Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
మెల్ బోర్న్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. రెండో రోజు 163 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. స్మిత్ భారీ సెంచరీ సాధించాడు.
Boxing Day Test LIve Updates: భారత్ తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. శుక్రవారం రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు ఆరు వికెట్లకు 311 పరుగులతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ సూపర్ సెంచరీ(197 బంతుల్లో 140 13 ఫోర్లు, 3 సిక్సర్లు)తో తనెంత ప్రమాదకర ఆటగాడో మరోసారి చాటాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని కెప్టెన్ పాట్ కమిన్స్ (63 బంతుల్లో 49, 7 ఫోర్లు)తో కలిసి ఏడో వికెట్ కు 112 పరుగులు జోడించాడు. కమిన్స్ త్రుటిలో ఫిఫ్టీని చేజార్చుకున్నాడు. దీంతో ఈ టెస్టులో కంగారూలు ఈ టెస్టులో తిరుగులేని స్థితికి చేరుకున్నారు. ఇప్పుడంతా బ్యాటర్లపైనే భారం ఉంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి 3 పరుగులకే వెనుదిరిగాడు. కమిన్స్ బౌలింగ్ లో బొలాండ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
Innings Break!
— BCCI (@BCCI) December 27, 2024
Australia are all out for 474 runs.
4/99 - Jasprit Bumrah
3/78 - Ravindra Jadeja
Scorecard - https://t.co/MAHyB0FTsR… #AUSvIND pic.twitter.com/IHyCweNUV1
ఫుల్ డామినేషన్..
ఇక రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ తొలి సెషన్ లో ఫుల్ డామినేషన్ చూపించింది. ముఖ్యంగా స్మిత్, కమిన్స్ జంట 27 ఓవర్లలో 143 పరుగులు జోడించారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. కొత్త బంతితో కూడా భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయారు. ఈ సెషన్ లో దాదాపు 5 పరుగుల రన్ రేట్ తో పరుగులు సాధించారు. ఈ క్రమంలో స్మిత్ టెస్టుల్లో 34వ సెంచరీ సాధించాడు. ఈ సిరీస్ లో తనకిది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. బ్రిస్బేన్ లో జరిగిన మూడో టెస్టులోనూ తను సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు కమిన్స్ కూడా ఒక ఎండ్ లో నిలబడి, స్మిత్ కు సహకారం అందించడమే కాకుండా అడపాదడపా బౌండరీలు బాదాడు. దీంతో లంచ్ వరకు వేగంగా పరుగులు సాధిస్తూ సెషన్ ను ముగించింది.
ఆదుకున్న జడేజా..
దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ కొన్ స్టాస్ ను పెవిలియన్ కు పంపి, భారత్ ను ఊపిరి పీల్చుకునేలా చేసిన రవీంద్ర జడేజా.. ఈసారి కూడా ఆపద్భాందవుడి పాత్ర పోషించాడు. చాలా ఫ్రస్ట్రేషన్ కు గురి చేసిన ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఇన్నింగస్ 105వ ఓవర్ బౌల్ చేసిన జడ్డూ.. తొలి బంతిని ఔట్ సైడ్ ఆఫ్ లో వేయగా, దాన్ని భారీ షాట్ ఆడేందుకు కమిన్స్ ప్రయత్నించాడు. అయితే తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి పరుగెత్తుతూ వచ్చి పట్టిన అద్భుతమైన క్యాచ్ కు కమిన్స్ పెవిలియన్ కు చేరాడు. ఈ తర్వాత మిషెల్ స్టార్క్ (15), నాథన్ లయోన్ (13) ల సహకారాంతో జట్టు స్కోరును 450 మార్కును స్మిత్ దాటించి, తొమ్మిదో వికెట్ గా వెనుదిరిగాడు. చివరి వికెట్ ను తీసిన బుమ్రా.. ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు (4/99) తో రాణించాడు. జడేజాకు మూడు , ఆకాశ్ దీప్ కు రెండు, వాషింగ్టన్ సుందర్ కు ఒక వికెట్ దక్కింది. ఐదు టెస్టుల బోర్డర్ -గావస్కర్ ట్రోఫీ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టును భారత్ నెగ్గగా, రెండో టెస్టును ఆసీస్ కైవసం చేసుకుంది. ఇక మూడో టెస్టు వర్షం అంతరాయం కలిగించడంతో డ్రాగా ముగిసింది. మరోవైపు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ చేరుకోవాలంటే ఈ మ్యాచ్ లో నెగ్గడం ఇరుజట్లకు తప్పనిసరి.