Telangana DCA: ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
Telangana DCA: వైద్యుల సలహా లేకుండా యాంటీబయోటిక్ మందులు విక్రయిస్తున్న దుకాణాలపై డీసీఏ అధికారులు ఉక్కుపాదం మోపారు. నోటీసులు జారీ చేశారు. కఠిన చర్యలు సిద్ధమవుతున్నారు.

Telangana DCA: మావవాళి ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న నిశ్శబ్ధ మహమ్మారి యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్‌పై తెలంగాణ రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ వార్ ప్రకటించింది. మందుల షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్న యాంటీబయాటిక్స్ విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలోనే నిబంధనలకు విరుద్ధంగా మందులు అమ్ముతున్న 190 మందుల షాపులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించారు.
రాష్ట్రవ్యాప్తంగా మందుల షాపులపై దాడులు
రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ బుధవారం నాడు ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ఈ తనిఖీల్లో అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఈ తనిఖీ చేసిన పలు షాపుల్లో యాంటీబయాటిక్స్ విక్రయాలకు సంబంధించిన తీవ్రమైన ఉల్లంఘనలను గుర్తించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అత్యంత శక్తివంతమైన యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్నారు. మందుల విక్రయాలకు సంబంధించిన సరైన బిల్లులు ఇవ్వడం లేదు. షాపుల్లో ఉండాల్సిన రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్‌్ అందుబాటులో లేరు. నియంత్రిత మందులైన షెడ్యూల్ హెచ్-1 డ్రగ్ రిజిస్టర్‌లను, ప్రిస్క్రిప్షన్ రికార్డులను నిర్వహించడం లేదు.
ఈ లోపాలను తీవ్రంగా పరిగణించిన అధికారులు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆయా యాజమాన్యాలపై శాఖాపరమైన చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసిం మాట్లాడుతూ.. ప్రజలకు, ఫార్మసీ రంగ నిపుణులను హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం మానవాళికి పొంచి ఉన్న టాప్ 10 ఆరోగ్య ప్రమాదాల్లో యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ కటిగా ఉందని, దీని వల్ల 2019లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.7 లక్షల మంది మరణించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధికంగా దీని బారిన పడుతున్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యాంటీబయాటిక్స్, యాంటీ వైరల్స్ వంటి మందులు సరైన మోతాదులో, సరైన సమయంలో వైద్యుల సలహా మేరకు వాడకపోతే ప్రమాదాలు కొని తెచ్చుకున్న వాళ్లు అవుతారని పేర్కొన్నారు. అందుకే దీన్ని శాస్త్రవేత్తలు సూపర్ బగ్స్ అని పిలుస్తున్నారని ఇవి శరీరంలోకి చేరితే అత్యంత శక్తివంతమైన మందులు కూడా పని చేయవని హెచ్చరించారు. అప్పుడు సాధారణ జబ్బులు కూడా ప్రాణాంతకం అవుతాయని వార్నింగ్ ఇచ్చారు.
సొంత వైద్యంతో చేటు
జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్‌లకు యాంటీబయాటిక్స్ పని చేయవని వైద్యులు చెబుతున్నారు. అయినా చాలా మంది వాటిని ఉపయోగించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని అన్నారు. అవగాహన లేకపోవడంతో మెడికల్ షాపుల సలహాలు, ఇతరుల సలహాలతో అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ వాడుతున్నారని ఖాసిం స్పష్టం చేశారు.
రూల్స్ ఏం చెబుతున్నాయి?
డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం కొన్ని రకాల యాంటీబయాటిక్స్, మందులను షెడ్యుల్ హెచ్-1 పరిధిలో ఉంచారు. వీటిని విక్రయించేటప్పుడు ఫార్మసీలు తప్పనిసరిగా డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ చూడాలి. ఆ వివరాలను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలి. కానీ డబ్బులకు కొందరు వ్యాపారులు వాటిని పట్టించుకోవడం లేదు. దీని వల్ల యాంటీబయాటిక్స్ దుర్వినియోగం జరుగుతుంది.





















