Fake Videos Cases: కంచ గచ్చిబౌలి ఫేక్ వీడియోలపై సర్కార్ సీరియస్ - హైకోర్టులో పిటిషన్
Telangana: కంచ గచ్చిబౌలి విషయంలో ఫేక్ వీడియోలు ప్రసారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. 24వ తేదీన ఈ పిటిషన్ పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది.

Fake videos: ఫేక్ వీడియోలు, ఏఐ ఫోటోలతో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. వారు చేస్తున్న పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రావడమే కాకుండా.. సమాజానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు.. ఇలాంటి ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే విమర్శలు రాకుండా ఉండేందుకు నేరుగా హైకోర్టు నుంచే ఆదేశాలు తెచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు.
ఫేక్ వీడియోలు పోస్టు చేసిన వారిపై చర్యలకు ప్రభుత్వం సిద్ధం
రుగా చర్యలు తీసుకునేలా కోర్టు నుంచే ఆర్డర్స్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కంచ గచ్చిబౌలి విషయంలో వన్య ప్రాణులు చెల్లా చెదురు అవుతున్నట్లుగా ఫేక్ వీడియోలు.. ఏఐ వీడియోలు క్రియేట్ చేశారని.. తప్పుడు ప్రచారం చేసి సమాజంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు కారణమయ్యారని అలాంటి వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు 24వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున వాదనలు వింటామని చెప్పింది. ఫేక్ వీడియోలు వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశిస్తే పలువురిపై కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.
క్రిషాంక్ సహా పలువురికి నోటీసులు
ఇప్పటికే పలువురికి పోలీసులు నటీసులు ఇస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ క్రిషాంక్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని ఆదేశించారు. అయితే తనపై కేసులను క్వాష్ చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. మరికొంత మంది యూట్యూబర్లకూ నోటీసులు జారీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అర్థరాత్రి పూట ఎలాంటి పనులు చేయకపోయినా చేసినట్లు.. ఆ సమయంలో నెమళ్లు ఆర్తనాదాలు చేస్తున్నట్లుగా..జింకలు అరుపులుతో పారిపోతున్నట్లుగా ఆడియోలను వైరల్ చేశారు. ఇవన్నీ కుట్రపూరితంగా చేశారని ప్రభుత్వం భావిస్తోంది.
వదిలి పెట్టకూడదన్న ఆలోచనలో ప్రభుత్వం
ఈ వీడియోల వల్లనే జాతీయంగా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత మంది పోస్టులు పెట్టారని.. దీని వల్ల తమ ప్రభుత్వ ప్రతిష్టకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రభుత్వం భావిస్తున్నందున అలాంటి వారిని ఉపేక్షించకూడదని అనుకుంటోంది. గతంలో అయితే వరుసగా అరెస్టులు చేసేవారు. కానీ కోర్టుల్లో వారికి రిలీఫ్ లభించేది. ఈ సారి వారు చేసిన తప్పును ముందుగా హైకోర్టు ముందు పెట్టి ఆ తర్వాత వారిపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
మరో వైపు కంచ గచ్చిబౌలి భూములు అమ్మవద్దని ఉద్యమం చేసిన వారిలో ఇద్దరు విద్యార్థులు రిమాండ్ లో ఉన్నారు. వారిపై కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణియంచింది.





















