Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP Desam
90వ దశకంలో దేశం పూర్తిగా ఆర్థిక కష్టాల్లో ఇరుక్కుపోయినప్పుడు నేనున్నానంటూ తన మేథస్సుతో మన దేశాన్ని నిలబెట్టిన మహానుభావుడు మన్మోహన్ సింగ్. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కోరికతో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్...తన అపరమేథస్సుతో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే ఈరోజు మన దేశాన్ని ఇంత పటిష్ఠంగా ప్రపంచదేశాల ముందు నిలబెట్టగలిగాయి. 2004 నుంచి 2014 వరకూ దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ మౌనమునిగా ఉంటూనే దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడ్డారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, లైసెన్స్ రాజ్ ల రద్దు, విదేశీపెట్టుబడులకు స్వాగతం పలకటం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం ఇలా ఎన్నో మైలురాళ్లు అన దగ్గ చట్టాల రూపకల్పన మన్మోహన్ జీ హయాంలోనే జరిగాయి. విదేశాల్లో ఆర్థిక శాస్త్రంలో ఆయన ఉన్నత విద్యలను అభ్యసించారు. కేంబ్రిడ్జ్, ఆక్స్ ఫర్డ్ ఇలా మన్మోహన్ సింగ్ చదువుకోని ప్రఖ్యాత యూనివర్సిటీ లేదు. ఆర్బీఐ గవర్నర్ గా, ఆర్థికమంత్రి, ఈ దేశానికి రెండు సార్లు ప్రధానమంత్రిగా అత్యంత కఠిన పరిస్థితుల్లో పనిచేసిన మన్మోహన్ సింగ్ ప్రతీ సారి తన మేథస్సుతోనే పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. దేశాన్ని స్థిరంగా నిలబెట్టగలిగారు.అందుకే సిద్ధాంతపరంగా, పార్టీల పరంగా భావపరమైన వైరుద్ధ్యాలు ఉన్నప్పటికీ అందరూ రాజకీయాలకు అతీతంగా మన్మోహన్ సింగ్ ను గౌరవిస్తారు. అలాంటి ఓ లెజెండ్, అలాంటి ఓ ఆర్థికవేత్త ను కోల్పోవటంతో ఓ శకం ముగిసిందనే చెప్పాలి.