Singareni Issue: సింగరేణి అక్రమాలపై సిబిఐ కి సై - అవసరమైతే కేంద్రం స్వాధీనం -కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Singerani irregularities: సింగేరణి అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధమని కిషన్ రెడ్డి ప్రకటించారు. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపైనా విచారణ జరగాల్సి ఉందన్నారు.

CBI probe into Singerani irregularities: సింగరేణి కాలరీస్ సంస్థలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో జరిగినట్లుగా చెప్తున్న అక్రమాలపై తాము సీబీఐ విచారణకు సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఒడిశాలోని నైని బొగ్గు గని టెండర్ల వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించారు. నైని గని గురించి విచారణ కోరుతున్న బీఆర్ఎస్ నేతలు, తమ హయాంలో తాడిచర్ల గనిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన వైనంపై ఎందుకు మౌనంగా ఉన్నారు అని నిలదీశారు. గత పదేళ్లలో సింగరేణిని రాజకీయ అవసరాలకు వాడుకొని, సంస్థ ఆర్థిక పునాదులను దెబ్బతీశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. వాటిపైనా విచారణకు సిద్ధమన్నారు.
సింగరేణిలో ప్రస్తుతం జరుగుతున్న టెండర్ల ప్రక్రియపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన ఆరోపణలు, సీబీఐ విచారణ డిమాండ్‌పై కిషన్ రెడ్డి స్పందించారు. సీబీఐ విచారణకు కేంద్రం పూర్తి సుముఖంగా ఉందన్నారు. అయితే, సింగరేణిలో 51 శాతం వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రతిపాదన రావాలని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, గత ప్రభుత్వంలో జరిగిన తాడిచర్ల అక్రమాలు , ప్రస్తుత నైని బ్లాక్ వివాదాలపై విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి వస్తే మరుక్షణమే సీబీఐ రంగంలోకి దిగుతుందని ఆయన హామీ ఇచ్చారు. అవసరం అయితే సింగరేణి నిర్వహణకు స్వాధీనం చేసుకునేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉన్నారు.
సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన కొత్త అక్రమాలకు దారితీస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ అవసరమని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా సింగరేణిని అవినీతికి అడ్డాగా మార్చాయని, ఒకరి తప్పులను మరొకరు దాస్తూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కేవలం నైని బ్లాక్ మాత్రమే కాకుండా, గత 12 ఏళ్లుగా సింగరేణిలో జరిగిన ప్రతి పాలసీ నిర్ణయం, టెండర్ల కేటాయింపుపై స్వతంత్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రుల వద్ద వాటాల విషయంలో తేడాలు రావడంతోనే విషయం బయటకు వచ్చిందన్నారు.
తెలంగాణ ప్రజల ఆస్తి అయిన సింగరేణిని కాపాడుకోవడం తమ బాధ్యతని, కేంద్రం తన వాటా మేరకు సంస్థ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉందన్న కిషన్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన వాటాను సద్వినియోగం చేసుకొని పారదర్శకతకు సహకరించాలని కోరారు. రాష్ట్రం చెల్లించాల్సిన రూ. 30 వేల కోట్ల బకాయిల వల్ల సంస్థ ఆర్థికంగా చితికిపోతోందని, ఇప్పటికైనా రాజకీయం మానేసి వాస్తవాలను బయటపెట్టాలని సూచించారు. తాజా కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో సింగరేణి వివాదం ఇప్పుడు కేంద్రం మరియు రాష్ట్రం మధ్య ఒక పెద్ద పొలిటికల్ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది.


















