Cyclone Montha Alert for AP: మొంథా తుపాను బీభత్సం.. ఏపీలో మంగళవారం వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Heavy rains in Andhra Pradesh | మొంథా తుపాను ప్రభావంతో ఏపీలో మంగళవారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

Cyclone Montha impact in Andhra Pradesh | ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ఇది గంటకు 10 కి.మీ వేగంతో కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతానికి వాయుగుండం ప్రస్తుతానికి చెన్నైకి 890 కి.మీ, పోర్ట్ బ్లెయిర్ కి 510 కి.మీ, విశాఖపట్నంకి 920 కి.మీ, కాకినాడకి 920 కి.మీ, గోపాల్‌పూర్ కి 1000 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు.
ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం తీవ్రవాయుగుండంగా మారనుంది. సోమవారం ఉదయానికి మొంథా తుపానుగా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడుతుందని ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం (అక్టోబర్ 28) సాయంత్రం/రాత్రి సమయంలో మచిలీపట్నం- కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. మొంథా తుపాను తీరము దాటే సమయంలో గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
అక్టోబర్ 27, 28 (సోమ, మంగళవారాల్లో) తేదీలలో మొంథా తుపాను ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ముందస్తు సహయక చర్యల కోసం 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాల్లో సిద్ధంగా ఉంచనున్నారు. ఇప్పటికే అల్పపీడనం ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగానికి తుపాను స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమలుపై సూచనలు ఇచ్చారు. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడనున్నందున నదులు, సముద్ర తీరాల్లో చేపలు పట్టడం, అన్ని బోటింగ్ కార్యకలాపాలు బుధవారం (అక్టోబర్ 29) వరకు నిలిపివేయాలన్నారు. అలాగే బీచ్‌లకు పర్యాటకుల ప్రవేశం కుడా నిషేధించాలని కోస్తాంధ్ర జిల్లాల కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలు సోషల్ మీడియా వదంతులను నమ్మొద్దని, అత్యవసర సమాచారం, సహయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ లోని టోల్ ఫ్రీ 112, 1070, 18004250101 నెంబర్లు సంప్రదించాలని సూచించారు. లోతట్టు ప్రాంతప్రజలు అలెర్ట్ గా ఉండాలన్నారు. తుపాను సమయంలో అత్యవసరమైతే తప్ప.. బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసారు.
తేదీల వారీగా ఏపీలో వర్ష సూచన
ఆదివారం నాడు ఏపీలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలున్నాయి. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. సోమ, మంగళవారాల్లో వాతావరణం ఎలా ఉండనుందో విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.
సోమవారం(అక్టోబర్ 27న )
అక్టోబర్ 27వ తేదీన బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. కోనసీమతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, రాయలసీమలో చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
మంగళవారం (అక్టోబర్ 28న)
మంగళవారం నాడు కాకినాడ, కోనసీమ జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమలో కడప జిల్లాలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రతో పాటు నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయి. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.






















