Chris Gayle: అన్నొచ్చిండు- తెలంగాణ కెప్టెన్‌గా గేల్, మళ్లీ బరిలోకి యూనివర్సల్ బాల్
Veteran Premier League: ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో తెలంగాణ టైగర్స్ జట్టుకు క్రిస్ గేల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని క్రిస్ గేల్ స్వయంగా వెల్లడించాడు.

Chris Gayle To Lead Telangana Tigers: క్రికెట్ దిగ్గజం, పెను విధ్వంసానికి మారుపేరు.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(Chris Gayle) తిరిగొస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డుల బద్దలుకొట్టిన ఈ విండీస్ మాజీ విధ్వంసకర బ్యాటర్ మళ్లీ బ్యాటు పట్టబోతున్నాడు. ఆటకు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో ఐపీఎల్ తరహాలో ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్(Indian Veteran Premier League)నిర్వహిస్తున్నారు. ఈ ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) ప్రారంభ ఎడిషన్‌లో తెలంగాణ టైగర్స్ (Telangana Tigers )జట్టుకు క్రిస్ గేల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని క్రిస్ గేల్ స్వయంగా వెల్లడించాడు. వెటరన్ ప్రీమియర్ లీగ్‌తో మీ ముందుకు రాబోతున్నా, ఐవీపీఎల్ కోసం అందరూ సిద్దంగా ఉండండి అని యూనివర్సల్ బాస్ పేర్కొన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్, ఎస్.శ్రీశాంత్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ ఈ టోర్నీ ద్వారా తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నారు. వీరితోపాటు విదేశీ ఆటగాళ్లు సైతం ఈ టోర్నీలో భాగమవుతున్నారు. తాజాగా గేల్ సైతం ఈ జాబితాలో చేరాడు. 44 ఏళ్ల గేల్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించలేదు. సొంత గడ్డ జమైకాలో ఆటకు వీడ్కోలు పలకాలని అతను భావిస్తున్నాడు. 2021లో ఆస్ట్రేలియాపై విండీస్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది ఐపీఎల్‌లోనూ చివరిసారిగా కనిపించాడు.
వెటరన్ ప్రీమియర్ లీగ్ ద్వారా మీ యూనివర్సల్ బాస్ మైదానంలోకి అడుగుపెడుతున్నాడని గేల్ తెలిపాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఐవీపీఎల్ కోసం సిద్ధంగా ఉండండంటూ క్రిస్ గేల్ పేర్కొన్నాడు. బోర్డ్ ఫర్ వెటరెన్ క్రికెట్ ఇన్ ఇండియా (BVCI) ఆధ్వర్యంలోఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు జరగనుంది. డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో IVPL ఆరంభ ఎడిషన్ జరగనుంది. తెలంగాణ టైగర్స్ జట్టులో క్రిస్ గేల్‌తో పాటు వెస్టిండీస్ మాజీ బ్యాటర్ రికార్డో పావెల్ భాగం అయ్యాడు. భారత మాజీ క్రికెటర్లు సుదీప్ త్యాగి, మన్‌ప్రీత్ గోని కూడా టైగర్స్ జట్టులో సభ్యులు. ఐవీపీఎల్ టోర్నీలో వీరేందర్ సెహ్వాగ్, మునాఫ్ పటేల్, సురేష్ రైనా, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్, యూసుఫ్ పఠాన్, హెర్షెల్ గిబ్స్ లాంటి ఎందరో మాజీలు ఆడనున్నారు. వీవీఐపీ ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వారియర్స్, తెలంగాణ టైగర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఐవీపీఎల్లో ఆడనున్నాయి.
మొత్తం ఎన్ని జట్లు అంటే?
ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు భాగం కానున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్‌లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ప్రతీ జట్టులో నాలుగు నుంచి ఐదుగురు వరల్డ్ బెస్ట్ ప్లేయర్లు ఆడనున్నారు. డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌ల కోసం టికెట్‌లు త్వరలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. మ్యాచ్‌లు యూరోస్పోర్ట్ ఛానెల్, డీడీ స్పోర్ట్స్ మరియు ఫ్యాన్‌కోడ్‌లో భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

