SunRisers Orange Army: ఈ క్రికెట్ వీరాభిమాని గురించి తెలిస్తే, షాక్ అవ్వాల్సిందే!
SunRisers Diehard Fans: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ మ్యాచ్ ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమై తన జట్టుకు మద్దతుగా నిలుస్తున్న ఆ వీరాభిమాని పేరు ధర్మ రక్షిత్.
Orangearmy Fan Club founder Rakshith journey: బంతి బౌండరీ దాటితే హర్షధ్వానాలు. వికెట్ పడినప్పుడు సంబరాలు... గెలిచినప్పుడు విజయనినాదాలు... ఇవీ క్రికెట్‌లో అభిమానుల సందడి. క్రికెట్ అంటే ప్రాణమిచ్చే అభిమానులు భారత్‌లో కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలోనూ చాలామంది అభిమానులు క్రికెటే ప్రపంచంగా జీవిస్తున్నారు. తమ అభిమాన ఆటగాడు సెంచరీ చేస్తే సంతోషపడే... తమ జట్టు గెలిస్తే ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యే అభిమానలుు చాలా మంది ఉన్నారు.
సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి, ధోనీ అభిమాని తంగరాజ్ గురించి చాలామందికి తెలుసు. అలాగే పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడినా మైదానంలో ప్రత్యక్షమయ్యే చాచా కూడా క్రికెట్ ప్రపంచానికి పరిచయమే. ఈ అభిమానులను ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ప్రత్యేకంగా గుర్తించి వారికి కొన్ని అరుదైన అవకాశాలను కల్పిస్తోంది. ఇప్పుడు ఈ వీరాభిమానుల లిస్ట్‌లో ఓ హైదరాబాదీ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఐపీఎల్(IPL)లో సన్‌రైజర్స్(Sunrisers Hyderabad) మ్యాచ్ ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమై తన జట్టుకు మద్దతుగా నిలుస్తున్న ఆ వీరాభిమాని పేరు ధర్మ రక్షిత్(Dharma Rakshit). ఇతడి అభిమానానికి స్వయాన బీసీసీఐ, ఐపీఎల్ ప్రాంచైజీలు కూడా ఫిదా అయిపోయాయి. ధర్మ రక్షిత్‌కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో తెలుసుకుని.. ఈ వీరాభిమానికి సలాం చేస్తున్నాయి.
హైదరాబాద్ జట్టంటే అంత క్రేజ్ మరి
ధర్మ రక్షిత్‌కు ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టంటే చెప్పలేనంత ఇష్టం. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎక్కుడ మ్యాచ్ ఆడినా అక్కడ ప్రత్యక్షమై జట్టుకు మద్దతుగా నిలుస్తాడు. జట్టుకు చివరి బంతి వరకు మద్దతుగా ఉంటాడు. ఆటగాళ్లలో ఉత్సాహం నింపుతాడు. ధర్మ రక్షిత్‌కు హైదరాబాద్ జట్టంటే ఇష్టం... ఐపీఎల్ తొలి సీజన్ నుంచే ప్రారంభమైంది. డెక్కన్ ఛార్జర్స్‌కు వీరాభిమాని అయిన ధర్మ రక్షిత్ తండ్రి... తన కొడుకును కూడా అదే మార్గంలో పయనించేలా చేశాడు. చిన్నప్పటి నుంచి తండ్రితో కలిసి స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూసిన ధర్మ రక్షిత్ హైదరాబాద్ జట్టంటే ఇష్టం నరనరాన జీర్ణించుకుపోయింది. ఈ ఇష్టంతోనే కేవలం 14 ఏళ్ల వయసులోనే ఫేస్‌బుక్‌లో డెక్కన్ ఛార్జర్స్ ఫ్యాన్ పేజీ ఓపెన్ చేసి మద్దతుగా పోస్ట్‌లు చేశాడు. ఈ పోస్ట్‌లకు భారీగా మద్దతు వచ్చింది. చాలామంది క్రికెట్ అభిమానులు ధర్మ రక్షిత్‌కు మద్దతుగా కామెంట్లు చేస్తూ అతడితో పాటు మైదానానికి వచ్చి మ్యాచ్‌లు చూసి జట్టుకు మద్దతుగా నిలిచేవారు.
కాలక్రమంలో డెక్కన్ ఛార్జర్స్ స్థానంలో సన్ రైజర్స్ జట్టు వచ్చింది. సన్‌రైజర్స్‌కు కూడా ధర్మ రక్షిత్ మద్దతుగా నిలిచాడు. 2020లో సన్ రైజర్స్ మేనేజ్‌మెంట్ ధర్మ రక్షిత్ సృష్టించిన ఫ్యాన్ క్లబ్, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌కు అధికారిక గుర్తింపును ఇచ్చి గౌరవించింది. ఐపీఎల్ జట్టుకు మద్దతు ఇవ్వడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని... ఐపీఎల్ జట్టు, క్రికెట్ బోర్డు తనను అభిమానిగా గుర్తించడం తనకు లభించిన అతిపెద్ద గౌరవమని ధర్మ రక్షిత్ చెప్పారు.
అరుదైన గుర్తింపు
క్రికెట్‌కు వీరాభిమాని అయిన ధర్మ రక్షిత్‌కు అరుదైన గౌరవాలు దక్కాయి. క్రికెట్ పట్ల అతనికి ఉన్న అంకితభావానికి గుర్తింపు లభించింది. అంతర్జాతీయ భారత క్రికెట్ అభిమానుల సంఘం అయిన భారత్ ఆర్మీ ధర్మ రక్షిత్‌కు ప్రత్యేక ఆహ్వానం పంపింది. ఈ ఆహ్వానంతో ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ సమయంలో భారత క్రికెట్ జట్టుతో పాటు రక్షిత్ కూడా పాల్గొన్నాడు. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ క్లబ్ వంటి కార్యక్రమాల ద్వారా.. రక్షిత్ క్రికెట్ కమ్యూనిటీలో చేరికను ప్రోత్సహించడం, నిరుపేద యువతకు మ్యాచ్ లు చూసే వీలు కల్పించడం, క్రికెట్ పై వారికి ఉన్న ప్రేమను పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ధర్మ రక్షిత్ ఐపీఎల్ వేలం జరుగుతున్న సమయంలో సన్‌రైజర్స్ టీమ్ మేనేజ్‌మెంట్ ఆతిథ్యం పొందారు. 2023లో ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ ఈవెంట్‌కు హాజరవ్వగలిగాడు. ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ క్రికెటర్లను కలుసుకునే అవకాశం పొందాడు.