SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ
SLBC Tunnel Accident: తెలంగాణలో జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం గురించి తెలుసుకున్న మోదీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. ఎలాంటి సాయం చేయడానికైనా కేంద్రం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.

SLBC Tunnel Accident In Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ఆరా తీశారు. ఏం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రికి పూర్తి వివరాలు అందించిన రేవంత్ రెడ్డి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి తెలిపారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని ప్రధానికి రేవంత్ రెడ్డి వివరించారు. వారి కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అవసరమైన సహాయక చర్యలన్నీ తీసుకున్నామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఏ సహాయం కావాలని అందివ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డికి మోదీ హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఎన్డీఆర్‌ఎఫ్ టీంను పంపిస్తున్నట్టు తెలిపారు. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు కలిసి పనిచేద్దామని భరోసా ఇచ్చారు.
మోదీ ఫోన్ చేసిన తర్వాత సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సహాయక జరుగుతున్న తీరుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్.ఎల్.బి.సి టన్నెల్‌లో ప్రమాదం జరగడంపై విచారం వ్యక్తం చేశారు. ఎస్.ఎల్.బి.సి టన్నెల్ తవ్వకాల్లో ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న వెంటనే వచ్చినట్టు చెప్పారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడడం కోసం అవసరమైన చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఎనిమిది మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డి పని చేస్తుందన్నారు.
టన్నెల్‌లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు సింగరేణి రిస్క్యూ టీంలు రంగంలోకి దిగాయని, భారత ఆర్మీకి చెందిన రిస్క్యూ టీంలతో సంప్రదింపులు జరిపినట్టు ఉత్తమ్ తెలిపారు. కాసేపట్లో ఆ టీంలు వస్తున్నట్టు వెల్లడించారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ చేసే టీంలతో మాట్లాడామని వివరించారు. ఈ మధ్య కాలంలో ఉత్తరఖండ్‌లో ఇలాంటి ఘటన జరిగిందని తెలిపారు. ఆ టీంలను రప్పిస్తున్నామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఉన్నత స్థాయి ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇదే పనిలో ఉన్నారని సమాలోచనలు చేస్తూ సమిష్టి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు ఉత్తమ్. అగ్నిమాపక డి.జి నారాయణ రావు ఆధ్వర్యంలో రీస్క్యూ టీం పని చేస్తుండగా ఐ. జి సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయన్నారు.
ప్రమాదంలో చిక్కుకున్న ఆ ఎనిమిది మందిలో ప్రాజెక్ట్ ఇంజినీర్, సైట్ ఇంజినీర్ తోపాటు ఇద్దరు మిషన్ ఆపరేటర్లు, నలుగురు వర్కర్లు ఉన్నారని ఆయన వివరించారు
వారి వివరాలను ఆయన మీడియాకు అందించారు.
1..మనోజ్ కుమార్ (PE) ఉత్తర ప్రదేశ్
2.. శ్రీనివాస్ (FE) ఉత్తర ప్రదేశ్
3.. సందీప్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
4.. జటాక్స్ (కార్మికుడు)జార్ఖండ్
5..సంతోష్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
6.. అనూజ్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
7..సన్నీ సింగ్ (కార్మికుడు)జమ్మూ కాశ్మీర్
8.. గురుప్రీత్ సింగ్ (కార్మికుడు)పంజాబ్
టన్నెల్ తవ్వకాలు మొదలు పెట్టిన ఏజెన్సీ నిర్వాహకులు చెప్పే కథనం ప్రకారం అకస్మాత్తుగా లోపలకు నీరు,మట్టి 8 కిలోమీటర్ల మేర రావడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
రోజువారీగా పని మొదలు పెట్టినట్లే ఈ ఉదయం 8 గంటలకు పని మొదలు పెట్టిన 30 నిమిషాలలోనే ఈ దుర్ఘటన జరిగిందని వెంటనే పని నిలిపి వేసి వీలైనంత మందిని బయటకు తీసుకొచ్చామని తెలిపారు.
ఏదైతే టన్నెల్ బోర్ మిషన్ T.B.M ,వద్ద పని మొదలు పెట్టారో అక్కడికి నీరు,మట్టి చేరుతుండడంతోపాటు ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో మిషన్ మీద ఉన్న వారు,వెనుక భాగంలో ఉన్న వారు బయటకు రాగలిగారని మిషన్ ముందు భాగంలో ఉన్న చిక్కుకున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

