Yevam Movie Review - యేవమ్ రివ్యూ: అపరిచితుడు క్రిమినల్ అయితే? చాందిని చౌదరి సినిమా హిట్టా? ఫట్టా?
Yevam Review in Telugu: పవన్ గోపారాజుతో కలిసి నవదీప్ నిర్మించిన సినిమా 'యేవమ్'. చాందినీ చౌదరి, వశిష్ఠ సింహ, జై భరత్ రాజ్, అషు రెడ్డి ప్రధాన తారాగణం. ఈ సినిమా ఎలా ఉందంటే?
ప్రకాష్ దంతులూరి
చాందినీ చౌదరి, వశిష్ఠ సింహా, జై భరత్ రాజ్, గోపరాజు రమణ, దేవి ప్రసాద్ తదితరులు
Chandni Chowdary's Yevam Movie Review In Telugu: హీరో నవదీప్ నిర్మించిన లేటెస్ట్ సినిమా 'యేవమ్'. పవన్ గోపరాజు మరో నిర్మాత. తెలుగమ్మాయి చాందినీ చౌదరి, వశిష్ఠ సింహ, జై భరత్ రాజ్, అషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహించారు. ప్రచార చిత్రాలతో ప్రేక్షకులను ఆకర్షించిన చిత్రమిది. డిఫరెంట్ సినిమా అనే ఫీలింగ్ కలిగించింది. మరి, మూవీలో కూడా మెప్పిస్తుందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.
కథ (Yevam Movie Story): కట్టుకున్న భార్య హారిక (అషు రెడ్డి) బెడ్ మీద మరొక వ్యక్తితో ఉండగా ఆ గదిలోకి వచ్చిన యుగంధర్ (వశిష్ఠ సింహా)... కోపంతో ఇద్దర్నీ చంపేస్తాడు. ఆ తర్వాత ప్రభాస్ (Prabhas)తో డిన్నర్ చేసే అవకాశం అంటూ తనను యుగంధర్ మోసం చేశాడని కీర్తీ (యానీ ఫిర్యాదు ఇవ్వడానికి వస్తే... వికారాబాద్ పోలీస్ స్టేషన్ అధికారులు పట్టించుకోరు. ఆ తర్వాత మరొక అమ్మాయి హత్య జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)తో యాడ్ షూట్ అంటే వెళ్లిన ఆమె విగత జీవిగా పడి ఉంటుంది. కొత్తగా ఉద్యోగంలో చేరిన పిఎస్సై సౌమ్య (చాందినీ చౌదరి) ఆ యుగంధర్ ఎవరో పట్టుకోవాలని ట్రై చేస్తుంది. మహేష్ బాబు అభిమానిని ట్రాప్ చేయబోతే... ఆ అమ్మాయి బదులు సౌమ్య వెళుతుంది.
మహేష్ బాబు అభిమాని కాకుండా సౌమ్య రావడంతో యాక్సిడెంట్ చేస్తాడు యుగంధర్. ఆ తర్వాత ఏమైంది? సౌమ్యకు ఎస్సై అభి (జై భరత్ రాజ్) నుంచి ఎటువంటి సపోర్ట్ లభించింది? వాళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని న్యూస్ రావడానికి కారణం ఏమిటి? నిజంగా వాళ్ళ మధ్య ఏముంది? అభి, యుగంధర్ చేతుల్లో మరణించిన హారిక మధ్య రిలేషన్ ఏంటి? అభి గతం ఏమిటి? యుగంధర్ దొరికాడా? లేదా? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Yevam Movie Review): పేపర్ మీద గొప్పగా కనిపించిన ప్రతి ఐడియా తెరపైకి వచ్చే సరికి గొప్పగా ఉంటుందని గ్యారంటీ లేదు. కొన్ని కథలు ఐడియా స్టేజిలో బాగుంటాయి. ఐడియా నుంచి కథగా మారినప్పుడు కూడా బాగుంటాయి. అయితే... కొన్నిసార్లు ఐడియా నుంచి స్క్రిప్ట్ / స్క్రీన్ మీదకు వచ్చేటప్పుడు తప్పులు జరుగుతాయి. దాంతో గొప్ప ఐడియా బ్యాడ్ ఫిల్మ్ అవుతుంది. లేదంటే విజయానికి కొంత దూరంలో ఆగుతుంది. 'యేవమ్' ఆ జాబితాలోకి వచ్చే చిత్రమే.
'యేవమ్' సినిమాకు వస్తే... ఇదొక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. సాధారణంగా థ్రిల్లర్ సినిమాలు అంటే సిటీ, టౌన్ నేపథ్యంలో తీస్తుంటారు. వికారాబాద్ నేపథ్యంలో తీయడం ఈ సినిమా స్పెషాలిటీ. దాంతో స్క్రీన్ మీద నేటివ్ ఫీల్, కొత్త బ్యాక్‌డ్రాప్ వచ్చాయి. ఆ ఒక్కటీ తప్పిస్తే... మిగతాదంతా రొటీన్, నథింగ్ ఎగ్జైటింగ్! లాజిక్స్ వంటివి ఆలోచిస్తే ఇంకా తప్పులు కనిపిస్తాయి. నిజానికి, సినిమా స్టార్టింగ్ సీన్ షాక్ ఇస్తుంది. పెళ్లాన్ని ఒకడు చంపేసి ఊరిలో అమ్మాయిల్ని ట్రాప్ చేస్తుంటే? ఆ ట్రాప్ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ, ఆ మర్డర్ కేసును వదిలేశారు. నెక్స్ట్ కేస్ ఇన్వెస్టిగేషన్ కూడా సీరియస్‌గా సాగదు. జై భరత్ రాజ్, చాందినీ మధ్య సన్నివేశాలు ప్రేమ వైపు సినిమాను లాగాయి.
సినిమా పడుతూ లేస్తూ ముందుకు వెళ్లినప్పటికీ... ఇంటర్వెల్ ట్విస్ట్ షాక్ ఫ్యాక్టర్ ఇస్తుంది. కథపై ప్రేక్షకుడికీ క్లారిటీ వస్తుంది. సినిమాకు మెయిన్ ప్రాబ్లమ్ అదే. అసలు విలన్ ఎవరో తెలిశాక సన్నివేశాలు గానీ, స్క్రీన్ ప్లే గానీ పరుగులు పెడితే ప్రేక్షకుడిలో ఉత్కంఠ కలుగుతుంది. ప్రేక్షకుడికి తెలిసిన ట్విస్ట్ స్క్రీన్ మీద క్యారెక్టర్లకు తెలియని సమయంలో ఆ ఉత్కంఠ మరింత పెరగాలి. 'యేవమ్'లో అంతా రివర్స్. ఏ దశలోనూ విలన్ వల్ల ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకు ఏం అవుతుందోనని ఆందోళన గానీ, ఉత్కంఠ గానీ ఉండవు. నత్తనడకన సాగుతుంది. దాంతో క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందోనని వెయిట్ చేయాల్సిన పరిస్థితి. దర్శకుడు ఫైయిలైన పలు సందర్భాల్లో కీర్తనా శేష్ నేపథ్య సంగీతం సన్నివేశాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేసింది. రీ రికార్డింగ్ బావుంది. ఎస్వీ విశ్వేశ్వర్ కెమెరా వర్క్ కూడా!
వశిష్ఠ సింహాకు అతని గొంతు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. గంభీరమైన స్వరంతో చెప్పే డైలాగుల వల్ల స్క్రీన్ మీద మరింత ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. స్టార్టింగ్ సీన్స్, ఆ ఇంటర్వెల్ ఆకట్టుకోవడానికి కారణం అతనే. చాందినీ చౌదరిని పోలీస్ గెటప్‌లో చూడటం కొత్తగా ఉంటుంది. నటిగా ఆవిడకు సవాల్ విసిరే క్యారెక్టర్ ఏమీ కాదు. ఆ పాత్రకు అనుగుణంగా నటించారు. అషురెడ్డి గ్లామరస్ రోల్ చేశారు. ఆవిడకు పెద్ద స్క్రీన్ స్పేస్ లభించలేదు. జై భరత్ రాజ్ ఓకే. గోపరాజు రమణ, దేవి ప్రసాద్ రెగ్యులర్ రోల్స్ చేశారు.
ట్విస్ట్ రివీల్ చేయకుండా క్లుప్తంగా 'యేవమ్' కథ చెప్పాలంటే... 'అపరిచితుడు క్రిమినల్ అయితే' అనేది కాన్సెప్ట్. 'అపరిచితుడు'లో చియాన్ విక్రమ్ అవినీతి పరుల అంతు చూస్తే... 'యేవమ్'లో అపరిచితుడిలో నేరస్థుడిని పట్టుకోవడం కోసం పోలీసులు చేసిన ప్రయత్నాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. రెగ్యులర్ రొటీన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. వశిష్ఠ సింహా నటన బావుంది. చాందినీ చౌదరి కొత్తగా ప్రయత్నించారు. వాళ్లిద్దరి కోసం రెండున్నర గంటలు చూడలేం. వీకెండ్ వాచ్ లిస్టు నుంచి సినిమాను తీసేయవచ్చు. యేవమ్... థియేటర్లకు వెళ్ల చూడలేమ్!
Also Read: మహారాజ రివ్యూ: తమిళంలో బ్లాక్ బస్టర్ రిపోర్ట్, మరి తెలుగులో? - విజయ్ సేతుపతి 50వ సినిమా ఎలా ఉందంటే?