Deep Fake Technology: రష్మికా పరిస్థితి మీకూ రావచ్చు - ‘డీప్ ఫేక్’ వీడియోలకు చిక్కకూడదంటే ఏం చేయాలి?
Rashmika Mandannaనటి రష్మిక మందన్నకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే, ఆ వీడియో ఫేక్ అని నిపుణులు తేల్చారు. ఇంతకీ ఆ వీడియోను ఎలా మార్ఫింగ్ చేశారంటే?
ప్రస్తుతం టెక్ ప్రపంచాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ ఏలేస్తోంది. ఏది నిజమైన వీడియోనో? ఏది ఫేక్ ఫోటోనో? గుర్తుపట్టడం అస్సలు సాధ్యం కావట్లేదు. ఈ కొత్త టెక్నాలజీతో కేటుగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా డీప్ ఫేక్ టెక్నాలజీ, వాయిస్ క్లోనింగ్ లాంటి కొత్త పద్దతుల ద్వారా మరింత రెచ్చిపోతున్నారు. సైబర్ మోసాలు, ప్రైవసీ ఉల్లంఘనలతో సోషల్ మీడియా వినియోగదారుల్లో వణుకు పుట్టిస్తున్నారు. వ్యక్తిగత ఫోటోలను నెట్టింట్లో షేర్ చేయాలంటేనే చాలా మంది భయపడుతున్నారు.
నెట్టింట్లో రష్మిక డీప్ ఫేక్ వీడియో హల్ చల్ - Rashmika Mandanna Fake Viral Video
తాజాగా హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సంచలనం సృష్టించింది. సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా ఈ వీడియోనే దర్శనం ఇచ్చింది. ఆకతాయిలు డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి వేరొక అమ్మాయి వీడియోకు రష్మిక ముఖాన్ని పెట్టి ఫేక్ వీడియో రూపొందించారు. ఈ వీడియోలో ఆమె డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని లిఫ్ట్ లోకి వచ్చినట్లు మార్ఫింగ్ వీడియోను క్రియేట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వచ్చిన కొద్ది సేపట్లోనే వైరల్ అయ్యింది. వాస్తవానికి ఈ వీడియోను జరా పటేల్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఈ వీడియోను ఉపయోగించి రష్మిక ఫేక్ వీడియోను రూపొందించారు. ఇప్పటికీ ఈ వీడియోను రూపొందించింది ఎవరు? అనే విషయం బయటకు రాలేదు.
ఇంతకీ డీఫ్ ఫేక్ టెక్నాలజీ అంటే ఏంటి? - What is DeepFake Technology?
ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ శరవేగంగా డెవలప్ అవుతున్న నేపథ్యంలో డీప్ ఫేక్ టెక్నాలజీ తో పాటు వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ టెక్నాలజీతో సైబర్ మోసగాళ్లు సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా అందరినీ బురిడీ కొట్టిస్తున్నారు వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ ద్వారా కేవలం నాలుగు సెకెన్ల ఒరిజినల్ ఆడియోతో ఫుల్ ఆడియోను రూపొందిస్తారు. ఈ ఫేక్ ఆడియో ఒరిజినల్ ఆడియోకు 85 శాతానికి పైగా మ్యాచ్ అవుతుందని నిఫుణులు చెప్తున్నారు. డీఫ్ ఫేక్ వీడియో ద్వారా నిండు దుస్తుల్లో ఉన్న వారిని సైతం దుస్తులు లేనట్లుగా ఎడిట్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఎవరి ఫోటో అయినా, ఎలాంటి వీడియో అయినా ఈ టెక్నాలజీ ద్వారా మార్ఫింగ్ చేయవచ్చు.
ఫేక్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడితే?
గత కొంతకాలంగా డీప్ ఫేక్ వీడియోల ద్వారా చాలా మంది సెలబ్రిటీలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంఘటనలపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, డీప్ ఫేక్ వీడియోలను అరికట్టాల్సిన బాధ్యత సదరు సోషల్ నెట్వర్కింగ్ సైట్లపైన ఉందని కేంద్ర ఐటీ శాఖ వెల్లడించింది. ఏ వినియోగదారు కూడా తమ అకౌంట్ నుంచి నకిలీ లేదంటే తప్పుడు సమాచారాన్ని పోస్టు చేయకుండా చూసుకోవాలని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఒకవేళ తప్పుడు సమాచారాన్ని పోస్టు చేసినా, దాన్ని 36 గంటల్లోగా తొలగించాలని చెప్పారు. ఈ నింబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలకు గురి కావాల్సి వస్తుందని చెప్పారు. అటు డీప్ ఫేక్ టెక్నాలజీ, వాయిస్ క్లోనింగ్ తో ప్రజల వ్యక్తిగత భద్రతకు ముప్పురాకుండా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.
ఇలా చేస్తే సేఫ్: Social Media Safety Tips
సోషల్ మీడియా వినియోగదారులు తమ ప్రొఫైల్ ను ప్రైవేట్ లోకి మార్చుకోవాలని సూచిస్తున్నారు. తెలియని వ్యక్తుల నుంచి రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేయకూడదంటున్నారు. ఒకవేళ తమ ఫేక్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తే వెంటనే 1930కు కాల్ చేసి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయాలంటున్నారు. మీకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎవరైనా మార్ఫింగ్ చేసిన ఇంటర్నెట్ లో పెడిత, వెంటనే SPOTNCII.org అనే వెబ్ సైట్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. వాళ్లు సదరు వీడియోలు, ఫోటోలను వెంటనే ఇంటర్నెట్ నుంచి తొలగిస్తారు.
Read Also: రష్మిక మార్ఫింగ్ వీడియోపై కేంద్రం సీరియస్, చర్యలు తప్పవని హెచ్చరిక
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial