Tirupati Brahmotsavam: తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. అసలు అంకురార్పణ అంటే ఏంటి , ఏం చేస్తారు!
Tirupati Venkateswara Swamy Brahmotsavam : బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. అక్టోబరు 03 గురువారం సాయంత్రం అంకురార్పణ జరగనుంది. ఇంతకీ అంకురార్పణ అంటే ఏంటి? ఏం చేస్తారు?
Tirupati Venkateswara Swamy Brahmotsavam : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా అక్టోబరు 03 రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది. వైఖానస ఆగమంలో క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు ఎలాంటి ఆంటకాలు లేకుండా విజయవంతం కావాలని కోరుతూ అంకురార్పణ నిర్వహిస్తారు.
Also Read: ఏడు కొండలవాడి సన్నిధికి ఏడు నడకదారులు - ఏ దారి ఎక్కడి నుంచి!
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందుగా..శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పాలికలలో పుట్టమన్ను వేసి.. అందులో నవధాన్యాలు నాటుతారు. ఆ నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. బ్రహ్మోత్సావాల్లో భాగంగా రోజూ నవధాన్యాలకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం అందుంకే అంకురార్పణ అయింది. సాయంత్రం సమయంలో అంకురార్పణ నిర్వహిస్తారు. మొలకలు ఎంత బాగా వస్తే అంత ఘనంగా ఉత్సవాలు జరుగుతాయని విశ్వసిస్తారు. అంకురార్పణ ఘట్టం తర్వాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు..దీంతో బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు నాంది పలికినట్లు అవుతుంది.
అక్టోబరు 04న బ్రహ్మోత్సవాలకు దేవతలకు ఆహ్వానం పలికేందుకు ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ మేరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టిటిడి అటవీ విభాగం కార్యాలయం నుంచి డిఎఫ్‌వో శ్రీ శ్రీనివాసులు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలో శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 4 శుక్రవారం జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు.
Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!
బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఇందులో భాగంగా వేద పండితులు.. వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. వీటి తయారీ కోసంTTD అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. ఈ దర్భలలో రెండు రకాలుంటాయి...ఒకటి శివ దర్భ, మరొకటి విష్ణు దర్భ. శ్రీ వేంకటేశ్వరుడికి విష్ణు దర్భను ఉపయోగిస్తారు. ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామం నుంచి ఈ విష్ణుదర్భను సేకరించారు టిటిడి అటవీ సిబ్బంది. అక్కడి నుంచి దర్భను కోసుకొచ్చి తిరుమలకు తీసుకొచ్చి వారం పాటు ఎండబెట్టి చాప, తాడు సిద్ధం చేశారు. 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో దర్భ చాప, 225 మీటర్ల పొడవైన తాడు తయారు చేశారు.
Also Read: తిరుమల వెళుతున్నారా.. ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి!
ధ్వజారోహణం తర్వాత అక్టోబరు 4 రాత్రి 9 గంటల నుంచి 11 వరకు పెద్ద శేష వాహన సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 12 ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి