24th July 2024 News Headlines: జులై 24 న మీ స్కూల్ అసెంబ్లీలో చదవదగ్గ న్యూస్ హెడ్‌లైన్స్ ఇక్కడ చూసుకోవచ్చు
24th July School News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి.
24th July School News Headlines Today:
1. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అయిదేళ్ల తర్వాత నిధులు కేటాయించారు. మోదీ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. పోలవరం అయ్యే ఖర్చు పూర్తిగా తామే తీసుకుంటామని.. నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర, ప్రకాశం, రాయలసీమకు ప్రత్యేక నిధులు కేటాయించడానికి కూడా కేంద్రం ఓకే చెప్పింది.
2. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో ఏడోసారి దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వికసిత భారత్‌ను దృష్టిలో ఉంచుకొని 2024-25 సంవత్సరానికి గాను మొత్తం రూ.48,20,512 కోట్లతో ఈ బడ్జెట్‌ను సభకు సమర్పించారు.
3. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు ఈ ఏడాదిలో 233 రోజులు పనిచేయనున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 315 రోజులు ఉండగా 82 సెలవులు ఉన్నాయి. దసరా సెలవులు అక్టోబర్ 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి. పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షళు ఫిబ్రవరి 10 నుంచి జరగనున్నాయి.
4. తెలంగాణ అసెంబ్లీలో నేడు రూ.2 లక్షల పంట రుణమాఫీపై చర్చ జరగనుంది. చర్చకు అనుమతించాలని సీఎం రేవంత్.. స్పీకర్‌ను కోరగా ఆమోదం లభించింది. కాగా ఈ ఏడాదికి బడ్జెట్‌ను శాసనసభలో రేపు ప్రవేశపెట్టనున్నారు. అయితే సభ్యులు అవగాహన తెచ్చుకునేందుకు ఈ నెల 26న విరామం ఇచ్చి 27, 28వ తేదీల్లో బడ్జెట్‌పై సభలో చర్చిస్తారు. 30న ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టనుంది.
5. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో రూ. 26,216.38 కోట్లు లభించనున్నాయి. ఇందులో ఐటీ రూ. 9,066.56 కోట్లు, కస్టమ్స్ నుంచి రూ. 1,157.45 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ. 243.98 కోట్లు, కార్పొరేషన్ పన్ను రూ. 7,872.25 కోట్లు, కేంద్ర జీఎస్టీ రూ. 7,832.19 కోట్లు, సేవల పన్ను రూపంలో రూ. 0.86 కోట్లు, ఇతర ట్యాక్స్‌ల రూపంలో రూ. 43.09 కోట్లు వస్తాయి.
6. నీట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ధర్మాసనం తేల్చి చెప్పింది. నీట్‌లో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్లను కొట్టేసింది.
7. భారత్‌లో అటవీ భూములు పెరుగుతున్నాయి. అటవీ భూములు భారీగా పెరిగిన దేశాల్లో భారత్.. ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఇందులో చైనా టాప్‌లో ఉండగా.. సెకండ్ ప్లేస్‌లో ఆస్ట్రేలియా ఉంది. భారత్‌లో ప్రతీ ఏడాది 2 లక్షల 66 వేల హెక్టార్ల అటవీ భూమి పెరుగుతూ వచ్చింది.
8. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ మళ్లీ పెను భూతంలా విరుచుకపడుతోంది. నిమిషానికి ఒకరు ఈ మహమ్మారి వల్ల మరణిస్తున్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 2023 నాటికి 4 కోట్ల మంది ఎయిడ్స్‌తో జీవిస్తున్నారని తెలిపింది. 90 లక్షల మంది ఎయిడ్స్‌కు చికిత్స కూడా తీసుకోవడం లేదని సంచలన విషయాలు వెల్లడించింది.
9. మహిళల ఆసియా కప్‌లో టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. వరుసగా మూడో విజయం సాధించి సత్తా చాటింది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 179 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులకే పరిమితమైంది.
10. కింద పడ్డావని ఆగిపోకు.. తిరిగి ప్రయత్నిస్తే విజయం నీదే... అబ్దుల్ కలాం