Kumbh Mela 2025: కుంభమేళాకు పుష్కరానికీ తేడా ఏమిటి? ఇవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
Kumbh Mela : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో కుంభమేళా ప్రారంభంకానున్నాయి. అయితే మన దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే పుష్కరాలకు ఈ కుంభమేళాకు తేడా ఏంటీ?
Prayagraj Kumbh Mela 2025: ఈ నెల 14 నుంచి 45 రోజులపాటు ప్రయాగ రాజ్‌లో కుంభమేళా జరగనుంది. 40 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచారిస్తారనే అంచనాలు ఉన్నాయి. అయితే నార్త్ ఇండియాలో పాపులర్ అయిన కుంభమేళాకు.. దక్షిణాది లో ఘనంగా జరిగే పుష్కరాలకు తేడా ఏమిటి? ఇప్పుడు చూద్దాం..!
క్షీర సాగర మధనంతో కుంభ మేళాకు లింక్... మొత్తం 4 తీర్ధాల్లో
పురాణాల ప్రకారం దేవతలు, దానవులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మధనం చేసినప్పుడు అమృత భాండం (కుంభం)తో సహా ధన్వంతరి సముద్రం నుంచి ఉద్భవించాడు. ఆ అమృతాన్ని స్వర్గానికి తీసుకెళ్లే సమయంలో మహావిష్ణువు భూమి మీద 4 పుణ్య తీర్ధాల్లో ఒక్కో చుక్క అమృతాన్ని విడిచాడని అంటారు. ఆ నాలుగు తీర్ధాల్లో ప్రతీ 12 ఏళ్ల కోసారి కుంభమేళా జరుగుతూ వస్తోంది. అ సమయంలో ఆయా తీర్ధాల్లోని జలం అమృతంగా మారుతుంది అని ప్రజల పాపాలు తొలగించే శక్తి అక్కడి నీటికి చేరుతుంది అని నమ్మకం.
ప్రయాగలోని త్రివేణి సంగమం (గంగా -యమున -అంతర్వాహినిగా సరస్వతి), హరిద్వార్ (గంగ ), నాశిక్ (గోదావరి), ఉజ్జయిని (శిప్రా)ల్లో ప్రతీ 12 ఏళ్లకు కుంభమేళా జరుగుతూ వస్తోంది. అయితే ఈ నాలుగు తీర్ధాల్లో కుంభమేళా వేర్వేరు సంవత్సరాల్లో జరుగుతుంది. ప్రతీ 12 ఏళ్లకు జరిగే ఉత్సవాన్ని కుంభమేళా అని.. ప్రతీ 144 (12*12) ఏళ్లకూ జరిగే దానిని మహా కుంభమేళా అని అంటారు. తరువాతి కాలంలో ప్రతీ 6 సంవత్సరాళ్లకు అర్థ కుంభమేళా కూడా జరపడం మొదలైంది. కుంభ అంటే కుండ.. మేళా అంతే భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడే స్థలం కావడంతో ఈ ఉత్సవానికి కుంభమేళా అని పేరు వచ్చింది అని పండితులు చెబుతారు. ఉత్తర భారత దేశంలో బాగా ప్రసిద్ధి చెందిన కుంభమేళా తరువాతి కాలంలో దక్షిణ దేశంలోనూ ప్రాముఖ్యతి పొందింది.
దక్షిణాదిలో ఘనంగా జరిగే నదుల ఉత్సవం- పుష్కరం
దక్షిణాదిలో కుంభమేళా సంస్కృతి లేదు గానీ పుష్కరాలు ప్రసిద్ధికెక్కాయి. ప్రతీ ఏడాది ఒక్కో నది చొప్పున మొత్తం 12 నదులకు పుష్కరాలు జరుపుతారు. అంటే ఒక్కో నదికి ఒకసారి పుష్కరం జరిపితే మళ్ళీ పుష్కరం రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. పుష్కరం అంటేనే 12 అని అర్ధం. ఆ నదులు ఇవే...!
1) గంగ
2) గోదావరి
3)నర్మద
4) సరస్వతి
5) యమున
6) కృష్ణా
7) కావేరి
8) సింధు
9) తుంగ భద్ర
10) ప్రాణహిత
11) భీమా(మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ) (తమిళ నాడు లో తామ్ర పర్ణి నదికి చేస్తారు )
12) తపతి,(మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ) (అస్సాం లో బ్రహ్మపుత్ర కు చేస్తారు )
పుష్కరాలు ఎలా మొదలయ్యాయి అంటే
'జాతక పారిజాత' గ్రంథం ప్రకారం ఒక పుష్కరుడు అనే పండితుడు తపస్సు చేసి తాను జలంలో ఎప్పటికీ బ్రతికే ఉండాలని వరం పొందాడు. ఈ విషయం తెలిసి బృహస్పతి (గురుడు ) తాను ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రయాణించే సమయంలోనే ఒక్కో నదిలో ప్రవేశించమని పుష్కరుడ్ని కోరాడు. దానికి సరేనన్న పుష్కరుడు ప్రతీ ఏడాది ఒక్కో పవిత్ర నదిలో ప్రవేశిస్తూ ఉంటాడు. అ సమయంలో నదీ జలాలకు శక్తి వస్తుంది అని అప్పుడు స్నానం చేసే పాపాలు పోతాయని నమ్ముతారు. పుష్కరం 12 రోజుల జరుగుతుంది. ఉత్తరాది నదులకూ పుష్కరం వస్తుంది కానీ అక్కడకూ భారీ సంఖ్యలో వెళ్ళేది దక్షిణాది ప్రజలే.
నదులను పూజించడమే అసలు లక్ష్యం
ప్రకృతి శక్తులను పూజించడం భారతీయుల ప్రాచీన సంప్రదాయం. అందులోనూ ప్రాణానికి ఆధారమైన జలాన్ని దైవంగా పూజించే సంస్కృతీ అనాదిగా వస్తోంది. ఉత్తరాది కుంభమేళా అయినా దక్షిణాది పుష్కరం అయినా నదులను పూజించడం అనే ప్రాచీన భారతీయ సంప్రదాయాన్ని కొనసాగించడంలో భాగమే అనేది చరిత్రకారుల అభిప్రాయం.