Odela Railway Station Review - ఓదెల రైల్వే స్టేషన్ రివ్యూ : శోభనం తర్వాత రోజు పెళ్లి కుమార్తెను చంపేస్తున్నది ఎవరు?
OTT Review - Telugu Movie Odela Railway Station Review : దర్శకుడు సంపత్ నంది రాసిన కథతో తెరకెక్కిన చిత్రం 'ఓదెల రైల్వే స్టేషన్'. ఆహా ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన చిత్రమిది.
అశోక్ తేజ
హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహా, సాయి రోనక్, పూజిత పొన్నాడ తదితరులు
సినిమా రివ్యూ : ఓదెల రైల్వే స్టేషన్
రేటింగ్ : 2.5/5
నటీనటులు : హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహా, సాయి రోనక్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారి, భూపాల్, 'జబర్దస్త్' అప్పారావు తదితరులు
సినిమాటోగ్రఫీ : సౌందర్ రాజన్. ఎస్
సంగీతం : అనూప్ రూబెన్స్
నిర్మాత : కె.కె. రాధామోహన్
రచన : సంపత్ నంది
దర్శకత్వం : అశోక్ తేజ
విడుదల తేదీ: ఆగస్టు 26, 2022
ఓటీటీ వేదిక : ఆహా
హెబ్బా పటేల్ (Hebah Patel) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఓదెల రైల్వే స్టేషన్' (Odela Railway Station Movie). దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే... చిన్న సినిమాలకు కథలు అందిస్తూ, నిర్మిస్తున్న సంపత్ నంది ఈ చిత్రానికి రచయిత. ఇందులో సాయి రోనక్ (Sai Ronak), వశిష్ట సింహ, పూజిత పొన్నాడ (Poojitha Ponnada) ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఆహా ఓటీటీలో ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Odela Railway Station Story) : అనుదీప్ (సాయి రోనక్) సివిల్స్ టాపర్. ఐఏఎస్ వద్దని మరీ ఐపీఎస్ తీసుకుంటారు. పోస్టింగ్‌కు ముందు మూడు నెలల ట్రైనింగ్ కోసం ఓదెల వెళతారు. ఆ ఊరిలో కొత్త పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తాడు. ఆ తర్వాత అదే విధంగా మరో మూడు హత్యాచారాలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్‌కు దొరికాడా? లేదా? ఆయనకు దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేసే తిరుపతి (వశిష్ట సింహ) భార్య రాధ (హెబ్బా పటేల్) ఏ విధంగా సహాయ పడింది? అనుదీప్ ప్రేయసి స్ఫూర్తి (పూజిత పొన్నాడ) ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు, రాధ ఎవరి తల నరికి పోలీస్ స్టేషన్ గడప ఎక్కింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Odela Railway Station Movie Review) : 'ఓదెల రైల్వే స్టేషన్'లో కథాంశం కామన్‌గా క్రైమ్ థ్రిల్లర్స్‌లో కనిపించేది. వరుస హత్యలకు పాల్పడుతున్న సైకో కిల్లర్ / హంతకుడిని పట్టుకోవడం కోసం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడమే ఈ సినిమాలోనూ ఉంటుంది. హంతకుడు ఎవరు? అనే అంశంలో మిగతా పాత్రధారులపై అనుమానం కలిగించేలా రచన సాగింది. అయితే... శోభనమైన మరుసటి రోజు పెళ్లి కూతురుపై అత్యాచారానికి పాల్పడి హత్య చేయడమనే అంశం క్యూరియాసిటీ కలిగిస్తుంది. ఈ సినిమాలో ప్రత్యేకత అది.
సంపత్ నంది పల్లెటూరి నేపథ్యంలో రా అండ్ రియలిస్టిక్ కథ రాశారు. దర్శకుడు అశోక్ తేజ కథకు న్యాయం చేస్తూ తెరకెక్కించారు. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ పల్లె వాతావరణాన్ని, సినిమాలో మూడ్‌ను చక్కగా క్యారీ చేశారు. నేపథ్య సంగీతం సన్నివేశాలతో పాటు సాగింది. అయితే, గుర్తుంచుకునే విధంగా లేదు.
ఆడియన్స్‌కు క్లైమాక్స్ షాక్ ఇస్తుంది. అలాగే, క్లైమాక్స్‌లో చెప్పిన మానసిక రుగ్మత గురించి విని... 'అటువంటి రోగం ఉంటుందా?' అని ఆశ్చర్యానికి లోనవుతారు. ఈ కథకు, కథలో ప్రధాన పాత్రధారి ఎందుకు అలా మారాడు? అనేది చెప్పడానికి అది లాజికల్‌గా ఉందేమో!? కానీ, కథకు దాని వల్ల వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. స్టార్టింగ్ సీన్ తర్వాత కొంచెం ఆలోచిస్తే అసలు హంతుకుడు ఎవరనేది గుర్తు పట్టడం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ, ఆ తర్వాత సన్నివేశాలతో ప్రేక్షకుడిని డైవర్ట్ చేస్తూ కథను ముందుకు నడిపారు. ఈ సినిమాకు నిడివి తక్కువ కావడం ప్లస్ పాయింట్. పిల్లలతో కలిసి చూసే విధంగా లేకపోవడం ఒక మైనస్.
నటీనటులు ఎలా చేశారు? : ఇంటెన్స్ లుక్స్, యాక్టింగ్‌తో సాయి రోనక్ సర్‌ప్రైజ్ చేశారు. పోలీస్ రోల్‌లో డీసెంట్‌గా ఉన్నారు. వశిష్ట సింహ నటన సహజంగా ఉంది. గెటప్ కూడా! హెబ్బా పటేల్ మేకప్ లేకుండా నటించారు. లుక్ పరంగా డీ గ్లామర్ కావచ్చు. ఒక సన్నివేశంలో మాత్రం బోల్డ్ గా నటించారు, గ్లామర్ షో చేశారు. పతాక సన్నివేశాల్లో హెబ్బా పటేల్ తన శక్తి మేరకు నటించారు. అయితే, ఫేస్‌లో క్యూట్‌నెస్ కనిపించింది. రౌద్ర రసాన్ని బలంగా పలికించినట్లు అయితే భావోద్వేగాలు తారాస్థాయికి వెళ్ళేవి. డ్రసింగ్ పరంగా అదీ బోల్డ్ సన్నివేశమే. పూజిత పొన్నాడ పాత్ర నిడివి తక్కువే. ఉన్నంతలో బాగా చేశారు. మిగతా నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
Also Read : 'లైగర్' రివ్యూ : విజయ్ దేవరకొండ పంచ్ అదిరిందా? లేదా? పూరి ఏం చేశారు?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'ఓదెల రైల్వే స్టేషన్'... రా అండ్ బోల్డ్ ఫిల్మ్. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్‌కు ఈ వీకెండ్ బెటర్ ఆప్షన్. ఇందులో కొన్ని రొటీన్ సీన్స్ ఉన్నాయి. అయితే... సహజత్వానికి దగ్గరగా తీయడం, పల్లెటూరి నేపథ్యం వల్ల కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ప్రారంభం నుంచి ముగింపు వరకూ వీక్షకులలో ఓ క్యూరియాసిటీ కలిగిస్తూ కథ ముందుకు వెళుతుంది.
Also Read : హౌస్ ఆఫ్ ది డ్రాగన్ మొదటి ఎపిసోడ్ రివ్యూ: గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్థాయిని అందుకుందా?