Bathukamma celebrations: బతుకమ్మ వేడుకల్లో మంత్రుల సందడి, ఉత్సాహంగా పాల్గొన్న మంత్రులు
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహిళలతో కలిసి ఆడి పాడారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతకమ్మ సంబరాల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతిబింబమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పలు చోట్ల సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని మహిళలతో బతుకమ్మ ఆడారు. మహిళల్లో జోష్ ని నింపారు. బతుకమ్మ ను ఎత్తుకున్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పార్వతీదేవికి ప్రతిరూపమైన గౌరమ్మను ప్రతిష్టించి.. కొలిచే అద్భుతమైన పండుగ అన్న ఆయన.. ప్రపంచంలోనే పువ్వులను పూజించే సంస్కృతి తెలంగానే ఉందన్నారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా బతుకమ్మ పండుగ నిలిచిందన్నారు. అందుకే సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగన రాష్ట్ర పండుగగా నిర్ణయించి నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ పూలపండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు ‘సద్దుల బతుకమ్మ’ను పురస్కరించుకొని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఎంగిలి పూల బతుకమ్మ తో తొమ్మిది రోజుల పాటు తిరొక్క రంగులతో అడపడుచులు జరుపుకొని బతుకమ్మ పండగ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఔన్నత్యానికి ప్రతీకను చాటి చెప్పారని సద్దుల బతుకమ్మ (పెద్ద బతుకమ్మ) పండగ ను వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఆడబిడ్డలందరికి శుభాకాంక్షలు తెలిపారు.
బతుకమ్మ ఉత్సవాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల్లో ఉత్సాహాన్ని నింపేందుకు వారితో కలిసి కోలాటం ఆడారు. అనంతరం సూర్యాపేటకు తలామానికమైన చెరువు ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ వేడుకలు జరుపుకోవడానికి వచ్చిన వేలాదిమంది మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, బావుపేటలో వేడుకలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ హాజరై మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను ఒకచోట పెట్టి వాటి చుట్టు తిరుగుతూ మహిళలంతా పాటలు పాడుతూ ఆడారు. మహిళలతో పాటు మంత్రి గంగుల దాండియా నృత్యాలతో సందడి చేశారు. చిన్న, పెద్దా తేడా లేకుండా కొత్త బట్టలు ధరించి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లాలో ఆదివారం సద్దుల బతుకమ్మ వైభవంగా జరిగింది. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలు పేర్చారు. తంగేడు, గునుగు, గుమ్మడి, కలువ, బంతిపూలతో బతుకమ్మలను తయారు చేసి గౌరమ్మను పూజించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీశ్ రావు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలల్లో మంత్రి హరీష్ రావు సతీ సమేతంగా పాల్గొని బతుకమ్మ ఆడారు.
ఒకప్పుడు బతుకమ్మ అంటే హేళనగా మాట్లాడే వారిని అలాంటిది నేడు స్వరాష్ట్రంలో బతుకమ్మను జరుపుకోవడం సంతోషంగా ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ఖమ్మంలోని జూనియర్ కళాశాల గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో మంత్రి అనిల్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.