మోదీ పేరు చెప్పాలని సీబీఐ ఒత్తిడి తెచ్చింది -బాంబు పేల్చిన అమిత్ షా
షోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని నిందితుడిగా చేర్చాలని తీవ్రంగా ప్రయత్నాలు జరిగాయన్నారు అమిత్‌షా. సీబీఐ తనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చిందన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం తనకు అనుకూలంగా రాజకీయ అవసరాల కోసం వాడుకుంటుందని ప్రతిపక్షాలు గళమెత్తుతున్నారు. ఈ టైంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పెద్ద బాంబు పేల్చారు. అసలు నిజమైన దుర్వినియోగం అంటే ఏంటో అంటూ 2005 షోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసును తెరపైకి తీసుకొచ్చారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం మాట్లాడుతూ... 2005 షోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. ఈ కేసులో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీని నిందితుడిగా పేరు చెప్పాలని సీబీఐ తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చిందని తెలిపారు.
"నేను సిబిఐ దుర్వినియోగానికి బాధితుడినే. కాంగ్రెస్ ఎలాంటి అవినీతి ఆరోపణను తీసుకురాలేదు. నేను గుజరాత్ హోం మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్ కేసులో వారు నన్ను అరెస్టు చేశారు," అని ఆయన అన్నారు. "వారు 'కహే కో పరేషాన్ హో రహే హో; మోడీ కా నామ్ లే లో, ఆప్కో చోడ్ దేంగే [మిమ్మల్ని మీరు ఎందుకు ఇబ్బంది పెట్టుకుంటున్నారు? మాకు మోడీ పేరు చెప్పండి మిమ్మల్ని వదిలిపెడతాం]" అని షా అన్నారు.
ఇంత జరిగినా తాము అప్పుడు నల్ల బట్టలు వేసుకోలేదని అలాగే పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకోలేదన్నారు అమిత్‌షా.
2005లో నేరస్థుడు, ఉగ్రవాదిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న షోహ్రాబుద్దీన్ షేక్, అతని భార్య కౌసర్ బీని గుజరాత్ పోలీసులు హత మార్చారు. ఇదే షోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు. అప్పట్లో ఇదో సంచలనం కేసుగా వార్తల్లో నిలిచింది. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. తర్వాత దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వడంతో వివిధ టర్న్‌లు తీసుకుందీ కేసు.
ఎన్‌కౌంటర్ జరిగిన టైంలో గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రిగా అమిత్ షా ఉన్నారు. అతను సమక్షంలోనే ఎన్‌కౌంటర్ కుట్ర జరిగిందని ఆయన ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో ఆయన్ని 2010లో సీబీఐ అరెస్ట్ చేసింది. షోహ్రాబుద్దీన్ షేక్, అతని భార్య కౌసర్ బీని అంతమొందించే కుట్రలో షా ప్రమేయం ఉందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) పేర్కొంది. షాపై నేరపూరిత కుట్ర, కిడ్నాప్, హత్య, సాక్ష్యాలను నాశనం చేసినట్లు అభియోగాలు మోపారు.
తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ షా కొట్టిపారేశారు. రాజకీయంగానే తనను ఈ కేసులో ఇరికించారని పేర్కొన్నారు. అమిత్‌షా 2010లోనే బెయిల్‌పై విడుదలయ్యారు. కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిగేలా సుప్రీం కోర్టు కేసును గుజరాత్ నుంచి ముంబైకి బదిలీ చేసింది. డిసెంబరు 2014లో సీబీఐ కోర్టు షాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నుంచి ఆయన్ని నిర్దోషిగా తప్పించింది.
షా బుధవారం ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ... "90వ రోజు, నాపై తగిన ఆధారాలు లేవని హైకోర్టు చెప్పడంతో బెయిల్ లభించింది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సీబీఐ నాపై కేసు నమోదు చేసిందని కోర్టు పేర్కొన్న ముంబైలో కేసు నడిచింది. తర్వాత నాపై ఉన్న అన్ని ఆరోపణలు కోర్టు కొట్టివేసింది. "అప్పుడు అధికారంలోనే వీళ్లే ఉన్నారు. మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, పి చిదంబరం. ఈరోజు మేం వారిపై తప్పుడు కేసులు పెట్టడం లేదు. వారు చేసిన అవినీతిపై ఆధారాలతో కేసులు నమోదు చేసాము, ”అని షా అన్నారు.
ఆప్ నేతలు సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియాను ప్రస్తావిస్తూ, "ఈ వ్యక్తులు చాలా కాలంగా జైలులో ఉన్నారు, వారు నిర్దోషులైతే, వారికి చట్టంపై నమ్మకం ఉండాలి, వారు దోషులుగా తేలకపోతే విడుదల అవుతారు. ," అని చెప్పారు.