Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
Posani: పోసాని కృష్ణమురళి కి అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. ఇతర కేసులలో నోటీసులు ఇవ్వాలని హైకోర్టు సూచించింది.

Posani Krishna Murali bail : వైసీపీ నాయకుడు, సినీ రచయిత పోసాని కృష్ణమురళికి రిలీఫ్ లభించింది.ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్ వచ్చింది. రాజంపేట, నరసరావుపేటలో బెయిల్ ఇప్పటికే బెయిల్ మంజూరు అయింది. మొత్తం నాలుగు కేసుల్లో పోసానికి బెయిల్ లభించింది. ఇతర కేసుల్లో BNS చట్టం కింద పోసానికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం కర్నూలు జైలులో ఉన్న పోసాని కృష్ణమురళి.. బుధవారం జైలు నుంచి పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇష్టం వచ్చినట్లుగా టీడీపీ, జనసేన అగ్రనేతల్ని దూషించిన పోసాని
వైసీపీ నాయకుడిగా ఉంటూ పోసాని కృషమురళి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లను వారి కుటుంబాలను, పిల్లలను కూడా ఇష్టం వచ్చినట్లుగా తిట్టడంతో అనేక కేసులు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత కూడా ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడుపై తిట్లందుకున్నారు. ఈ విషయంలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. అయితే హఠాత్తుగా తాను రాజకీయాల నుంచి విరమించుకున్నానని ఇక రాజకీయాలు మాట్లాడబోనని ప్రకటించి సైలెంట్ అయిపోయారు. కానీ ఆయనపై కేసులు మాత్రం కొనసాగుతున్నాయి.
మొదట రాజంపేట పోలీసుల అరెస్టు - తర్వాత పీటీ వారెంట్లు
ఫిబ్రవరి 26వ తేదీన ఆయనను రైల్వే కోడూరు పోలీసులు మొదట హైదరాబాద్ లోని మైహోంభూజాలో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనపై నమోదైన కేసుల్లో పోలీసులు పీటీ వారెంట్లు జారీ చేసి.. వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పారు. నర్సరావుపేట కోర్టు ఆయనకు రెండు రోజుల కస్టడీ కూడా ఇచ్చింది. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని.. బెయిల్ ఇవ్వాలని పోసాని పిటిషన్లు వేసుకున్నారు. తనకు ఆరోగ్యం బాగోలేదని రెండు సార్లు సర్జరీలు జరిగాయని.. రాష్ట్రమంతటా తిరగలేకపోతున్నానని ఓ సారి కోర్టు ముందు హాజరు పరిచినప్పుడు న్యాయమూర్తికి చెప్పుకున్నారు.
బుధవారం విడుదలయ్యే అవకాశం
రాజంపేట సబ్ జైల్లో ఉన్నప్పుడు గుండెపోటు, కడుపు నొప్పి అని నాటకం ఆడటంతో పోలీసులు సీరియస్ అయ్యారు.వైసీపీ తరపున పలువురు లాయర్లు ఆయన కోసం ప్రయత్నాలు చేశారు. చివరికి రెండు వారాల పాటు జైల్లో ఉండి అటూ ఇటూ తిప్పిన తర్వాత ఇక ఇప్పుడల్లా బెయిల్ రాదేమోనని కంగారు పడుతున్న సమయంలో ఆయనకు బెయిల్ లభించింది. బుధవారం ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. రైల్వే కోడూరు పోలీసులకు ఆయన తనకు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు స్క్రిప్టులు పంపేవారని.. అందుకే తిట్టేవాడ్ని అని చెప్పారు. ఈ మేరకు వారిని కూడాపోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉండటంతో వారిద్దరూ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇంకా ఆ పిటిషన్లు విచారణకు రాలేదు.



















