Harom Hara Movie Review - 'హరోం హర' రివ్యూ: కుప్పంలో కేజీఎఫ్ రేంజ్ కథ - సుధీర్ బాబుకు విక్రమ్ రేంజ్ ఎలివేషన్స్!
Harom Hara Review In Telugu: సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా 'హరోం హర'. కుప్పం నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్. నేడు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?
జ్ఞానసాగర్ ద్వారక
సుధీర్ బాబు, సునీల్, మాళవికా శర్మ, వి జయప్రకాశ్, రవి కాలే, లక్కీ లక్ష్మణ్, అర్జున్ గౌడ, అక్షరా గౌడ తదితరులు
Sudheer Babu's Harom Hara Movie In Telugu: జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమా సినిమాకూ మార్పు చూపించాలని తపన పడే కథానాయకుడు సుధీర్ బాబు. ఆయన కొత్త సినిమా 'హరోం హర' నేడు విడుదలైంది. దీనిని 'సెహరి' ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి నాయుడు నిర్మించారు. కుప్పం నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ ఫిల్మ్ ఇది. ప్రచార చిత్రాలు బావున్నాయి. మరి సినిమా? ఎలా ఉందో రివ్యూలో చూడండి.
కథ (Harom Hara Movie Story): కుప్పంలో తమ్మి రెడ్డి (కేజీఎఫ్ నటుడు లక్కీ లక్ష్మణ్) అడుగుపెట్టిన నేల, బసవ రెడ్డి (రవి కాలె) చూపు పడిన మహిళ మీద ప్రజలు ఆశలు వదులుకోవాలి. లేకుంటే ప్రాణాలు పైలోకాలకు పోతాయి. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రజలంతా పొరుగూళ్లకు వెళతారు. అటువంటి సమయంలో కుప్పం పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్యోగానికి వస్తాడు సుబ్రమణ్యం (సుధీర్ బాబు).
తమ్మి రెడ్డి మనుషులతో గొడవ కారణంతో సుబ్రమణ్యం ఉద్యోగం పోతుంది. ఊరు వెళితే తండ్రి శివారెడ్డి (వి జయప్రకాశ్)కి అప్పులు ఇచ్చినోళ్లు అంతా ఇంటి మీద పడతారు. మూడు నెలల్లో బాకీ తీరుస్తానని వాళ్లకు మాట ఇచ్చి కుప్పం వస్తాడు. సస్పెండ్ అయిన పోలీస్ పళని స్వామి (సునీల్)తో కలిసి అక్రమంగా తుపాకీలు తయారు చేసి అమ్మడం మొదలు పెడతారు. తమ్మి రెడ్డి కొడుకు శరత్ రెడ్డి (అర్జున్ గౌడ), మనుషులతో స్నేహం ఏర్పడుతుంది. అయితే... ఒక రోజు తన తండ్రిని చంపబోయిన శరత్ రెడ్డిని సుబ్రమణ్యం కొడతాడు.
తమ్మి రెడ్డికి ఎదురు తిరిగిన సుబ్రమణ్యం... ఆ తర్వాత కుప్పం ప్రజల కోసం ఏం చేశాడు? ప్రజలు అతడిని ఎందుకు దేవుడిగా చూస్తున్నారు? తన కొడుకు మృతికి కారణమైన సుబ్రమణ్యం మీద పగ తీర్చుకోవాలని తమ్మి రెడ్డి ఏం చేశాడు? సుబ్రమణ్యం ఎలా ఎదుర్కొన్నాడు? అసలు సుబ్రమణ్యం తండ్రిని శరత్ రెడ్డి ఎందుకు చంపాలని అనుకున్నాడు? ఆ తర్వాత ఏమైంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Harom Hara Review Telugu): ట్రెండ్... ఒక్కోసారి సినిమా ఇండస్ట్రీలో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం వస్తున్న యాక్షన్ ఫిల్మ్స్ చూస్తుంటే... ఇండియన్ ఇండస్ట్రీలో కేజీఎఫ్ ట్రెండ్ నడుస్తుందని చెప్పాలి. యాక్షన్ సినిమాల గురించి మాట్లాడాల్సి వస్తే... 'కేజీఎఫ్'కు ముందు, తర్వాత అని చెప్పాలి. హీరోను, హీరోయిజాన్ని చూపించడంలో 'కేజీఎఫ్' ట్రెండ్ సెట్ చేసింది. ఆ ట్రెండ్ ఫాలో అవుతూ తీసిన చిత్రమే 'హరోం హర'.
ఓ ప్రాంతాన్ని శాశించే విలన్, వాళ్ళకు ఎదురు తిరిగిన సామాన్యుడు, తమ కష్టాలు తీర్చడంతో ఆ సామాన్యుడిని దేవుడిగా కొలిచే ప్రజలు... కమర్షియల్ టెంప్లేట్‌లో, రెగ్యులర్ ఫార్ములాలో తీసిన సినిమా 'హరోం హర'. దీనికి కుప్పం నేపథ్యం కొత్త సొగసు తీసుకొచ్చింది. మన మట్టి మీద సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఆ విషయంలో ప్రొడక్షన్ డిజైనర్ మనీషా ఎ దత్, ఛాయాగ్రాహకుడు అరవింద్ విశ్వనాథన్, సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్... ఈ ముగ్గుర్నీ మెచ్చుకోవాలి. టెక్నికల్ టీమ్ నుంచి దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక మంచి అవుట్‌పుట్ తీసుకున్నారు. చైతన్ భరద్వాజ్ పాటలు, నేపథ్య సంగీతం సూపర్బ్. నిర్మాత ఖర్చుకు వెనుకాడలేదు. అది స్క్రీన్ మీద తెలుస్తుంది. కథ విషయంలో కొత్తగా ఆలోచించి ఉంటే బావుండేది.
కథలో కొత్తదనం లేకపోయినా కామన్ ఆడియన్ మైండ్‌లో మరొక సినిమా గుర్తుకు రాలేదంటే... మూవీలో ఎమోషన్ వర్కవుట్ అయితే... సినిమా సక్సెస్ అయినట్టే! 'హరోం హర'లో ప్రాబ్లమ్ ఏమిటంటే... సినిమా ప్రారంభమైన అరగంట వరకు కొత్త ప్రయత్నం చేశారని అనిపిస్తుంది. ఆ తర్వాత 'కేజీఎఫ్', 'పుష్ప', 'విక్రమ్' ఛాయలు కనిపిస్తాయి. ఆయా సినిమాల్లోని సన్నివేశాల స్ఫూర్తితో కొత్త సన్నివేశాలు తీశారని అనిపిస్తుంది. దాంతో కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ మిస్ అవుతుంది. కథకు కీలకమైన తండ్రి కొడుకుల బాండింగ్, ఎమోషన్ ఆశించిన రీతిలో వర్కవుట్ కాలేదు. అందువల్ల, అడ్రినల్ రష్ ఇవ్వాల్సిన క్లైమాక్స్ సాదాసీదాగా మిగిలింది.
Also Read: మహారాజ రివ్యూ: తమిళంలో బ్లాక్ బస్టర్ రిపోర్ట్, మరి తెలుగులో? - విజయ్ సేతుపతి 50వ సినిమా ఎలా ఉందంటే?
'హరోం హర' కోసం సుధీర్ బాబు పడిన కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ లుక్, యాక్టింగ్, యాటిట్యూడ్ మైంటైన్ చేశారు. యాస కూడా బాగా పలికారు. 'పుష్ప'లో చిత్తూరు యాస పలికిన సునీల్... మరోసారి ఆ యాస మాట్లాడుతూ కనిపించారు. తెలుగు హీరోలకు తండ్రి క్యారెక్టర్లు చేసి చేసి నటుడు వి జయప్రకాశ్ మొనాటనీ తెప్పిస్తున్నారు. టిపికల్ కమర్షియల్ సినిమాలో హీరోయిన్ రోల్ చేశారు మాళవికా శర్మ. చీరల్లో చక్కగా ఉన్నారు. లక్కీ లక్ష్మణ్, రవి కాలే, అర్జున్ గౌడవి రెగ్యులర్ విలన్ రోల్స్. ఆయా పాత్రలకు తగ్గట్టు చేశారు. అక్షరా గౌడ పోలీస్ అధికారి పాత్రలో కనిపించారు.
కేజీఎఫ్ కథను కుప్పం ప్రాంతానికి తీసుకొస్తే, గన్ డీలింగ్ నేపథ్యంలో తీస్తే... 'హరోం హర'. హీరో, విలన్ మధ్య క్లైమాక్స్ ఫైటుకు 'విక్రమ్' టచ్ ఇస్తే... 'హరోం హర'. ఇక, ఆ చిత్తూరు యాసతో పాటు కథలో కొన్ని సన్నివేశాలు 'పుష్ప'ను సైతం గుర్తు చేశాయి. కథ, కథనం, ఆ సీన్స్ పక్కన పెడితే... సుబ్రమణ్యం పాత్రలో సుధీర్ బాబు కొత్తగా కనిపించారు. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్, ఛాయాగ్రాహకుడు అరవింద్ విశ్వనాథన్, ప్రొడక్షన్ డిజైనర్ మనీషా దత్ బెస్ట్ వర్క్ ఇచ్చారు. సుధీర్ బాబును 'కేజీఎఫ్', 'పుష్ప' రేంజ్ ఎలివేషన్స్‌లో చూడాలని కోరుకునే అభిమానులకు నచ్చుతుంది. సాధారణ ప్రేక్షకులకు ఓకే అనిపిస్తుంది.
Also Read: రష్ రివ్యూ: ETV Winలో యాక్షన్ థ్రిల్లర్ - రవిబాబు సినిమా బావుందా? లేదా?