Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో ఆరోపణలు నిరూపిస్తే దుర్గమ్మ పాదాల వద్ద ఉరేసుకుంటా: జోగి రమేష్
AP Fake liquor case | నకిలీ మద్యం కేసుతో తనకు సంబంధం ఉందని నిరూపిస్తే దుర్గమ్మ పాదాల వద్ద ఉరేసుకుంటానని, దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని మాజీ మంత్రి జోగి రమేష్ ఛాలెంజ్ చేశారు.

Fake liquor case in Andhra Pradesh | విజయవాడ: నకిలీ మద్యం కేసులో తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదంటూ విజయవాడలోని దుర్గగుడిలో మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమాణం చేశారు. తాను చేసిన సవాల్ కు కట్టుబడి ఉంటానన్న జోగి రమేష్ కుటుంబ సభ్యులతో వచ్చి దుర్గ గుడిలో ప్రమాణం చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. తనపై చేసిన ఆరోపణల్లో నిజం ఉందని నిరూపించాలని చంద్రబాబు, లోకేష్ కు గతంలోనే జోగి రమేష్ విసిరారు. తన సవాల్ కు ఇప్పటివరకు చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పలేదన్నారు.
దుర్గమ్మ పాదాల వద్ద ఉరేసుకుంటాను..
దుర్గగుడిలో ప్రమాణం చేసిన అనంతరం జోగి రమేష్ మాట్లాడుతూ.. తనను దెబ్బకొట్టాలంటే రాజకీయంగా దెబ్బకొట్టాలని, అంతేకానీ వ్యక్తిత్వంపై కొట్టవద్దన్నారు. నకిలీ మద్యం కేసులో కావాలనే తనపై దుష్ప్రచారం, ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేసిన చంద్రబాబు, లోకేష్ నాకు సమాధానం చెప్పాలి. రిమాండ్ రిపోర్ట్ లో తన పేరు ఎక్కడా లేదన్నారు. ఒకవేళ సిట్ అధికారులు కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం ఉందని నిరూపిస్తే దుర్గమ్మ పాదాల వద్ద ఉరేసుకుంటా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు, లోకేష్ నామీద కక్ష కట్టారు. అందుకే ఎవరో చేసిన పాపాన్ని నాకు అంటగడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు. పది రోజుల కిందటే సత్య ప్రమాణానికి రావాలని చంద్రబాబు, లోకేష్ ను రావాలని కోరాను. ఒకవేళ వారు ఆలయాలకు రాలేకపోతే... చంద్రబాబు ఇంటికి వెళతామని చెప్పాను. నకిలీ మద్యం కేసుతో నాకు సంబంధం లేదని భగవద్గీతపై ప్రమాణం చేస్తానని చెప్పా. నేను చేసిన ఛాలెంజ్‌కు ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. చంద్రబాబు, లోకేష్ నేను సవాళ్లకు స్పందించలేదు. కానీ ఎక్కడో జరిగిన నకిలీ మద్యం కేసును నాకు అంటగట్టారు. నకిలీ మద్యంతో సంబంధం ఉన్న జనార్ధనరావుకి ఎయిర్ పోర్టులో రెడ్ కార్పెట్ వేసిన మంత్రికి అంతా తెలుసు. రాబోయే రోజుల్లో ప్రజాతీర్పులో చంద్రబాబును విడిచిపెట్టరు - జోగి రమేష్
ఏపీలో కలకలం రేపిన నకిలీ మద్యం కేసు
అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నేత జోగి రమేష్ సూచనల మేరకు నకిలీ మద్యం తయారు చేశానని ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధన రావు వీడియోలో తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జోగి రమేష్ ఏప్రిల్‌లో తనను సంప్రదించి, నకిలీ మద్యం తయారీ పునఃప్రారంభించాలని సూచించారని, ఇబ్రహీంపట్నంలో స్టార్ట్ చేయాల్సిన యూనిట్‌ను తంబళ్లపల్లికి మార్చాలని సూచించినట్లు తెలిపాడు. ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చినా, తర్వాత విడిచిపెట్టారని ఆరోపించాడు. జోగి రమేష్ సూచనల మేరకు విషయం లీక్ చేసి రైడ్ జరిగేలా చేశానని తెలిపాడు. కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయడమే దీని లక్ష్యమని పేర్కొన్నాడు. 
అయితే తనకు జనార్ధన రావు తెలియదని, నకిలీ మద్యం కేసుతోనూ తనకు సంబంధం లేదంటూ జోగి రమేష్ తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. జనార్ధన రావును ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. అయితే ప్రధాన నిందితుడు జనార్ధనరావుతో పరిచయంలేదని, ఎప్పుడూ కలవలేదని జోగి రమేష్ చెప్పిన తరువాత కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. అందులో నిందితుడు జనార్ధన రావుతో జోగి రమేష్ ఉన్నారు. దాంతో జోగి రమేష్ అడ్డంగా బుక్కయ్యారని టీడీపీ క్యాడర్ అంటోంది. ఒక్క లింక్ ఉందని చెప్పినా తాను బాధ్యత వహిస్తానన్న జోగి రమేష్.. నిందితుడితో కలిసి ఉన్న ఫొటోలు లీక్ అయితే సైలెంట్ అయ్యారు. నేడు దుర్గ గుడికి వచ్చిన జోగి రమేష్ నకిలీ మద్యం కేసుతో తనకు సంబంధం లేదని ప్రమాణం చేశారు.






















