Jogi Ramesh Arrest: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్, నెక్ట్స్ ఏంటి?
Fake liquor case in Andhra Pradesh | నకిలీ మద్యం కేసులో ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తనకు ఈ కేసుతో ఏ సంబంధం లేదని వైసీపీ నేత ఇటీవల విజయవాడలో సత్య ప్రమాణం చేశారు.

AP Fake liquor case | విజయవాడ: ఏపీలో కలకలం రేపిన నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ టీమ్ ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి వెళ్లింది. అనంతరం పోలీసులు జోగి రమేశ్‌తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును అరెస్ట్ చేశారు. జోగి రమేశ్ చెప్పడంతోనే తాను నకిలీ మద్యం తయారు చేశానని, అంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు ఇటీవల స్టేట్మెంట్ సైతం ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసులు జోగి రమేశ్ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఎక్సైజ్ ఆఫీసుకు తరలించి విచారణ చేపట్టారు. మాజీ మంత్రి అరెస్ట్ వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది.
కలకలం రేపిన నకిలీ మద్యం కేసు
అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేసులో కీలక పరిణామం మలుపులు చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రోద్బలం మేరకు నకిలీ మద్యం తయారు చేశానని కేసులో ఏ1గా ఉన్న ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధన రావు ఇదివరకే తెలిపాడు. ఇది రాజకీయంగా కలకలం రేపింది. తనను జోగి రమేష్ ఏప్రిల్‌లో సంప్రదించి, జయచంద్రారెడ్డి సాయం తీసుకుని
నకిలీ మద్యం తయారీ చేయాలని సూచించారని, ఇబ్రహీంపట్నంలో స్టార్ట్ చేయాల్సిన యూనిట్‌ను తంబళ్లపల్లికి మార్చాలని చెప్పినట్లు వెల్లడించాడు. మొదట్లో రూ.3 కోట్లు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పిన జోగి రమేష్, తర్వాత తనను మధ్యలో వదిలేశారని ఆరోపించాడు. ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకునేందుకు ఆ డబ్బు పనికొస్తుందని ఆశపెట్టడంతో మద్యం తయారు చేసినట్లు తెలిపాడు. జోగి రమేష్ సూచనల మేరకు విషయం లీక్ చేసి రైడ్ జరిగేలా చేశానని వీడియోలో చెప్పడం తెలిసిందే. కూటమి ప్రభుత్వాన్ని నకిలీ మద్యం కేసులో విమర్శల పాలయ్యేలా చేయడమే దీని లక్ష్యమన్నాడు.

దుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేసిన జోగి రమేష్
నకిలీ మద్యం కేసులో తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, ఉద్దేశపూర్వకంగా తనను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని జోగి రమేశ్ అన్నారు. తనకు నకిలీ మద్యం కేసుతో ఏ సంబంధం లేదంటూ ఇటీవల విజయవాడలోని దుర్గగుడిలో మాజీ మంత్రి జోగి రమేష్ సత్య ప్రమాణం చేశారు. దమ్ముంటే తనకు ఈ కేసుతో సంబంధం నిరూపించాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లకు ఛాలెంజ్ చేస్తే పట్టించుకోలేదన్నారు. ప్రమాణం చేయడానికి రావాలని ఛాలెంజ్ చేస్తే చంద్రబాబు, నారా లోకేష్ రాలేదన్నారు. కానీ తాను చేసిన సవాల్ కు కట్టుబడి జోగి రమేష్ కుటుంబ సభ్యులతో వచ్చి దుర్గ గుడిలో ప్రమాణం చేశారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని చంద్రబాబు, లోకేష్ కు గతంలోనే జోగి రమేష్ విసిరారు.
దుర్గమ్మ పాదాల వద్ద ఉరేసుకుంటాను..
తనను దెబ్బకొట్టాలంటే రాజకీయంగా దెబ్బకొట్టాలని, అంతేకానీ వ్యక్తిత్వంపై దాడి చేయడం సరికాదని హితవు పలికారు. నకిలీ మద్యం కేసులో కావాలనే తనను ఇరికించే కుట్ర చేస్తున్నారని.. అందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెట్ అధికారుల రిమాండ్ రిపోర్ట్ లో తన పేరు ఎక్కడా లేదని, కానీ తనను కేసులో ఇరికించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం ఉందని నిరూపిస్తే విజయవాడ దుర్గమ్మ పాదాల వద్ద ఉరేసుకుంటానని జోగి రమేశ్ అక్టోబర్ 27న సంచలన వ్యాఖ్యలు చేశారు.






















