Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
Jana Sena activist: కార్యకర్త ఇంటికి వెళ్లి.. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ . వేదనలోనూ సామాజిక బాధ్యతతో అవయవ దానం చేసి వసంత రాయలు కుటుంబం ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు.

Jana Sena chief Pawan Kalyan: జనసేన కార్యకర్తల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. కష్టకాలంలో కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తామన్న తన హామీని నిలబెట్టుకుంటూ, బుధవారం ఆయన పెడన నియోజకవర్గం, పెదచందాల గ్రామంలో పర్యటించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి, వారిలో ధైర్యాన్ని నింపారు. పార్టీ తరపున రూ. 5 లక్షల బీమా చెక్కును బాధితులకు అందజేయడమే కాకుండా, ఆ కుటుంబ స్థితిగతులపై ఆరా తీసి తగిన భరోసా ఇచ్చారు.
వసంతరాయలు కుటుంబం ప్రదర్శించిన సామాజిక బాధ్యత పట్ల పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ఇంటి పెద్దను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ, వసంతరాయలు అవయవాలను దానం చేసి మరో ఐదుగురికి ప్రాణదానం చేయడం తనను ఎంతగానో కదిలించిందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. మరణంలోనూ సామాజిక స్పృహ చాటుకున్న ఈ కుటుంబం అందరికీ ఆదర్శమని కొనియాడారు. వారి త్యాగాన్ని గౌరవిస్తూ, ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం , పార్టీ తరపున హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో బాధితుల సమస్యలను పవన్ కళ్యాణ్ ఎంతో ఓపికగా విన్నారు. మృతుడి కుమార్తెకు ఉన్న వినికిడి , మాటల లోపాన్ని గుర్తించిన ఆయన, టీటీడీ శ్రవణం ప్రాజెక్టు ద్వారా మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే, కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్న కుమారుడికి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ కింద ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేవలం పరామర్శకే పరిమితం కాకుండా, ఆ కుటుంబ భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ఆయన తీసుకున్న నిర్ణయాలు స్థానికులను ఆకట్టుకున్నాయి.
కొద్ది నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్‌కు గురైన కృష్ణా జిల్లా, కృత్తివెన్ను మండలం, చందాల గ్రామానికి చెందిన జనసైనికుడు శ్రీ చందూ వీర వెంకట వసంతరాయలు గారి మరణం అత్యంత బాధాకారం.
— JanaSena Party (@JanaSenaParty) January 21, 2026
కుటుంబ సభ్యుడిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ, మానవత్వాన్ని… pic.twitter.com/7pqUyWUsSk
పవన్ కళ్యాణ్ పర్యటన అడుగడుగునా జననీరాజనంగా సాగింది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు పెడన నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన ప్రజలు, మహిళలు, కార్యకర్తలు రోడ్ల వెంబడి బారులు తీరారు. హారతులు, పూలమాలలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారి కష్టసుఖాల్లో తోడుంటామని పవన్ కళ్యాణ్ పంపిన ఈ సందేశం జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.






















