Public Provident Fund: నెలకు రూ.12,500 కట్టండి చాలు, ఏకంగా కోటి రూపాయలు మీ చేతికొస్తాయి
కాల గడువు ముగిసే సరికి మీ అకౌంట్‌లో కనిపించేది మాత్రం రూ.1 కోటి 03 లక్షల 08 వేలు (రూ. 1,03,08,000). ఆ డబ్బంతా మీదే.
Public Provident Fund: డబ్బులను కొన్ని కాలావధుల్లో చిన్న మొత్తాలతో గానీ, ఒకేసారి పెద్ద మొత్తంలో గానీ పెట్టుబడిగా పెట్టడానికి మన దేశంలో బోలెడన్ని మార్గాలున్నాయి. ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడుల వల్ల నష్ట భయం ఉండదు. గ్యారెంటీ అమౌంట్ ఉంటుంది. మంచి వడ్డీ పొందవచ్చు. దీంతో పాటు కట్టాల్సిన పన్నులో తగ్గింపు లేదా మాఫీ వంటి ప్రయోజనాలూ అదనంగా కలిసి వస్తాయి. ఇలాంటి రిస్క్ లేని చిన్న మొత్తాల పెట్టుబడుల కోసం ఒక మంచి పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident Fund లేదా PPF).
నెలకు రూ.12,500తో రూ.కోటి సంపాదన
పీపీఎఫ్‌లో మీరు ప్రతి నెల క్రమం తప్పకుండా కేవలం రూ. 12,500 కడితే చాలు. ఏకంగా ఒక కోటి రూపాయల సృష్టించవచ్చు. ప్రతి నెల రూ. 12,500 చొప్పున, లేదా ఏడాదికి ఒక్కసారే 1.5 లక్షల చొప్పున 25 సంవత్సరాలు కడుతూ వెళ్లాలి. అప్పుడు, 25 ఏళ్లకు మీరు కట్టిన మొత్తం రూ. 37,50,000 (37 లక్షల 50 వేల రూపాయలు) అవుతుంది. కానీ, ఆ కాల గడువు ముగిసే సరికి మీ అకౌంట్‌లో కనిపించేది మాత్రం రూ.1 కోటి 03 లక్షల 08 వేలు (రూ. 1,03,08,000). ఆ డబ్బంతా మీదే.
అంటే, మీరు 37,50,000 కడితే, దాని వడ్డీ మీద వడ్డీ (చక్రవడ్డీ) కలిసి మరో రూ. 65,58,000 (65 లక్షల 58 వేల రూపాయలు) మీతో సంబంధం లేకుండా ఆటోమేటిక్‌గా జమ అవుతుంది. ఈ కోటి రూపాయల్లో మీరు జమ చేసిన అసలు కంటే వడ్డీ రూపంలో వచ్చిన కొసరే ఎక్కువగా ఉంటుంది. దీనినే "పవర్ ఆఫ్ కాంపౌండింగ్" అంటారు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో, ఒక ఏడాదిలో రూ. 1.5 లక్షలకు మించి పెట్టుబడి పెట్టకూడదు. ఒక ఏడాదిలో కనీస మొత్తం రూ. 500. ఇంతకన్నా తక్కువ జమ చేయకూడదు.
టాక్స్ ఫ్రీ స్కీమ్
ఈ పథకం కింద మీరు జమ చేసే మొత్తానికి పన్ను వర్తించదు, ఇది టాక్స్ ఫ్రీ స్కీమ్. మీరు ఆదాయ పన్ను పత్రాలు సమర్పించే సమయంలో ఈ మొత్తానికి మినహాయింపు ఉంటుంది.
వడ్డీ రేటు
పీపీఎఫ్ మీద వచ్చే వార్షిక వడ్డీ రేటు 7.1 శాతం. వార్షిక ప్రాతిపదికన, మీ వడ్డీని అసలుకు కలిపి, ఆ మొత్తం వడ్డీని (చక్రవడ్డీ) లెక్కిస్తారు. ఇలా కొనసాగుతూ ఉంటుంది. దేశం ఆర్థిక పరిస్థితిని బట్టి, కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ఈ పథకం కింద వడ్డీ రేటును మారుస్తుంది.
పీపీఎఫ్ ఖాతా ఎక్కడ తెరవాలి?
మీరు ఈ పథకం కింద ఏ బ్యాంక్‌లోనైనా, పోస్టాఫీసులోనైనా ఖాతా తెరవవచ్చు. PPF పథకాల మెచ్యూరిటీ వ్యవస్ధి 15 సంవత్సరాలు. ఆ తర్వాత కూడా ఈ పథకాన్ని కొనసాగించాలని మీరు భావిస్తే, మరో ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్లవచ్చు.
15 ఏళ్లకు ఈ పథకంలో ఎంత డబ్బు వస్తుంది?
PPF కాలిక్యులేటర్ ప్రకారం, పెట్టుబడిదారుడు ఈ పథకంలో నెలకు రూ. 12,500 లేదా సంవత్సరానికి రూ. 1.50 లక్షలు పెడితే 15 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి రూ. 40.68 లక్షలు అవుతుంది. ఇందులో... 22.50 లక్షల రూపాయలు మీ పెట్టుబడిగా, మిగిలిన 18.18 లక్షల రూపాయలు వడ్డీగా చెల్లిస్తారు.