MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ - ఈ సారి పది స్థానాలకు ఎన్నికలు
Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఒక్కో రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి.

MLA quota MLC elections: తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీ నేతలకు మరోసారి పదవుల పండుగ వచ్చింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి మూడో తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. పోలింగ్ అవసరం అయితే ఇరవయ్యో తేదీన జరుపుతారు. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. మార్చి 29వ తేదీన పది మంది ఎమ్మెల్సీలు రెండు రాష్ట్రాల తరపున పదవి విరమణ చేయనున్నారు.
ఏపీలో అన్నిస్థానాలూ కూటమికే !
ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు కూటమికే దక్కనున్నాయి. యనమల, జంగా కృష్ణమూర్తి , డి.రామారావు, పి.అశోక్‌బాబు, తిరుమలనాయుడు పదవీకాలం ముుగుస్తోంది. వీరిలో ఒక్క జంగా కృష్ణమూర్తి తప్ప అందరూ టీడీపీకి చెందిన వారే. అయితే జంగా కృష్ణమూర్తి కూడా ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఐదుగురు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీల పదవి కాలం ముగుస్తోంది. ఇప్పుడు ఐదు ఎమ్మెల్సీ సీట్లు కూటమికే దక్కనున్నాయి.
నాగేంద్రబాబుకు ఎమ్మెల్సీ సీటు
ఐదు సీట్లలో ఒకటి జనసేన పార్టీకి ఇంతకు ముందే ఖరారు చేశారు. జనసేన ప్రధాన కార్యదర్శి, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఈ ఎమ్మెల్సీ సీటును ప్రకటించారు. తర్వాత ఆయనను మంత్రి వర్గంలోకి కూడా తీసుకోనున్నారు. బీజేపీకి ఏమైనా ఎమ్మెల్సీ సీట్లను కేటాయిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఇటీవల రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి రాజ్యసభ సీటును బీజేపీకి కేటాయించే అవకాశం ఉంటే.. మిగిలిన నాలుగు ఎమ్మెల్సీ సీట్లను తెలుగుదేశం పార్టీ నాయకులకు కేటాయించే అవకాశం ఉంది.
తెలంగాణలో బీఆర్ఎస్‌కు ఒకటి లేదా రెండు ఎమ్మెల్సీలు దక్కే అవకాశం
తెలంగాణలోనూ ఐదుగురు ఎమ్మెల్సీలు పదవీ కాలం ముగుస్తోంది. మహమ్మూద్ ఆలీ, సత్యావతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, యగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ హస్సేన్ పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. వీరిలో నలుగురు బీఆర్ఎస్ కు చెందిన వారు.. ఒకరు మజ్లిస్ కు చెందిన వారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు దక్కనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో బలా బలాల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఒక సీటును మజ్లిస్ సాయంతో గెలుచుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ ఒక్క సీటు లభిస్తుంది. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం ఆ పార్టీకి మైనస్.
మజ్లిస్ కు కాంగ్రెస్ పార్టీ ఓ సీటు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అద్దంకి దయాకర్ , జీవన్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, నీలం మధు ముదిరాజ్, బస్వరాజ్ సారయ్య పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బీఆర్ఎస్ తరపున ఎవరికి చాన్సిస్తారన్న దానిపై ఇంకా ఆ పార్టీలో ఎలాంటి చర్చ జరగడం లేదు. కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

