Telangana ACB: దొరికినంత దండుకున్న అదనపు కలెక్టర్ - ఏసీబీ రైడ్స్‌లో కోట్ల అక్రమాస్తులు.. కిలోల కొద్దీ బంగారం స్వాధీనం!
Additional Collector: హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ అర్రమడ వెంకట్ రెడ్డి అక్రమాస్తుల బండారం బయటపడింది. ఏసీబీ సోదాల్లో కిలోల కొద్దీ బంగారం దొరికింది.

Hanamkonda District Additional Collector Illegal assets: హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్, విద్యాశాఖ ఇన్ఛార్జ్ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న అర్రమడ వెంకట్ రెడ్డి అవినీతి సామ్రాజ్యాన్ని ఏసీబీ అధికారులు బుధవారం బయటకు తీశారు. జనవరి 21న తెల్లవారుజాము నుంచే హైదరాబాద్, హన్మకొండ సహా పలు ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో వెంకట్ రెడ్డి అక్రమంగా ఆర్జించిన సుమారు రూ. 10 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు. ఇందులో ఎల్బీ నగర్‌లోని ఒక విలాసవంతమైన ఇల్లు, ఒక ఖరీదైన విల్లాతో పాటు వివిధ ప్రాంతాల్లోని 10 ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు విచారణలో భాగంగా వెంకట్ రెడ్డి ఇంట్లో, బ్యాంక్ లాకర్లలో లభించిన నగదు, బంగారం చూసి అధికారులు విస్తుపోయారు. సోదాల్లో సుమారు రూ. 30 లక్షల నగదు లభించగా, బ్యాంక్ లాకర్‌లో మరో రూ. 42 లక్షలను ఏసీబీ గుర్తించింది. వీటన్నింటికీ మించి ఏకంగా 2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 1.6 లక్షలు పలుకుతున్న సమయంలో, పట్టుబడిన బంగారం విలువ కోట్లలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆస్తులన్నీ తన అధికార హోదాను అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
వెంకట్ రెడ్డి అవినీతి భాగోతం డిసెంబర్ 5, 2025న ఒక పాఠశాల రెన్యూవల్ ఫైల్ వ్యవహారంతో వెలుగులోకి వచ్చింది. క్రియేటివ్ మోడల్ స్కూల్ ప్రాథమిక, హైస్కూల్ సెక్షన్ల రెన్యూవల్ ఫైల్‌ను క్లియర్ చేయడానికి ఆయన రూ. 60,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, వెంకట్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పట్లో దొరికిన రూ. 60 వేలు చాలా చిన్నమొత్తమని మాత్రమేనని, లోతుగా దర్యాప్తు చేస్తే అసలు తిమింగలం బయటపడుతుందని భావించిన ఏసీబీ.. గత నెల రోజులుగా నిశితంగా ఆయన ఆస్తులపై ఆరా తీసింది.
#Telangana Anti-Corruption Bureau (#ACB) on Wednesday conducted extensive searches at the residences of #Hanamkonda Additional Collector Venkata Reddy in connection with allegations of possessing disproportionate assets.
— BNN Channel (@Bavazir_network) January 21, 2026
According to official sources, simultaneous raids were… pic.twitter.com/QR3AQKfXXC
ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న వెంకట్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఇతర పెట్టుబడులపై కూడా దృష్టి సారించారు. ఒక బాధ్యతాయుతమైన రెవెన్యూ అధికారిగా ఉంటూ, విద్యాశాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఇలా అవినీతికి పాల్పడటం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని, ఈ అక్రమార్జనలో ఇతర అధికారుల పాత్రపై కూడా విచారణ జరుపుతున్నామని ఏసీబీ స్పష్టం చేసింది.





















