(Source: ECI/ABP News/ABP Majha)
House of the Dragon Review: హౌస్ ఆఫ్ ది డ్రాగన్ మొదటి ఎపిసోడ్ రివ్యూ: గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్థాయిని అందుకుందా?
గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ మొదటి ఎపిసోడ్ ఎలా ఉందంటే?
మిగ్వెల్ సపోచ్నిక్
ప్యాడీ కాన్సిడైన్, మాట్ స్మిత్, మిల్లీ అల్‌లాక్ తదితరులు
వెబ్ సిరీస్ రివ్యూ: హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఎపిసోడ్ 1
రేటింగ్ : 3/5
నటీనటులు : ప్యాడీ కాన్సిడైన్, మాట్ స్మిత్, మిల్లీ అల్‌లాక్ తదితరులు
సినిమాటోగ్రఫీ : ఫాబియన్ వాగ్నర్
సంగీతం : రమిన్ జవాదీ
నిర్మాణం : హెచ్‌బీవో
రచన: జార్జ్ ఆర్.ఆర్.మార్టిన్, ర్యాన్ కోండెల్
దర్శకత్వం: మిగ్వెల్ సపోచ్నిక్
విడుదల తేదీ: ఆగస్టు 22, 2022
ఓటీటీ వేదిక: డిస్నీప్లస్ హాట్‌స్టార్
సినిమాలు, వెబ్ సిరీస్ చూసే వారికి ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎనిమిది సీజన్ల పాటు సాగిన ఈ సిరీస్ ప్రపంచంలోనే టాప్ రేటెడ్ వెబ్ సిరీస్‌ల్లో ఒకటి. చివరి రెండు సీజన్లు నిరాశ పరచకపోయి ఉంటే ప్రపంచంలోనే నంబర్ వన్ వెబ్ సిరీస్ అయి ఉండేది అని అభిమానులు ఇప్పటికీ అభిప్రాయపడుతూ ఉంటారు. దర్శక ధీరుడు రాజమౌళి ఫేవరెట్ వెబ్ సిరీస్ కూడా ఇదే. తన చిత్రాల్లో అక్కడక్కడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఛాయలు కనిపిస్తూ ఉంటాయి కూడా. ఇప్పుడు దానికి ప్రీక్వెల్‌గా ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ అనే వెబ్ సిరీస్‌ను హెచ్‌బీవో రూపొందించింది. అందులో మొదటి ఎపిసోడ్ సోమవారం ఉదయం విడుదల అయింది. ఈ ఎపిసోడ్ ఎలా ఉంది? అభిమానుల అంచనాలను అందుకుందా?
కథ: గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో ఖలీసిగా పేరొందిన రాణి డెనేరియస్ టార్గేరియన్ (ఎమీలియా క్లార్క్) పుట్టడానికి 172 సంవత్సరాల ముందు నాటి కథ ఇది. ఐరన్ థ్రోన్ మీద కూర్చున్న కింగ్ జెహేరియస్ టార్గేరియన్ తన సొంత కూతురు అయిన రేనిస్ టార్గేరియన్ (ఈవ్ బెస్ట్), దూరపు బంధువు అయిన విసేరిస్ 1 టార్గేరియన్‌ను (ప్యాడీ కన్సైడిన్) రాజుగా ఎంచుకోవడంతో ఈ కథ ప్రారంభం అవుతుంది. సింహాసనం మీద మగవాళ్లు మాత్రమే కూర్చోవాలనే ఉద్దేశంలో జెహేరియస్ టార్గేరియన్ ఈ పని చేస్తాడు. కాలక్రమంలో రేనిస్ టార్గేరియన్‌కు రెనైరా టార్గేరియన్ (మిల్లీ అల్‌కాక్) పుడుతుంది. తను డ్రాగన్లను సైతం లొంగదీసుగోగలదు. విసేరిస్ భార్య మళ్లీ గర్భవతి అవుతుంది. ఈసారి మగబిడ్డ పుట్టి సింహాసనానికి వారసుడు అవుతాడని విసేరిస్ ఆశలు పెట్టుకుంటాడు. ఒకవేళ తనకు కొడుకు పుట్టకపోతే వెస్టెరోస్ రాజ్యం విసేరిస్ తమ్ముడైన ప్రిన్స్ డేమన్‌కు (మాట్ స్మిత్) వెళ్లిపోతుంది. తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే మొదటి ఎపిసోడ్ చూడాల్సిందే.
విశ్లేషణ: మూడేళ్ల క్రితం వచ్చిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ చివరి సీజన్ అభిమానులను డిజప్పాయింట్ చేసింది. చివరి సీజన్ క్యాన్సిల్ చేసి మళ్లీ తీయాలని అభిమానులు డిమాండ్ చేసే రేంజ్‌లో నిరాశకు గురి చేసింది. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే దీనిపై చర్చ మొదలైంది. గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ తరహాలో అభిమానులను అలరిస్తుందా? లేక మళ్లీ నిరాశ పరుస్తుందా? ఇలా రకరకాల సందేహాలు. కానీ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ మొదటి ఎపిసోడ్ ఆ అనుమానాలను పటాపంచలు చేస్తుంది. మొదటి ఎపిసోడ్ నుంచే ప్రేక్షకుడు కథలో లీనం అయ్యే చేస్తుంది. ఈ ఎపిసోడ్‌లో ప్రధానంగా రెనైరా టార్గేరియన్ మెయిన్ రోల్ అన్నట్లు ప్రొజెక్ట్ చేశారు కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు హీరో అవుతారో, ఎవరు ఎప్పుడు విలన్ అవుతారో, ఎవరి కథ అర్థంతరంగా ముగిసిపోతుందో చెప్పలేం కాబట్టి లీడ్ రోల్ విషయంలో ఇప్పుడే చెప్పడం కష్టం.
ఈ షోను మొదటి నుంచి ఫాలో అయ్యే ఫ్యాన్స్‌ను అయితే తిరిగి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇది కేవలం మొదటి ఎపిసోడ్ కాబట్టి కథ గురించి ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. కానీ మొదటి ఎపిసోడ్‌ను తీర్చిదిద్దిన తీరు మాత్రం కచ్చితంగా ఆకట్టుకుంటుంది. విజువల్స్, వీఎఫ్ఎక్స్ కూడా ఎంతో రిచ్‌గా భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమాలకు తీసిపోని రీతిలో ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీమ్ మ్యూజిక్ ఇందులో అక్కడక్కడా వినిపిస్తుంది. ఇప్పుడు విడుదల అయిన మొదటి ఎపిసోడ్ మిగతా ఎపిసోడ్ల మీద అంచనాలు పెంచుతుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే... ఈ ఎపిసోడ్‌లో ప్రధానంగా రెనైరా టార్గేరియన్, ప్రిన్స్ డేమన్‌ల పాత్రలపై ఎక్కువ దృష్టి పెట్టారు. రెనైరా పాత్ర పోషించిన మిల్లీ అల్‌కాక్, డేమన్ పాత్ర పోషించిన మాట్ స్మిత్ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిల్లీ అల్‌కాక్‌ను టార్గేరియన్ పాత్రకు తీసుకున్నప్పుడు మొదట విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు అభిమానులే ఆ పాత్రకు తను పర్ఫెక్ట్ ఫిట్ అంటున్నారు. రానున్న ఎపిసోడ్లలో ఏయే క్యారెక్టర్లను ఎక్స్‌ప్లోర్ చేస్తారో చూడాలి మరి.
ఓవరాల్‌గా చెప్పాలంటే... గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంచనాలను నిలబెడుతూ పెద్ద స్కేల్‌లో ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ఈ మొదటి ఎపిసోడ్‌ను తీశారు. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటాయి కాబట్టి ఈ ఎపిసోడ్ చూసేటప్పుడు పిల్లలు చుట్టు పక్కల ఉండకుండా చూసుకోవాలి. ఈ సిరీస్‌లో మొత్తం 10 ఎపిసోడ్లు ఉండనున్నాయి. ప్రతి సోమవారం ఉదయం కొత్త ఎపిసోడ్ విడుదల చేస్తారు.
Also Read : తెలుగులో పబ్లిసిటీ లేకుండా విడుదలైన ధనుష్, నిత్యా మీనన్ 'తిరు' సినిమా ఎలా ఉందంటే?
Also Read : హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?