Holi 2023: గుండెల్లో ప్రేమను తెలిపే గుప్పెడు రంగు, వెన్నదొంగ చిలిపి ఆలోచనే హోలీ!
హోలీ 2023: ప్రపంచంలోని రంగులన్నీ ఒకచోట కుప్ప పోశారా అన్నంత అందం, ఆనందం, ఆహ్లాదం. ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా అంతా కలసి జరుపుకునే హోలీకి అల్లరి కృష్ణుడు ఆద్యుడు అని అంటారు..
Holi 2023: పండుగలు ఏవైనా ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఓ పండుగ రైతులది, మరో పండుగ రుతువులది, ఇంకో పండుగ ప్రకృతిని పూజించేది, మరో పండుగ బంధాలు తెలిపేది.అలాగే హోలీకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఇది సామాజిక పండుగ. ఈ రోజు ఏం పిండివంటలు చేసుకున్నామా, ఏఏ దేవుళ్లను పూజించామా, ఉపవాసాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఇలా ఏమీ ఉండవు. గుప్పెడు రంగును చేతపట్టుకుని గుండెల్లో ఉండే భావాలను వ్యక్తపరిచే పండుగ. ఇరుగు పొరుగువారితో, స్నేహితులు, సన్నిహితులు, ప్రియమైనవారితో సంతోషాలు పంచుకునే ఆనంద కేళీ హోలీ. ఈ హోలీ జరుపుకోవడం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కథల్లో రాథా కృష్ణులది ఆసక్తికరం.
Also Read: హోలీ రోజు మీరు చల్లే రంగు మీ మనసులో ఏముందో చెప్పేస్తుంది
యుగయుగాలుగా హోలీ జరుపుకుంటున్నట్టు ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో అన్నిటి కన్నా ఆసక్తిగా అనిపించే కథనం రాథాకృష్ణులది. కన్నయ్య నీలీ మేఘశ్యాముడు కదా..తన నెచ్చెలి రాధ తనకంటే తెల్లగా ఉంటుందని, తనది నలుపని కృష్ణుడు తల్లి యశోద దగ్గర చెప్పాడట. అప్పుడు యశోద కృష్ణుడికి ఓ సలహా ఇస్తుంది. ‘మీకు ఈ నలుపు తెలుపుల గొడవెందుకు, హాయిగా ఏ రంగులోకి కావాలంటే ఆ రంగులను పులుముకోండి’ అని సలహా ఇచ్చిందట. యశోద ఇలా చెప్పడమే ఆలస్యం అనట్టు కృష్ణుడు అలా రంగంలోకి దిగిపోయాడు. రాధతో పాటూ గోపికలందర్నీ రంగు నీళ్లలో ముంచెత్తాడు. ప్రతిగా రాధ కూడా కృష్ణుడిమీద వసంతం కుమ్మరిస్తుంది. అప్పటినుంచి స్నేహితులు, బంధువులు, ప్రేమికులు, సన్నిహితులు ఒకరిమీద మరొకరు రంగులు చల్లుకోవడం ప్రారంభమైందని చెబుతారు. ఇప్పటికీ కృష్ణలీలలతో ముడిపడి ఉన్న బృందావన్, మధుర, బరసానా వంటి పుణ్యక్షేత్రాలలో హోళీని ఘనంగా జరుపుకుంటారు. హోలీ రోజు రాధాకృష్ణులను ఊరేగించడం కూడా ఉత్తరభారతదేశంలో ఉంది. హోలీ తరువాత వచ్చే పంచమినాటి వరకూ కూడా ఈ సంబరాలు సాగుతాయి.
Also Read: కామం దహించి ప్రేమ-సౌభాగ్యం వెల్లివిరిసిన రోజు హోలీ, రంగుల వేడుక వెనుక ఎన్నో పురాణ కథలు
హోలీని డోలోత్సవం అనికూడా అంటారు. హోలీ రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనం గోపికలతో చేరి రంగులు, పూలతో పండుగను జరుపుకున్నట్టుగా పురాణాల్లో ఉంది. ఈ రోజు పువ్వులు, రంగులను ఒకరిపై ఒకరు జల్లుకోవడం వల్ల సౌభాగ్యాలు, అనుబంధాలు, ప్రేమలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. పశ్చిమ బెంగాల్ ల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊయలలో పెట్టి ఊరంగా ఘనంగా ఊరేగిస్తారు. డోలిక అంటే కూడా ఊయల అనే అర్థం. అక్కడ ఈ పండుగను డోలికోత్సవం అంటారు. మణిపూర్లో హోళీ అంటే కృష్ణుని పండుగే. అందుకనే ఈ అయిదు రోజులూ ఊళ్లన్నీ కృష్ణభజనలతో మారుమోగి పోతుంటాయి. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ‘గోవిందజీ’ అనే ప్రముఖ కృష్ణమందిరం ఉంది. ఎప్పుడో మణిపూర్ రాజులు ఈ ఆలయాన్ని కట్టించారు. హోలీ సందర్భంగా ఈ ఆలయం కిటకిటలాడిపోతుంటుంది. భజన బృందాలూ, భక్తులూ యాసంగ్ సందర్భంగా ఈ ఆలయాన్ని దర్శించకపోవడం ఓ లోటుగా భావిస్తారు. హోలీ రోజున ఆలయంలో కృష్ణుని ఉత్సవవిగ్రహం మీద రంగులు చల్లుతూ, ఆ కృష్ణుని కూడా తమ సంబరంలో భాగం చేసుకుంటారు.