PM Kisan Money: ఎదురుచూపులు ఫలించే వేళ ఇది - రైతుల ఖాతాల్లోకి ఈ రోజు రూ.2000 జమ
PM Kisan Yojana News: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఈ రోజు 9.80 కోట్ల మంది రైతులకు రూ.22000 కోట్లను పీఎం కిసాన్ నిధి 19వ విడత కింద విడుదల చేస్తారు.

PM Kisan Nidhi 19th Installment To Be Released Today: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది రైతుల నిరీక్షణ నేటితో ముగియనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), ఈ రోజు (సోమవారం, ఫిబ్రవరి 24, 2025), బిహార్‌లోని భాగల్‌పూర్‌లో బటన్ నొక్కి పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తారు. దీంతో, దేశవ్యాప్తంగా 9.80 కోట్ల మంది చిన్న & మధ్య తరహా రైతుల బ్యాంక్ ఖాతాలకు 19వ విడత కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi Yojana) డబ్బు బదిలీ అవుతుంది. ప్రధాన మంత్రి మధ్యాహ్నం 2 గంటలకు భాగల్పూర్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచే దేశంలోని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ. 2000 చొప్పున జమ చేస్తారు.
రైతులకు ఈ రోజు రూ.22,000 కోట్లు విడుదల
ఈ రోజు, భాగల్పూర్‌లో మెగా కిసాన్ సమ్మాన్ సమరోహ్ నిర్వహిస్తారు. దీనికి సమాంతరంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలోనే, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత కింద రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 2000 బదిలీ చేసేందుకు ప్రధాని మోదీ బటన్ నొక్కుతారు. ప్రధాన మంత్రి కిసాన్ యోజన మలి విడత 18వ విడతలో, దేశంలోని అర్హులైన అందరు రైతులకు రూ. 20,665 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర వ్యవసాయం & రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గతంలో చెప్పారు. 19వ విడతలో దాదాపు 9.80 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు దాదాపు రూ. 22,000 కోట్లు బదిలీ చేస్తామని వెల్లడించారు. మెగా కిసాన్ సమ్మాన్ సమరోహ్ కార్యక్రమంలో దాదాపు 2.5 కోట్ల మంది రైతులు భౌతికంగా & వర్చువల్‌గా పాల్గొంటారని వ్యవసాయ మంత్రి తెలిపారు.
ఆరు సంవత్సరాల్లో రూ. 3.46 లక్షల కోట్లు విడుదల
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు, ఈ నిధి నుంచి దాదాపు 9 కోట్ల 60 లక్షల మంది రైతుల ఖాతాలకు నేరుగా డబ్బు బదిలీ జరిగింది. ఈసారి దాదాపు 9 కోట్ల 80 లక్షల మంది రైతులకు రూ. 22 వేల కోట్ల మొత్తాన్ని బదిలీ చేయనున్నారు. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు, 6 సంవత్సరాలలో, దాదాపు రూ. 3.46 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. 19వ విడత విడుదల కాగానే ఈ మొత్తం రూ. 3.68 లక్షల కోట్లకు చేరుతుంది.
రైతులకు రుణ భారం నుంచి ఉపశమనం
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద, ఏటా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 6,000 నేరుగా జమ చేస్తారు. ఈ డబ్బు విడతకు రూ. 2,000 చొప్పున మూడు విడతలుగా రైతుల అకౌంట్లలోకి చేరుతుంది. మన దేశంలో, చిన్న రైతులు సీజన్ ప్రారంభ సమయంలో ఎరువులు, విత్తనాలు వంటి పెట్టుబడి ఖర్చుల కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. బయటి వ్యక్తుల దగ్గర భారీ వడ్డీ రేట్లకు రుణాలు తీసుకుని అప్పుల్లో కూరుకుపోతున్నారు. రైతులకు అలాంటి పరిస్థితి రానీయకుండా, కిసాన్ సమ్మాన్ నిధి నుంచి రైతులకు అవసరమైన వ్యవసాయ సంబంధిత ఖర్చులను విడుదల చేస్తున్నారు. PM కిసాన్‌పై IMPRI చేసిన అధ్యయనం ప్రకారం, ఈ పథకం కింద సాయం అందుకుంటున్న రైతుల సమస్యలు తగ్గాయి & అప్పులపై ఆధారపడడం కూడా తగ్గింది.
మరో ఆసక్తికర కథనం: కొత్త రికార్డ్ దిశగా పసిడి రేటు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

