Thiru Movie Review - తిరు రివ్యూ : ధనుష్, నిత్యా మీనన్ సినిమా ఎలా ఉందంటే?
Thiru - Thiruchitrambalam Movie Review In Telugu: ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా 'తిరుచిత్రాంబళం'. తెలుగులో 'తిరు'గా విడుదలైంది. తమిళంతో పాటు ఈ రోజు తెలుగునాట థియేటర్లలో విడుదలైంది.
మిత్రన్ ఆర్ జవహర్
ధనుష్, రాశీ ఖన్నా, నిత్యా మీనన్ తదితరులు
సినిమా రివ్యూ : తిరు
రేటింగ్ : 2.5/5
నటీనటులు : ధనుష్, రాశీ ఖన్నా, నిత్యా మీనన్, ప్రియా భవానీ శంకర్, భారతీ రాజా, ప్రకాష్ రాజ్, శ్రీ రజనీ తదితరులు
మాటలు (తెలుగులో) : హనుమాన్ చౌదరి
సినిమాటోగ్రఫీ : ఓం ప్రకాష్
సంగీతం : అనిరుధ్ రవిచందర్
నిర్మాత : కళానిధి మారన్
రచన, దర్శకత్వం: మిత్రన్ ఆర్. జవహర్
విడుదల తేదీ: ఆగస్టు 18, 2022
ధనుష్ (Dhanush) తెలుగు మార్కెట్ మీద దృష్టి పెట్టారు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో 'సార్' సినిమా చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించారు. ఈ రెండూ ప్రేక్షకుల ముందుకు రావడానికి ముందు తమిళంలో చేసిన సినిమాలను తెలుగులో విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా 'తిరు' (Thiruchitrambalam Telugu Version)ను తీసుకువచ్చారు. ఇందులో తెలుగులోనూ సినిమాలు చేస్తున్న రాశీ ఖన్నా (Raashi Khanna), నిత్యా మీనన్ (Nithya Menon), ప్రకాష్ రాజ్ వంటి నటీనటులు ఉన్నారు. ఈ సినిమా (Thiru Movie Review) ఎలా ఉంది?
కథ (Thiru Story) : పండు అలియాస్ తిరు ఏకాంబరం (ధనుష్) ఫుడ్ డెలివరీ బాయ్. అతనికి ఉన్న ఏకైక ఫ్రెండ్ శోభన (నిత్యా మీనన్). తండ్రి నీలకంఠం (ప్రకాష్ రాజ్)తో గొడవ జరిగినా... ప్రపోజ్ చేసిన అమ్మాయి అనూష (రాశీ ఖన్నా) నో చెప్పినా... శోభనతో షేర్ చేసుకుంటాడు. ఒక రోజు ఆమెతోనూ మాట మాట పెరిగి... తనకు దూరంగా వెళ్ళమని ఆమెతో పండు అంటాడు. ఎందుకు? తండ్రి మీద పండు ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు? గొడవలకు ఎందుకు దూరంగా ఉంటాడు? ఎందుకు భయపడతారు? ఆ భయాన్ని ఎలా అధిగమించాడు? చివరకు, ఎవర్ని ప్రేమించాడు? ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Thiru Review) : కన్నతండ్రిని ద్వేషించే కుమారుడు చివరికి అర్థం చేసుకోవడం... చిన్ననాటి నుంచి స్నేహితులుగా పెరిగిన అబ్బాయి - అమ్మాయి మధ్య ప్రేమ చిగురించడం... ఈ తరహా కథలు తెలుగు, తమిళ భాషలకు కొత్త కాదు. ఆయా చిత్రాలకు, 'తిరు'కు డిఫరెన్స్ ఏంటంటే... నేచురల్ సీన్స్, హీరోయిన్ రోల్!
సినిమా ప్రారంభమైన కాసేపటికి పండు, శోభన ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకు వెళ్లారు దర్శకుడు మిత్రన్. వాళ్ళిద్దరి పాత్రల్లో మీకు తెలిసిన ఎవరో ఒకరు గుర్తుకు వస్తారు. ఆ సన్నివేశాలు అంత సహజంగా ఉండటమే కాదు, నవ్విస్తాయి కూడా హీరో హీరోయిన్లు కూడా ఆ సన్నివేశాలను నెక్స్ట్ లెవల్‌కు తీసుకు వెళ్లారు. ధనుష్ పాత్ర మీద సింపతీ పెరుగుతుంది. అయితే... ఆ తర్వాత సినిమా రొటీన్ రూటులోకి వెళ్ళింది. ఇంటర్వెల్ ముందు కాసేపు, ఇంటర్వెల్ తర్వాత నెక్స్ట్ సీన్‌లో ఏం జరుగుతుందో ప్రేక్షకుడు సులభంగా ఊహించవచ్చు. సినిమా ప్రారంభంలోనే ముగింపు ఎలా ఉంటుందనే క్లారిటీ వస్తుంది. ఫ్యామిలీ డ్రామా సీన్స్ మరీ రొటీన్. విలేజ్ ఎపిసోడ్ సినిమా లెంగ్త్ పెంచింది. ఇక... తండ్రిని హీరో ఎందుకు ద్వేషిస్తున్నాడు? అనేదానికి చూపించిన కారణం సహేతుకంగా లేదు. అందువల్ల, ఆసక్తిగా ప్రారంభమైన సినిమా... మధ్యలో బోర్ కొట్టిస్తూ... చివరకు చిన్న ట్విస్ట్ ఇచ్చి ముగుస్తుంది.
అనిరుధ్ స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం కథలో భాగంగా సాగాయి. అయితే ఈ మధ్య ఆయన చేసిన సూపర్ హిట్ సినిమాల స్థాయిలో సంగీతం లేదు. 'మేఘం...' పాట, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ బావున్నాయి. సినిమాటోగ్రఫీతో లైవ్లీనెస్ తీసుకొచ్చారు ఓం ప్రకాష్. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
నటీనటులు ఎలా చేశారు? : ధనుష్... నిత్యా మీనన్... ఇద్దరిలో ఈ సినిమాకు హీరో ఎవరు? అంటే నిత్యా పేరు ముందు గుర్తొస్తుంది. ధనుష్‌తో నటించిన ప్రతి సన్నివేశంలోనూ అంతలా డామినేట్ చేశారు. సహజంగా నటించారు. అలాగని, ధనుష్ సరిగా చేయలేదని కాదు. ఆయన నటన సహజంగా ఉంది. సన్నివేశానికి ఏం కావాలో అది చేసినట్లు అనిపిస్తుంది. నిత్యా మీనన్ మాత్రం కొత్తగా కనిపిస్తారు. సినిమాకు ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చారు. ధనుష్, నిత్యా మీనన్ మధ్య సీన్స్ ఆకట్టుకుంటాయి. సినిమా ఫస్టాఫ్ అంతా వాళ్ళిద్దరి భుజాల మీద నడిచింది.
రాశీ ఖన్నా చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కాస్త నవ్వుతూ కనిపించే పాత్రలో కనిపించారు. ఆమె పాత్ర నిడివి తక్కువే. ధనుష్, రాశీ మధ్య స్టార్టింగ్ సన్నివేశాల్లో ఆమె అందంగా ఉన్నారు. ప్రియా భవానీ శంకర్ పాత్ర నిడివి కూడా తక్కువే. ఉన్నంతలో ఆమె బాగా చేశారు. ప్రకాష్ రాజ్ గ్రేట్ యాక్టర్. నటుడిగా ఆయనను తక్కువ చేయలేం. కానీ, ఆయన పాత్రకు మరొకరితో డబ్బింగ్ చెప్పించడం బాలేదు. కనెక్ట్ ధనుష్ తాతయ్య పాత్రలో భారతి రాజా నటన సహజంగా ఉంది. ఆయన్ను మర్చిపోవడం కష్టమే. మిగతా నటీనటులు చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు.
Also Read : కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'తిరు'. సినిమాకు ధనుష్, నిత్యా మీనన్ నటన ప్లస్ అయితే... రొటీన్ ఫ్యామిలీ డ్రామా సీన్స్ మైనస్. ముందుగా చెప్పినట్లు... హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు, ఆ సంభాషణలు ఆకట్టుకుంటాయి. అలాగే, ధనుష్ - భారతీ రాజా మధ్య సీన్స్ కూడా! నిత్యా మీనన్ అభిమానులు ఆమె కోసం ఒకసారి థియేటర్లకు వెళితే వెళ్ళవచ్చు. తెలుగులో ఎటువంటి ప్రచారం లేకుండా విడుదల చేయడం వల్ల ఈ సినిమా వస్తున్న సంగతి చాలా మంది ప్రేక్షకులకు తెలియలేదు.
Also Read : హలో వరల్డ్ రివ్యూ: ఆర్యన్ రాజేష్, సదా నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?