Subham Movie Teaser: 'శోభనం' గదిలో వధువు ఊహించని ట్విస్ట్ - సమంత నిర్మించిన 'శుభం' మూవీ టీజర్ చూశారా?
Samantha Production Movie: స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన 'శుభం' మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. భార్యభర్తల మధ్య టీవీ సీరియళ్ల వల్ల జరిగే గొడవలతో సాగే టీజర్ ఆకట్టుకుంటోంది.

Subham Movie Teaser Unveiled: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నిర్మాతగా వ్యవహరించిన 'శుభం' (Subham) మూవీ టీజర్ రిలీజైంది. ఈ సినిమాకు 'సినిమా బండి' ఫేం ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించగా.. హర్షిత్ రెడ్డి, సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
టీజర్ ఎలా ఉందంటే?
'శోభనం' గదిలో వధువు ఇచ్చే ట్విస్ట్‌తో ప్రారంభమైన 'శుభం' (Subham) టీజర్ ఆకట్టుకుంటోంది. ఆ సమయంలో సరిగ్గా వధువు టీవీ ఆన్ చేసి సీరియల్ చూస్తుంది. ఎంతో మెమొరబుల్ మూమెంట్ అని ఈ టైంలో సీరియల్ ఏంటి అని వరుడు గట్టిగా పిలవగా ఆమె సీరియస్‌గా ఓ ఘోస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం మూవీపై ఆసక్తిని పెంచేస్తుంది. హారర్, కామెడీ జోనర్‌లో భార్యాభర్తల మధ్య జరిగే సంఘటనలే ప్రధానాంశంగా స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తోంది.
Also Read: మూడు రోజుల్లోనే 'మ్యాడ్ స్క్వేర్' రికార్డు కలెక్షన్లు - థియేటర్లలో నవ్వుల వసూళ్లు ఎంతో తెలుసా?
ఈ సమ్మర్‌కు రిలీజ్
హీరోయిన్ సమంత 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి.. చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె సంస్థలో రూపొందిన ఫస్ట్ సినిమా 'శుభం (చచ్చినా చూడాల్సిందే)'పై హైప్ నెలకొంది. అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా నవ్విస్తూ, థ్రిల్లింగ్ సన్నివేశాలతో మెప్పిస్తూ పూర్తి వినోదాత్మక కుటుంబ కథా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. వివేక్‌సాగర్ అద్భుతమైన సంగీతం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ వేసవిలోనే మూవీని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
'ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం'
ప్రేక్షకులు మా అందరి కష్టాన్ని వెండితెరపై వీక్షించి ఆశీర్వదిస్తారని అందరం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు సమంత తెలిపారు. ''శుభం' సినిమా కోసం ఎంటైర్ టీమ్ ఎంతో కష్టపడింది. దాన్ని మీ అందరితో షేర్ చేసుకోవటానికి మేం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఈ వేసవిలో నవ్వులతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాటిక్ రోలర్ కోస్టర్ ఎక్స్‌పీరియెన్స్ అనుభవించటానికి సిద్ధంగా ఉండండి' అని అన్నారు.
ఈ శుభం సినిమాకు 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించగా.. వసంత్ మరిగంటి స్టోరీ అందించారు. అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'పరదా' మూవీని సైతం ఆయనే డైరెక్ట్ చేశారు. మృదుల్ సుజిత్ సేన్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించగా... రామ్ చరణ్ తేజ్ ప్రొడక్షన్ డిజైన్ పనులు చూసుకున్నారు. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా ఉన్నారు.
మరోవైపు.. సమంత సినిమాల విషయానికొస్తే.. ఆమె చివరిసారిగా వరుణ్ ధావన్ హీరోగా నటించిన 'సిటాడెల్: హన్నీబన్నీ' వెబ్ సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం ఆమె 'రక్త్ బ్రహ్మాండ్' యాక్షన్ సిరీస్ కోసం వర్క్ చేస్తున్నారు. రాజ్ & డీకే తెరకెక్కిస్తున్న అవైటింగ్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3'లోనూ సమంత కనిపించనున్నారు. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, జైదీప్ అహ్లవత్ తదితరులు ఈ సిరీస్‌లో కీలక పాత్రల్లో నటించనున్నారు. అలాగే.. 'మా ఇంటి బంగారం' అనే సినిమాలోనూ నటిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.



















