SRH vs KKR, Match Highlights: రైజర్స్ హ్యట్రిక్ విక్టరీ - కోల్‌కతాకు చుక్కలు చూపించిన త్రిపాఠి, మార్క్రమ్!
IPL 2022, SRH vs KKR: ఐపీఎల్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లతో డామినేటింగ్ విక్టరీని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ 17.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించింది. సీజన్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవి చూసిన రైజర్స్... తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది.
టాప్ ఆర్డర్ హ్యాండ్ ఇచ్చినా...
టాస్ ఓడి బ్యాటింగ్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆరంభంలోనే షాకుల మీద షాకులు తగిలాయి. ఓపెనర్లు వెంకటేష్ అయ్యర్ (6: 13 బంతుల్లో, ఒక ఫోర్), ఫించ్ (7: 5 బంతుల్లో, ఒక సిక్సర్), సునీల్ నరైన్‌లు (6: 2 బంతుల్లో, ఒక సిక్సర్) 4.3 ఓవర్లకే పెవిలియన్ చేరుకున్నారు. అప్పటికి జట్టు స్కోరు 31 పరుగులు మాత్రమే.
అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (28: 25 బంతుల్లో, మూడు ఫోర్లు), నితీష్ రాణా (54: 36 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. నాలుగో వికెట్‌కు 39 పరుగులు జోడించిన అనంతరం ఉమ్రాన్ మలిక్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ క్లీన్ బౌల్డయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది.
ఆ తర్వాత కాసేపటికే షెల్డన్ జాక్సన్ (7:7 బంతుల్లో, ఒక సిక్సర్) కూడా అవుటయ్యాడు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో నితీష్ రాణాకు, ఆండ్రీ రసెల్ (49 నాటౌట్: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) జతకలిశాడు. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాక కాసేపటికే నితీష్ రాణా అవుట్ అయినా... ఆండ్రీ రసెల్ వేగం తగ్గించకపోవడంతో కోల్‌కతా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 175 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్ మూడు, ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, సుచిత్‌లకు తలో వికెట్ దక్కింది.
ఎక్కడా తడబడకుండా...
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు కూడా రెండో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మను (3: 10 బంతుల్లో) ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ప్యాట్ కమిన్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ కేన్ విలియమ్సన్ (17: 16 బంతుల్లో, మూడు ఫోర్లు) కూడా ఇన్సింగ్స్ ఆరో ఓవర్లో అవుట్ కావడంతో పవర్‌ప్లేలోనే రైజర్స్ రెండు వికెట్లు కోల్పోయింది.
అయితే వీరిద్దరూ అవుట్ కావడంతో సన్‌రైజర్స్ కాకుండా కోల్‌కతానే కష్టాల్లో పడింది. ఎందుకంటే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ త్రిపాఠి (71: 36 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (68 నాటౌట్: 36 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. కోల్‌కతా బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తిని లక్ష్యంగా చేసుకుని తన బౌలింగ్‌లో భారీ షాట్లకు వెళ్లారు. వరుణ్ చక్రవర్తి మొదటి ఓవర్లో 18 పరుగులు, రెండో ఓవర్లో 14 పరుగులు, మూడో ఓవర్లో 13 పరుగులు వచ్చాయి.
వీరిద్దరూ మూడో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. వేగంగా ఆడే క్రమంలో రాహుల్ త్రిపాఠి అవుటయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్‌తో (5 నాటౌట్: 8 బంతుల్లో) కలిసి మార్క్రమ్ మ్యాచ్‌ను ముగించాడు. 176 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ మూడు వికెట్లు కోల్పోయి ఓవర్లలోనే సాధించింది. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు తీయగా... ప్యాట్ కమిన్స్‌కు ఒక వికెట్ దక్కింది.
View this post on Instagram