Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
BRS office attack | మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆఫీసులోని ఫర్నిచర్ బయటకు తెచ్చి పడేసి నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Bhadradri Kothagudem News Today | కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్ పార్టీ (Congress) కార్యకర్తలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయి. బీఆర్ఎస్ ఆఫీసులోని ఫర్నిచర్ బయటకు తీసుకువచ్చి నిప్పుపెట్టారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఆఫీసు ఆవరణలో ఉన్న పార్టీ నేతల ఫ్లెక్సీలు, బ్యానర్లు చించివేశి కాంగ్రెస్ కార్యకర్తలు వీరంగం చేశారు.
తమ వెంట తెచ్చుకున్న రంగులను బీఆర్ఎస్ పార్టీకి వేసే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అది ప్రభుత్వ స్థలం అని, బీఆర్ఎస్ హయాంలో కబ్జా చేసి పార్టీ ఆఫీసు కట్టుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశారు. ఫెక్సీలు, ఫర్నిచర్ కు నిప్పుపెట్టడంతో చుట్టుపక్కల ఇండ్లలో షార్ట్ సర్క్యూట్ అయినట్లు సమాచారం. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.
ఓటమి భయంతోనే కాంగ్రెస్ శ్రేణుల దాడులు..
ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా దాడులకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఎర్రగడ్డ డివిజన్ శాస్త్రీ నగర్ లో నిరుద్యోగ జేఏసీ నేతలపై దాడి హేయమైన చర్య. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన ఆ నిరుద్యోగ యువతపైనే దాడి చేయడం కాంగ్రెస్ నీచ రాజకీయాలకు నిదర్శనం అన్నారు.
🔹మణుగూరు @BRSparty కార్యాలయంపై పక్కా ప్రణాళిక తోనే, ప్రభుత్వ పెద్దల అండతోనే ఈ దాడి జరిగింది.
— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) November 2, 2025
🔹కాంగ్రెస్ @INCTelangana ప్రభుత్వ అరాచకత్వానికి ఈ దాడి అద్దం పడుతుంది.
🔹భద్రాద్రి రాముడున్న భద్రాద్రి కొత్తగూడెం ను కాంగ్రెస్ రాజ్యం రావణ కష్టంగా మారుస్తుంది.
🔹ఆ సమయంలో కార్యాలయంలో… pic.twitter.com/ZDfN1c0ifW
మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంపై పక్కా ప్రణాళిక తోనే, ప్రభుత్వ పెద్దల అండతోనే ఈ దాడి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకత్వానికి ఈ దాడి అద్దం పడుతుంది. భద్రాద్రి రాముడున్న కొత్తగూడెం ను కాంగ్రెస్ రాజ్యం రావణ కష్టంగా మారుస్తుందని రాకేష్ రెడ్డి విమర్శించారు. ఆ సమయంలో కార్యాలయంలో కార్యకర్తలు ఉంటే హత్య చేసేవారే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతను బొంకి, బొర్లించి ఎన్నికలు అయిపోగానే బోల్తా కొట్టారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ ఇలా నోటికొచ్చిన హామీ ఇచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. మావల్ల మీకు ఉద్యోగాలు వచ్చాయి. మరి, మా ఉద్యోగాల సంగతి ఏంటని ప్రశ్నిస్తే, ఇన్నాళ్లు అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులకే తెగబడుతున్నారు. ఇది ప్రజా పాలన కాదు, ప్రతీకార పాలన, పైశాచిక పాలన అన్నారు.
2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏమి లేక, అక్రమ కేసులు, బెదిరింపులు, దాడులనే నమ్ముకున్నారు. ఆఖరికి అభ్యర్థి సైతం బాధ్యత మరిచి ఉరికించి కొడతాం. రోడ్ల మీద తిరగనీయం అని బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అన్నం పెట్టినోళ్ళకు సున్నం పెట్టడం వెన్నతో పెట్టిన విద్య. నాడు మార్పు పేరుతో మీ గెలుపు కృషి చేసిన చేతులకే నేడు మీరు సంకెళ్ళు వేస్తున్నారు. రేపు అవే గొంతులు ఏకమై మీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తాయన్నారు.
అభివృద్ధి చేయలేకనే ఈ అసహనం. అరాచకాలతో, దారులతో, హింసతో అధికారాన్ని కొనసాగించలేరు. జూబ్లిహిల్స్ దెబ్బతోనే మీ పతనం ఖాయం. ఈ రోజు మీరు దాడి చేసిన ఆ నిరుద్యోగ యువతే జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్ ను బొందపెట్టి విజయోత్సవ ర్యాలీ చేస్తారని హెచ్చరించారు.






















