Good Friday vs Easter : గుడ్ ఫ్రైడే vs ఈస్టర్.. క్రైస్తవులు జరుపుకునే ఈ రెండు స్పెషల్ డేల మధ్య వ్యత్యాసం ఇదే
Good Friday and Easter : గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పక్క పక్కనే వచ్చేస్తాయి. కాబట్టి ఇది క్రైస్తవులకు అర్థమైనంత సులువుగా ఇతరులకు అర్థం కాదు. అసలు ఈ రెండు స్పెషల్ డేలకు మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో చూసేద్దాం.

Good Friday and Easter Difference : క్రైస్తవులు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ని చాలా భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడే వచ్చిన రెండ్రోజుల తర్వాత ఈస్టర్ వస్తుంది. గుడ్ ఫ్రైడే శుక్రవారం.. శనివారం గ్యాప్.. ఆదివారం ఈస్టర్. వీటి మధ్య డిఫరెన్స్ క్రైస్తవులకు బాగా తెలుసు. కానీ కొందరికి వీటి గురించిన అవగాహన ఉండదు. అసలు గుడ్ ఫ్రైడే ఎందుకు చేసుకుంటారు? ఈస్టర్ దేనిని సూచిస్తుంది. వాటి మధ్య వ్యత్యాసం ఏంటి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మధ్య చాలా తేడా ఉంటుంది. గుడ్ ఫ్రైడే దుఖాన్ని, త్యాగాన్ని సూచిస్తే.. ఈస్టర్ ఆనందం, పునరుత్థానాన్ని సూచిస్తుంది. అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి? ఈస్టర్ అంటే ఏమిటో తెలుసుకుందాం.
గుడ్ ఫ్రైడే
గుడ్ ఫ్రైడే 2025లో ఏప్రిల్ 18వ తేదీన వచ్చింది. యేసు క్రీస్తు శిలువలో తన ప్రాణాలు విడిచి.. ప్రజలను రక్షించుటకు ఆయన మరణించారని గుర్తు చేసుకుంటూ.. ప్రార్థనలతో స్మరించుకుంటూ జరుపుకునే పవిత్ర దినం. దీనినే గుడ్ ఫ్రైడే అంటారు. క్రైస్తవులు ఈరోజు ఉపవాసం ఉంటారు. ప్రార్థనలు చేస్తూ.. తాము చేసిన పాపాలను దేవుడి ముందు ఒప్పుకుంటారు. తమని తాము ఆత్మ పరిశీలన చేసుకుంటారు. గుడ్ ఫ్రైడే రోజు చాలామంది తెల్లని దుస్తుల్లో చర్చిలకు వెళ్తారు. మౌనంగా ఉంటారు.
ఈస్టర్
గుడ్ ఫ్రైడేని శుక్రవారం జరుపుకుంటే.. దాని తర్వాత వచ్చే ఆదివారం ఈస్టర్ని జరుపుకుంటారు. యేసు క్రీస్తు మరణించాక.. మూడవ రోజు ఆయన మృతుల నుంచి లేచి.. పునరుత్థానమైనట్లు గుర్తుగా ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటారు. గుడ్ ఫ్రైడే బాధను గుర్తు చేస్తే.. ఈస్టర్ ఆనందానికి ప్రతీకగా నిలుస్తుంది. క్రైస్తవులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఇది ఒకటి. మరణంపై విజయం, పాపంపై గెలుపుగా చెప్తారు. ఆశ, పునరుద్ధరణ, నూతన జీవితాన్ని ఈస్టర్ సూచిస్తుంది. ఈస్టర్ రోజు కొత్త దుస్తులు ధరించి చర్చికి వెళ్తారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సంతోషంగా చర్చిలో ప్రార్థనలు చేస్తూ.. పాటలు పాడుతూ గడుపుతారు.
గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రెండు రోజుల్లో క్రైస్తవులు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు. గుడ్ ఫ్రైడే రోజు ఉపవాసంతో, మౌనంతో ఉంటే.. ఈస్టర్ రోజును పండుగగా ప్రార్థనలు చేస్తూ వేడుకగా చేసుకుంటారు. గుడ్ ఫ్రైడే రోజు ఏసు త్యాగం చేయకుంటే.. ఈస్టర్ అనే రోజు పునరుత్థానానికి అర్థం ఉండదు. అందుకే వీటిని క్రైస్తవులు విశ్వాసానికి మూలంగా చూస్తారు. తమ పాపాల కోసం క్రీస్తు మరణించి.. శాశ్వత జీవితం ఇచ్చేందుకు తిరిగిలేచాడని నమ్ముతారు.






















