారు. జిల్లాల వారీగా చూస్తే... గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ప్రజలకు డయాబెటిస్ ఎక్కువుగా ఉంది. అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి.
డయాబెటిస్, హైపర్ టెన్షన్
హైపర్ టెన్షన్, డయాబెటిస్ రెండూ ఉన్న వారి సంఖ్య 20.78 లక్షల మంది. అంటే 9.6 శాతం మంది. వీరిలో మగవారి కన్నా మహిళలే ఎక్కువుగా హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఎదుర్కొంటున్నారు. 11,22,800 మంది మహిళలకు హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఉంది. మగవారికి వచ్చేసరికి 9,54,707 మందికి డయాబెటిస్ ఉంది. అండర్ ఫాలో అప్ కేటగిరీలో మరో 12.80 లక్షల మంది (61.64%) ఉన్నారు. హైపర్ టెన్షన్, డయాబెటిస్ రెండూ ఉన్నవాళ్లు ఏలూరు, ఎన్టీఆర్, కృష్టా జిల్లాల్లో ఎక్కువ. అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి.
గుండె సంబంధిత వ్యాధులు
2,61,100 మంది గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరిలో మగవాళ్లు 1,61,734 మంది కాగా, మహిళలు 99,366 మంది ఉన్నారు. ఎన్టీఆర్, నంద్యాల, గుంటూరు జిల్లాలో గుండె వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారు. అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అత్యల్పం.
క్యాన్సర్ రోగులు
1,19,397 మంది క్యాన్సర్ రోగులు ఉన్నారు. వీరిలో మగవాళ్లు 46,872 మంది కాగా, మహిళలు 72,525 మంది ఉన్నారు. కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికంగా ఉన్నారు. అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నారు.
కాలేయ వ్యాధిగ్రస్తులు
30,646 మంది కాలేత సంబంధిత వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీరిలో మగవాళ్లు 21,740 మంది, మహిళలు 8,906 మంది. నెల్లూరు, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో అత్యధికం. అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, మన్యం జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నట్లుగా పరిశీలనలో తేలింది.
శ్వాస సంబంధిత రోగులు
ఏపీలో 54,362 మంది శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరిలో మగవాళ్లు 35,088 మంది కాగా, మహిళలు 19,274 మంది ఉన్నారు. నెల్లూరు, విజయనగరం, తిరుపతి జిల్లాల్లో అత్యధికం.. అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, బాపట్ల జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నారు.
నరాల సంబంధిత అనారోగ్యం
1,07,433 మంది నరాల సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా పరిశీలనలో తేలిది. వీరిలో మగవాళ్లు 63,698 మంది కాగా, మహిళలు 43,735 మంది ఉన్నారు. * విజయనగరం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అత్యధికం అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, మన్యం జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నారు.
కిడ్నీ వ్యాధిగ్రస్తులు
ఏపీలో 1,73,479 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీరిలో మగవాళ్లు 1,22,672 మంది కాగా, మహిళలు 50,807 మంది ఉన్నారు. శ్రీకాకుళం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా ఉన్నారు. అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నారు.
ఇవే కాకుండా మరికొన్ని వ్యాధులపైనా జిల్లాల వారీగా అధ్యయనం చేయడం చేశారు. * జీవన విధానం వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు ఎక్కువుగా కృష్ణా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నమోదవుతున్నాయి. వాయ కాలుష్యం, స్మోకింగ్ వంటి కారణాల వల్ల ఆస్తమా, నియోనియో, COPD కేసులు... ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికంగా ఉన్నాయి. * టీబీ, డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో ఎక్కువుగా నమోదవుతున్నట్టు గుర్తించారు.
పొగాకు ఇతర అలవాట్ల కారణంగా సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్ రోగులు గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువ ఉన్నారు.
అనీమియా, ప్రీ టర్మ్ బర్త్స్, మాల్‌న్యూట్రిషియన్ సమస్యలతో బాధపడేవారు విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఎక్కువదా ఉన్నారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధులు, డిప్రెషన్, యాంగ్జయిటీ కేసులు విశాఖపట్నం, విజయవాడ, కడప జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. * వర్షాకాలంలో ఎక్కువుగా వచ్చే చికున్ గున్యా, డెంగ్యూ, మలేరియా కేసులు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు ఎక్కువుగా కృష్ణా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చోటు చేసుకుంటున్నాయి.
జూన్ నాటికి స్క్రీనింగ్ పూర్తి :
ఈ ఏడాది జూన్ కల్లా రాష్ట్రంలో అందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి పూర్తి సమాచారాన్ని సేకరించడంతో పాటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించారు. * ఆహారపు అలవాట్లు, జీవన విధానం మార్చుకోవడం ద్వారా రోగాల బారిన పడే అవకాశాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చు అని చెప్పడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని.. దీనిపై మరింత అధ్యయనం, పరిశీలన, పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాల్సి ఉందని సీఎం తెలిపారు.





















