Gambhir Vs Kohli: కోహ్లీపై గంభీర్ అక్కసు.. అందుకే పాక్ తో మ్యాచ్ లో అలా చేశాడా..? ఇన్నాళ్లు తను చెప్పిందంతా అబద్ధమేనా..?
పాక్ బౌలర్లు, కెప్టెన్ రిజ్వాన్ కావాలనే కోహ్లీ సెంచరీకి సైంధవుల్లా ఆడ్డు నిలిస్తే, హార్దిక్ ను పంపి గంభీర్ కూడా అలాగే వ్యవహరించాడని అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు.

Ind Vs Pak Updates: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై నెగ్గి ఐసీసీ చాంపియన్ షిప్ లో భారత్ తన ప్రతీకారం తీర్చుకుంది. 2017 ఎడిషన్ ఫైనల్లో 180 పరుగులతో అప్పుడు భారత్ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ.. తన పేరుకు తగ్గట్టుగానే బిగ్ మ్యాచ్ లో సత్తా చాటాడు. పలు రికార్డులను బద్దలు కొడుతూ, సెంచరీ (100 నాటౌట్) చేసి ఒంటిచేత్తో, చేజ్ చేసి, ఛేజ్ మాస్టర్ అనే బిరుదును సార్థకం చేసుకున్నాడు. దీతో పాక్ పై 6 వికెట్లతో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్ లో విజయం ద్వారా మెగాటోర్నీ సెమీస్ కు దాదాపు టీమిండియా వెళ్లిపోయినట్లే.. సోమవారం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ లో కివీస్ గెలిస్తే, అటు బంగ్లా, ఇటు పాక్ ఇంటిముఖం పడుతాయి. అదే సమయంలో భారత్, కివీస్ లు సెమీస్ కు చేరుకుంటాయి. ఇక పాక్ తో మ్యాచ్ లో ఇండియా గెలిచినా, భారత టీమ్ మేనేజ్మెంట్ వ్యవహార శైలిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా గౌతం గంభీర్ తీరుపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు విమర్శిస్తున్నారు.
ఆ వ్యూహం వట్టిదేనా..?
గంభీర్ హెడ్ కోచ్ గా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ మంత్రం పటిస్తున్నాడు. దీని వల్ల కేఎల్ రాహుల్ ఇబ్బంది పడుతున్నా లెక్క చేయడం లేదు. అయితే పాక్ తో మ్యాచ్ లో తన మంత్రాన్ని పక్కనపెట్టి, శ్రేయస్ అయ్యర్ ఔట్ కాగానే స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను పంపడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. లెక్క ప్రకారం అక్కడ కేఎల్ రాహుల్ లేదా అక్షర్ పటేల్ బ్యాటింగ్ కు దిగాలి. ఇలా కాకుండా హార్దిక్ ను ఎందుకు బ్యాటింగ్ కు దింపారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అంటే ఇన్నాళ్లుగా తను ఈ వ్యూహం గురించి చెబుతున్నదంతా వట్టిదేనా అని విమర్శిస్తున్నారు. బ్యాటింగ్ లో హార్దిక్ ను చూడగానే అభిమానుల గుండెలు జారి పోయింది. గతంలో ఎన్నోసార్లు అసంబద్ధమైన ఆటతో పలువురు ప్లేయర్ల ఫిఫ్టీలు, సెంచరీలను చెడగొట్టిన చరిత్ర హార్దిక్ సొంతం.. అతను క్రీజులో ఉంటే నాన్ స్ట్రైకర్లో ఉన్న ప్లేయర్లు ఫిఫ్టీ లేదా సెంచరీని మర్చిపోవాల్సిందేనని పేర్కొంటున్నారు.
కోహ్లీ సెంచరీకి ఆటంకాలు..
నిజానికి గత కొంతకాలంగా పామ్ కోల్పోయి కోహ్లీ తంటాలు పడుతున్నాడు. మెగాటోర్నీలో సెంచరీ చేస్తే అతని ఆత్మవిశ్వాసం రెట్టింపు అవతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక వైపు పాక్ బౌలర్లు, కెప్టెన్ రిజ్వాన్ కావాలనే కోహ్లీ సెంచరీకి సైంధవుల్లా ఆడ్డు నిలిస్తే, హార్దిక్ ను పంపి గంభీర్ కూడా అలాగే వ్యవహరించాడని అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. నిజానికి ఆ సమయంలో పాండ్యా అవసరం లేదు. మ్యాచ్ గెలిచే పరిస్థితిలో ఎలాగూ టోర్నీ నుంచి పాక్ ఔటవుతుంది. అప్పుడు రేసులో బంగ్లా, కివీస్ లు నిలుస్తాయి. ఒకవేళ బంగ్లా..తమ చివరి రెండు మ్యాచ్ ల్లో గెలిచినా, చివరి మ్యాచ్ లో కివీస్ తోనే ఇండియా ఆడుతుంది. అప్పుడు కావాల్సిన నెట్ రన్ రేట్ తో పరుగులు చేసుకోవచ్చు కదా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తన సహజ సూత్రానికి విరుద్ధంగా హార్దిక్ కు పంపి కోహ్లీపై అక్కసు ను వెళ్లగక్కాడని అభిమానులు పేర్కొంటున్నారు. ఐపీఎల్ సందర్బంగా కోహ్లీతో గంభీర్ కు గొడవైన సంగతి తెలిసిందే. దీన్ని మనసులో పెట్టుకుని గంభీర్ ఏమైనా అలా ప్రవర్తించాడా..? అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా వన్డేల్లో 51వ శతకం బాది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను ఆనంద డోలికల్లో కోహ్లీ ముంచాడు. ఈవెన్, పాక్ లో కూడా కోహ్లీ సెంచరీపై సంబరాలు జరిగాయంటేనే కోహ్లీ క్రేజ్ అర్థమవుతోంది. ఏదేమైనా ఇప్పటికైనా ఇలాంటి చీప్ ట్రిక్స్ వదిలేయాని గంభీర్ కు కొంతమంది అభిమానులు సలహా ఇస్తున్నారు.
Read Also: IND vs PAK: క్లూ లెస్ మేనేజ్మెంట్.. బుర్ర లేని కెప్టెన్ -పాక్ టీంపై మాజీల ఫైర్




















