Vallabhaneni Vamsi: వంశీకి షాకిచ్చిన కోర్టు - మూడు రోజులు పోలీసులకు సమాధానాలు చెప్పాల్సిందే
Vamsi: వల్లభనేని వంశీని మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదుదారును కిడ్నాప్ చేసిన కేసులో ఆయనను అరెస్టు చేశారు.

Vallabhaneni Vamsi custody: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు మూడు రోజుల పాటు ప్రశ్నించనున్నారు. కస్టడీ కోసం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించేందుకు అనుమతి ఇచ్చింది. లాయర్ సమక్షంలో పోలీసులు కస్టడీలోకి తీసుకుని సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంపై కీలక అంశాలను బయటకు తెచ్చే అవకాశం ఉంది.
ఫిర్యాదు దారుడ్ని కిడ్నాప్ చేసిన కేసులో వంశీ నిందితుడు
తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి వ్యవహారంలో సత్యవర్ధన్ అనే యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో వల్లభనేని వంశీ కూడా నిందితుడిగా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించి..కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. అయితే హఠాత్తుగా ఓ రోజు సత్యవర్థన్ తన పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లుగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎవరికీ తెలియకుండా ఓ రోజు సాయత్రం కోర్టుకు వచ్చి జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కలకలం రేగింది.
సత్యవర్థన్ ను తన ఫ్లాట్ లోకి తీసుకెళ్తున్న సీసీ ఫుటేజీ రిలీజ్
ఇది జరిగిన రెండు రోజులకే వల్లభనేని వంశీని హైదరాబాద్ లోని మైహోం భూజా అపార్టుమెంట్ లో విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి కేసును విత్ డ్రా చేసుకునేలా చేశారని కేసు పెట్టారు. అయితే సత్యవర్ధన్ ను తాను బెదిరించలేదని తనకేమీ తెలియదని వంశీ అంటున్నారు. అయితే సత్యవర్ధన్ ను వంశీ మైహోమ్ భూజాలోని తన ఇంట్లోకి తీసుకెళ్లి..తీసుకొస్తున్న దృశ్యాలను టీడీపీ నేతలు విడుదల చేశారు. కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన రోజున కూడా సత్యవర్ధన్ ను వంశీ అనుచరులే కోర్టుకు తీసుకు వచ్చారని పోలీసులు చెబుతున్నారు.
మూడు రోజుల కస్టడీలో కీలక సమాచారం తెలుసుకోనున్న పోలీసులు
ఈ క్రమంలో సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేయించడం.. కోర్టులో వాంగ్మూలం ఇప్పించడం వరకూ అన్ని అశాలపై వంశీ నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది. అదనంగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. దాంతో పోలీసులు ఆ కేసులోనూ అరెస్టు చూపించే అవకాశం ఉంది. ఇతర కేసులు కూడా వంశీని చుట్టుముట్టనున్నాయి. ఫిర్యాదుదారునే కిడ్నాప్ చేసి బెదిరించిన కేసు కాబట్టి బెయిల్ కూడా అంత సామాన్యంగా రాదని అంటున్నారు.
Also Read: ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీకి వెళ్లాలి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు





















